ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - Sep 23, 2020 , 03:19:24

పల్లెకు జీవం

పల్లెకు జీవం

  • పల్లెల్లో గ్రామ స్వరాజ్యం 
  • అభివృద్ధిలో దూసుకెళ్తున్న తెలంగాణ పల్లెలు 

ఇల్లెందు:తెల్లవారు జామున కోడి కూయడం.. గుడిలో సుప్రభాతం ప్రారంభం కావడంతో పల్లె నిద్ర లేవడం ఆనవాయితీ. అప్పుడే లేచిన రైతన్న నాగలిని భుజానా వేసుకొని పొలం పనులకు బయలుదేరడం! ఆడపడుచులు లేచి వాకిలి ఊడ్చటం, ముగ్గులు వేయడం తెలంగాణ పల్లె జీవన విధానం.  పల్లెకు మరోకొత్త కళ వచ్చింది. తండాలు , గూడేలు, కూగ్రామాలు పంచాయతీలుగా ఏర్పడ్డాయి. మొన్నటికి మొన్న పల్లెల్లో పంచాయతీ పాలన కొలువుదీరింది. అభివృద్ధి పరుగులు తీస్తూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారమవుతూ గ్రామాలు కళకళలాడుతున్నాయి. దేశానికి ఆదర్శంగా తెలంగాణ పల్లెలు అభివృద్ధ్ది చెందుతున్నాయి. వందలాది కోట్లతో మారుమూల పల్లెలకు రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రతి తండా, గూడెం, ఆవాసం, పంచాయతీలకు పెద్దఎత్తున ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ వస్తున్నది. ఎటువైపు చూసిన అభివృద్ధి నమూనా కనపడుతున్నది. గతంలో ఎక్కడ చూసినా కరువు తాండవించేది. ఇప్పుడు బీడు భూములన్నీ సాగయ్యే దశకు చేరుకున్నాయి.  మిషన్‌ కాకతీయతో ఎక్కడ చూసిన జలకళ సంతరించుకుంటుంది. ఏడాది పొడవునా చెరువుల్లో నీళ్లు ఉంటున్నాయి.. 

సాగు చిత్రం భళా..

పల్లెల్లో హరిత విప్లవం కొనసాగుతుంది. మెట్టలో పత్తి, మిర్చి, ఆహార, పప్పుధాన్యాల పంటలను సాగుచేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన సంస్కరణలతో ఇప్పుడు సాగు చిత్రం మారింది. హరిత విప్లవం ప్రారంభమైంది. ఖరీఫ్‌తో పాటు యాసంగిలో ఆహారధాన్యాల పంటలు సాగుచేస్తున్నారు. భూగర్భజలాలు ఆశాజనకంగా ఉండడంతో రైతన్న అవసరమైతే మూడు పంటలు వేయడానికి సంసిద్ధ్దతను వ్యక్తంచేస్తున్నారు. 

  విద్యా వికాసం  

మారుమూల పల్లెలన్నీ గతంలో చదువుకు దూరంగా ఉండేవి. పదికి లోపే చదువులు పూర్తి చేసే యువకులు, యువతులు ఉండేవారు. ప్రాథమిక విద్యలోనే మరికొందరూ చదువుకు దూరమయ్యే వారు. పరిస్థితులు మారి ఉన్నత చదువుల బాట పట్టారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు గురుకులాలు ఏర్పాటు చేశారు. గురుకులాల  ఏర్పాటు అన్ని వర్గాల వారికి వరంగా మారాయి.  

 అందుబాటులోకి వైద్యం  

ఒకప్పుడు పల్లెల్లో వైద్యం ఇబ్బంది కరంగా ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పల్లెల్లో వైద్య సదుపాయం అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం కేసీఆర్‌ కిట్లతో సహా అన్ని రోగాలకు ఉచితంగా మందులు ఇస్తున్నది..ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను పల్లెలన్ని దీటుగా ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ వైద్యశాలలో పరీక్షలు చేయించుకుంటూ పాజిటివ్‌గా నిర్దారణ అయితే హోంక్వారంటైన్‌, ఐసోలేషన్‌లో మందులతో చికిత్స పొందుతున్నారు. 

 పాడి, పంటలు

పల్లెల్లో పాడి, పంటలు విలసిల్లుతున్నాయి. ముఖ్యంగా పాడి పరిశ్రమ మీద కుటుంబాలు ఆధారపడుతున్నాయి.  ఉదయాన్నే లేచి పల్లె మహిళాలంతా పాలతో పట్టణానికి పయనమవుతున్నారు. ఏజెన్సీలో ప్రతి రోజు మారుమూల పల్లెల నుండి పట్టణానికి పాలు తీసుకొని వచ్చే మహిళాలు లెక్కకు మించి ఉన్నారు. అదే విధంగా  సాగును నమ్ముకున్న రైతాన్నలంతా కూరగాయలు, ఆకుకూరలను కూడా సాగు చేసి ఆదాయాన్ని గడిస్తున్నారు. . ఏజెన్సీ నుంచి కూరగాయలు, ఆకుకూరలను పండించి పట్టణ ప్రాంతాలు, జిల్లా కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. ఉద్యానవన శాఖ, అగ్రికల్చర్‌ విభాగం ప్రొత్సహిస్తుండటంతో రైతులు అభివృద్ధి చెందుతున్నారు.