శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - Sep 21, 2020 , 00:31:26

సైబ‌ర్ దొంగ‌ల గాలం

సైబ‌ర్ దొంగ‌ల గాలం

  •  నకిలీ పోలీసుతో ఫేస్‌"బుక్‌ అవ్వొద్దు’
  • పోలీస్‌ అధికారుల ‘ఎఫ్‌బీ’ ఖాతాల పేరుతో సామాన్యులను టార్గెట్‌
  • విశ్రాంత, ప్రస్తుత అధికారుల పేర్లతో ఫేక్‌ అకౌంట్స్‌
  • పోలీస్‌ అధికారుల ఫ్రెండ్‌ లిస్ట్‌లో ఉన్నవారికి రిక్వెస్ట్‌
  • అప్పు కావాలంటూ డబ్బులు డిమాండ్‌
  • డబ్బు చేతికందగానే.. ప్లేటు ఫిరాయింపు

‘ఈ మధ్య మీకు డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ వంటి పోలీసు అధికారుల నుంచి ఫేస్‌"బుక్‌' రిక్వెస్ట్‌లు వస్తున్నాయా? పోలీసులే మీకు రిక్వెస్ట్‌ పెట్టేశారని.. సంబరపడిపోయి వాటిని యాక్సెప్ట్‌ చేస్తున్నారా? మెల్లిగా మాటల్లో దింపి.. మెసెంజర్‌లో అప్పు కావాలని అడుగుతున్నారా? అయితే కొంచెం జాగ్రత్తండోయ్‌..! ఎందుకంటే సైబర్‌ దొంగలు రూటు మార్చారు. ఏకంగా పోలీసుల పేరుతో ఫేక్‌ అకౌంట్లు క్రియేట్‌ చేసి, డబ్బులు దండుకుంటున్నారు. మీరు తొందరపడి డబ్బులు చేజార్చుకోవద్దని ఏకంగా పోలీసులే ప్రకటించాల్సిన దుస్థితి ఏర్పడింది. నకిలీ పోలీసుకు ఫేస్‌"బుక్కవ్వొద్దు’ తస్మాత్‌ జాగ్రత్త.. అంటూ హెచ్చరిస్తున్నారు.

- కొత్తగూడెం క్రైం 

కొత్తగూడెం క్రైం : ఖమ్మం జిల్లాకు చెందిన ఓ సీఐ.. ప్రజలతో మమేకమై పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తుంటారు. విధుల్లోనూ చురుగ్గా ఉండే ఆ సీఐ అంటే తన సర్కిల్‌ పరిధిలోని ప్రజలకు ఎంతో ఇష్టం. ఈ మధ్య ఆయన పేరుతో ఓ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ క్రియేట్‌ అయింది. దాని నుంచి పలువురికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు వెళ్లాయి. మెల్లిగా మెసెంజర్‌లో ‘కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాలకు డబ్బులు కావాలి, జీతం రాగానే ఇచ్చేస్తా’ అంటూ చాటింగ్‌ మొదలు పెట్టాడు. నిజమేనని నమ్మిన కొందరు అతను పంపిన నంబర్లకు గూగుల్‌పే, ఫోన్‌ పే ద్వారా డబ్బులు చెల్లించారు. తర్వాత స్టేషన్‌కు వెళ్లి ‘సార్‌.. మీవంటి మంచివారు స్వచ్ఛంద కార్యక్రమాలకు మమ్మల్ని డబ్బులు అడగడం చాలా ఆనందంగా ఉంది’ అని వారి సంతోషాన్ని వెలిబుచ్చడంతో.. ఒక్కసారిగా ఆ సీఐ అవాక్కయ్యాడు. తీరా విషయం మొత్తం తెలుసుకొని.. సైబర్‌క్రైం విభాగానికి ఫిర్యాదు చేయడంతో.. ఇలాంటి సైబర్‌ దొంగ పోలీసుల బాగోతాలు వెలుగులోకి వచ్చాయి. 

రూటు మార్చిన సైబర్‌ దొంగలు

ఇప్పటి వరకు సైబర్‌ నేరగాళ్లు ఫేక్‌ వెబ్‌సైట్లు సృష్టించో, సామాజిక మాధ్యమాల్లో చొరబడో, సెలబ్రెటీల పేరు, ఫొటోలతో ఫేక్‌ అకౌంట్లు క్రియేట్‌ చేసి అమాయకుల నుంచి డబ్బులు దండుకున్నారు. పలుచోట్ల హ్యాకింగ్‌ పద్ధతిద్వారా ఘరానా మోసాలకు పాల్పడ్డారు. వాటి ద్వారా ప్రజలు కొంచెం అప్రమత్తం అవడంతో ఏకంగా పోలీసులమంటూ ప్రజలను బురిడీ కొట్టించడానికి రూటు మార్చారు సైబర్‌ నేరగాళ్లు. ఏకంగా రిటైర్డ్‌ పోలీస్‌ అధికారులో లేక ప్రస్తుతం విధుల్లో ఉన్న పోలీస్‌ అధికారుల పేరుతో ఫేక్‌ ‘ఫేస్‌బుక్‌' అకౌంట్లు క్రియేట్‌ చేస్తున్నారు. వాటి నుంచి పోలీస్‌ అధికారుల ఫ్రెండ్స్‌ లిస్టుల్లో ఉన్నవారికి ఫ్రెండ్‌ రిక్వెస్టులు పంపుతున్నారు. అవతలి వారు సదరు పోలీస్‌ అధికారి పేరుతో వచ్చే ఫేక్‌ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్‌ చేస్తున్నారు. కొన్నాళ్లు మర్యాదపూర్వకంగా చాట్‌ చేసి, తర్వాత రంగంలోకి దిగుతున్నారు. పలు కార్యక్రమాలకు డబ్బులు అప్పుగా కావాలంటూ చాట్‌ చేస్తున్నారు. అది కూడా పెద్దమొత్తంలో కాకుండా రూ.10 వేల నుంచి రూ.20వేల వరకు అడుగుతున్నారు. అవతలి వ్యక్తి సానుకూలంగా స్పందిస్తే డబ్బు పంపించేందుకు ఫోన్‌ పే, పేటీఎం, గూగుల్‌ పేల నంబర్లు పంపి.. మెల్లిగా అన్‌ఫ్రెండ్‌ చేస్తున్నారు. 

మోసపోవద్దంటున్న పోలీసులు

ఇలాంటి సంఘటనలు తరచూ పునరావృతమవుతున్నాయి. సూర్యాపేట జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తించి రిటైర్‌ అయిన అధికారి పేరుతో, కరీంనగర్‌లో పని చేస్తున్న పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌, వరంగల్‌ జిల్లాలో పని చేస్తున్న పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ పేరుతో, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు నల్లగొండ, సూర్యాపేట, మొదలగు జిల్లాలో పని చేస్తున్న పోలీస్‌ ఇన్‌స్పెక్టర్ల పేర్లతో సైబర్‌ నేరగాళ్లు ఫేస్‌బుక్‌ ఫేక్‌ అకౌంట్లు క్రియేట్‌ చేసి రిక్వెస్టులు పంపుతున్నారు. దీంతో పోలీస్‌ అధికారులు అప్రమత్తమై తమ అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా వాల్‌ మీద ‘ఫేస్‌బుక్‌లో తమ పేర్లతో ఫేక్‌ అకౌంట్లు క్రియేట్‌ అవుతున్నాయని.. తాము ఎవరినీ ఇలా డబ్బులు అడమని, ఎవరూ మోసపోవద్దు’ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఈ సైబర్‌ నేరగాళ్లు ఎవరూ..? ఎక్కడి నుంచి వీరి ఆపరేషన్‌ నడుస్తున్నది? పోలీస్‌ శాఖనే ఎందుకు టార్గెట్‌ చేశారు? అనే విషయాలపై ముమ్మరంగా దర్యాప్తు సాగుతున్నది. 

పెచ్చుమీరుతున్న ఆగడాలు

గతంలో సైబర్‌ నేరగాళ్లు బ్యాంకు అకౌంట్లను హ్యాక్‌ చేసి వినియోగదారుడికి తెలియకుండానే వారి ఖాతాల్లోంచి పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీవోఎస్‌) లావాదేవీల ద్వారా కోట్ల రూపాయల నగదును మాయం చేశారు. ఈ క్లోనింగ్‌ పద్ధ్దతిని పోలీసులు ఛేదించి చెక్‌ పెట్టడంతో మరో కొత్త కోణంలో అంతర్జాల దోపిడీకి పాల్పడుతున్నారు. కొంత కాలంగా హ్యాకర్లు వాట్సప్‌లో ఒక వెబ్‌ లింక్‌ని పంపుతున్నారు. అది తెలియక కొందరు క్లిక్‌ చేయడంతో వారి ఫోన్‌ నెంబర్‌, బ్యాంక్‌ ఖాతాల వివరాలను హ్యాకర్లు తెలుసుకుంటున్నారు. పోలీస్‌ అధికారులు ప్రస్తుతం జరుగుతున్న ఈ కొత్త సైబర్‌ దందాపై ప్రత్యేక దృష్టి సారించారు. 

అధికారులెవ్వరూ..డబ్బులు అడగరు..


ఎవరైనా మెసెంజర్‌ డబ్బులు అడిగితే కచ్చితంగా ఫేక్‌ అకౌంట్‌గా గుర్తించాలి. ఏ అధికారి కూడా ఇలా అడగరు. అధికారుల నుంచి ప్రత్యేకంగా ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ రాదు. పోలీసులకు ఉన్న పేరు వాడుకుని చాలా మంది ఫేస్‌బుక్‌ నకిలీ అకౌంట్లు సృష్టిస్తున్నారు. అందులో నుంచే డబ్బుల కోసం అడుగుతున్నారు. ఫేక్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేశారని మీ దృష్టికి వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి.

    -  వెంకన్నబాబు, ఖమ్మం అర్బన్‌ సీఐ