శనివారం 05 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Sep 19, 2020 , 00:21:20

పచ్చందం.. పరవశం

పచ్చందం.. పరవశం

  • మణుగూరులో సుందరీకరణ పనులు
  • మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నాలుగు పార్కుల ఏర్పాటు
  • ప్రతి పార్కులో నీడనిచ్చే మొక్కలు

పట్టణ ప్రాంతాల్లో రోజు రోజుకు పెరిగిపోతున్న కాలుష్యాన్ని ప్రజలు తట్టుకునేలా మెరుగైన జీవన విధానాన్ని  అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పార్కులను ఏర్పాటు చేస్తున్నది. ప్రతి మున్సిపాలిటీలో పట్టణ ప్రజలకు ఆహ్లాదం పంచేలా అన్ని రకాల హంగులతో పార్కులను సుందరీకరిస్తున్నారు. ఇందులో భాగంగానే మణుగూరు మున్సిపాలిటీలో డెన్స్‌ ప్లాంటేషన్‌, ట్రీ, అర్బన్‌ లంగ్స్‌ స్పేస్‌ పార్కులతో పాటు స్మృతి వనం, రాశివనం పేరుతో మొత్తం 4 పార్కుల ఏర్పాటు చేస్తున్నారు. ఈ పార్కుల ఏర్పాటుకు అయ్యే నిధులను మున్సిపాలిటీ నుంచి ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే రెండు పార్కుల ఏర్పాట్లు పూర్తికాగా మరో రెండు పార్కుల ఏర్పాటుకు లెవలింగ్‌ పనులు జరుగుతున్నాయి.   

- మణుగూరు  

మణుగూరు మున్సిపాలిటీలో ప్రజలకు ఆహ్లాదం పంచే విధంగా పట్టణంలో  పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. మణుగూరు రాజుపేట గ్రామం వద్ద యాదాద్రి డెన్స్‌ ప్లాంటేషన్‌ పార్కు, అర్బన్‌ లంగ్స్‌ స్పేస్‌ పార్కు, ట్రీ పార్కుతో పాటు స్మృతివనం. రాశివనం పేరుతో మరో పార్కును తయారు చేస్తున్నారు. ప్రతి పార్కును అధికారులు అందంగా ముస్తాబు చేస్తున్నారు. ప్రతి పార్కులో పచ్చని వనాలను అభివృద్ధి చేయనున్నారు. ఈ పార్కుల్లో వాకింగ్‌ ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నారు. అన్ని హంగులలో నిర్మాణం చేస్తున్నారు. ప్రజలకు వాకింగ్‌ ట్రాక్‌తో పాటు వృద్ధులు కూర్చునేందుకు బెంచీలు వేయనున్నారు. ప్రతి పార్కులో నీడనిచ్చే మొక్కలతో పాటు పూల మొక్కలను పెంచనున్నారు. 

పట్టణంలో రూ.15 లక్షల వ్యయంతో పార్కులు..

మణుగూరు మున్సిపాలిటీలో ప్రజలకు ఆహ్లాదం పంచే విధంగా పట్టణంలో రూ. సుమారు 15 లక్షల ఖర్ఛుతో 4 పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. యాదాద్రి డెన్స్‌ ప్లాంటేషన్‌ను మూడున్నర ఎకరాల్లో రూ. 5.50లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు.  ఎకరాన్నర ప్రదేశంలో రూ.2.47లక్షలతో ట్రీపార్కును, ఐదున్నర ఎకరాత్లో రూ. 4.50లక్షల వ్యయంతో అర్బన్‌ లంగ్స్‌ స్పేస్‌ పార్కును, మరో రెండు ఎకరాల్లో రూ. 2 లక్షల వ్యయంతో స్మృతివనం, రాశివనం పేరుతో పార్కును ఏర్పాటు చేస్తున్నారు. 

అన్ని రకాల హంగులతో పార్కులు.. 

మణుగూరు పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ మున్సిపాలిటీలో 4 పార్కులు ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే పార్కుల ఏర్పాటు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ పార్కులకు అయ్యే ఖర్చును మున్సిపాలిటీ నిధుల నుంచే ఖర్చు చేస్తున్నారు. అన్ని రకాల హంగులతో పార్కులు రూపుదిద్దుకునేలా ప్రత్యేక దృష్టి పెట్టాను. మణుగూరు మున్సిపాలిటీ అందంగా తయారు అయ్యేలా చర్యలు తీసుకుంటాను. 

-రాష్ట్ర ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు

ముమ్మరంగా పార్కుల ఏర్పాటు పనులు.. 

మణుగూరు మున్సిపాలిటీలో సూమారు 15 లక్షల వ్యయంతో 4 పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే రెండు పార్కుల ఏర్పాటు పనులు పూర్తికాగా మరో రెండు పార్కుల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మున్సిపాలిటీలో 4 నర్సరీల ఏర్పాటు చేస్తున్నాం. ఈ పార్కుల పనులు త్వరగా పూర్తి చేస్తాం.  

-మణుగూరు మున్సిపల్‌ కమిషనర్‌ నాయిని వెంకటస్వామి.