సోమవారం 23 నవంబర్ 2020
Badradri-kothagudem - Sep 19, 2020 , 00:21:22

పల్లె వికాసం..

పల్లె వికాసం..

  • జోరుగా గ్రామాల్లో అభివృద్ధి పనులు
  • కొనసాగుతున్న వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డు నిర్మాణాలు
  • పల్లె ప్రగతితో కొత్తశోభ

భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/మామిళ్లగూడెం: ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మకమైన కార్యక్రమం పల్లె ప్రగతితో గ్రామాలు పరిశుభ్ర పల్లెలుగా రూపు దిద్దుకున్నాయి. ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో చేపట్టిన రెండవ విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాల్లో ఏళ్లుగా పరిష్కారం దొరకని సమస్యలు పరిష్కారం అయ్యాయి. గత ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధ్దిని గాలికి వదలడంతో నిత్యం సమస్యలతో సతమవుతున్న పల్లె ప్రజలు ఎన్నో అనారోగ్య ఇబ్బందులకు గురయ్యేవారు. ఇలాంటి పరిస్థితుల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నది. దీంతో నేడు గ్రామాల్లో పరిశుభ్రత వాతావరణంతో పరిశుభ్ర పల్లెలుగా దర్శనమిస్తున్నాయి. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు కర్ణన్‌, ఎంవీరెడ్డి పర్యవేక్షిస్తూ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుండటంతో గ్రామాలు పరిశుభ్రతకు, అభివృద్ధికి  కేరాఫ్‌గా నిలుస్తున్నాయి.

 90 శాతం పనులు పూర్తి .. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాలతో గ్రామాల్లో 90శాతం పనులు పూర్తి కావడంతో గ్రామాలు కళకళలాడుతున్నాయి. పల్లె ప్రగతికి ముందు పల్లె ప్రగతి తర్వాత గ్రామాలు అన్నట్లుగా మార్పు కనిపిస్తుంది. 

ప్రధానంగా గ్రామాల్లో శిథిల భవనాలు కూల్చివేయడం, పడావుపడిన బావులను పూడ్చి వేశారు. ప్రజలను చైతన్యం చేసి పారిశుధ్య పనులు నిరంతరంగా కొనసాగిస్తుండడంతో గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించి గ్రామాలలో సేకరించిన చెత్తను డంపింగ్‌ యార్డులకు తరలించేందుకు ట్రాక్టర్ల కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. చెత్తను గ్రామాలలో ప్రత్యేకంగా కేటాయించిన డంపింగ్‌ యార్డులలో చెత్తను వేస్తున్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను బతికించాలన్న సంకల్పంతో వాటిని నీటి ఎద్దడి రాకుండా నీటి ట్యాంకర్లను కొనుగోలు చేశారు. మనిషి మరణం తరువాత కూడా ప్రశాంతంగా చివరి మజిలీ జరగాలన్న ఆలోచనలతో ప్రత్యేకంగా వైకుంఠధామాలు నిర్మిస్తున్నారు. కరెంట్‌ సమస్యలతో సతమతం అయ్యే గ్రామాలకు పల్లె ప్రగతితో సమస్యలు తీరాయి. ప్రధానంగా నాణ్యత కోల్పోయిన స్తంభాలు, సాగిన తీగలను సరిచేశారు. గ్రామాల్లో లో ఓల్టేజీ సమస్యలు లేకుండా అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు. వీధి లైట్ల నిర్వహణకు ప్రత్యేక లైన్లు వేయండంతో విద్యుత్‌ ఆదా అవుతున్నది.

పనులు జరుగుతున్నాయి.. 

ప్రతి పంచాయతీలో డంపింగ్‌యార్డులు, శ్మశానవాటికల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. వచ్చే నెలలోపు ఈ నిర్మాణాలు పూర్తి చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు సూచించాను. త్వరలోనే అన్ని నిర్మాణాలు పూర్తై పల్లెలు సుందరంగా మారనున్నాయి. - డి.మధుసూదనరాజు (జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖాధికారి), భద్రాద్రి కొత్తగూడెం