శుక్రవారం 30 అక్టోబర్ 2020
Badradri-kothagudem - Sep 17, 2020 , 07:39:00

డ్రాప్‌ పడట్లే..

డ్రాప్‌ పడట్లే..

  • లాక్‌డౌన్‌ ముగిసినా ఆటోలు, 
  • అద్దె కార్లకు పెరగని గిరాకీ
  • ప్రయాణికులు సరిగా లేక ఇబ్బందులు 
  • పడుతున్న ఆటో డ్రైవర్లు
  • భారంగా మారిన వాహనాల కిస్తీలు.. 
  • మరింత తోడైన డీజిల్‌ ధరలు

మణుగూరు రూరల్‌: పూటంతా పడిగాపులు కాసి నా ఒక్క డ్రాప్‌ కూడా పడట్లేదు ఆటోవాలాలకు. రోజం తా ఎదురుచూసినా ఒక్క బుకింగ్‌ కూడా రావట్లేదు అద్దెకార్ల యజమానులకు. లాక్‌డౌన్‌ ముగిసినా ప్రయాణికులు పెద్దగా బయటకు రావడం లేదు. ఫలితంగా ఆటోవాలాలకు అంతగా కిరాయిలు ఉండడం లేదు. పూటంతా పడిగాపులు కాసినా ఒక్క డ్రాప్‌ కూడా పడని పరిస్థితి ఉంది. బుకింగ్స్‌ లేక అద్దె కార్ల యజమానులు కూడా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కుటుంబా లు గడవడమే కష్టంగా ఉన్న ఇలాంటి నేపథ్యంలో వాహనాల కిస్తీలు, పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింత భారంగా మారాయి.  


మణుగూరు పట్టణం.. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం. దీనికితోడు ఈ నియోజకవర్గంలో పరిశ్రమలు బాగానే ఉన్నాయి. దీంతో లాక్‌డౌన్‌కు ముందు ఆటోవాలాలకు మంచి గిరికీ ఉండేది. మణుగూరు పట్టణంలోని సురక్షాబస్టాండ్‌, పూలమార్కెట్‌, టీడీపీ సెంటర్‌, పీవీకాలనీ, రామాలయం ప్రాంతాల్లో ఆటోల అడ్డాలు ఉన్నాయి. నియోజకవర్గానికి మణుగూరు పట్టణం కేంద్రం కావడంతో అన్ని మండలాల నుంచి వివిధ పనుల కోసం, వ్యాపారం కోసం వచ్చే ప్రజలందరూ ఆటోలనే ఆశ్రయించేవారు. ఇప్పుడు లాక్‌డౌన్‌ లేకపోయినా ప్రజల రాకపోకలు పెద్దగా పెరగలేదు. మండలంలో సుమారు 1200 మంది ఆటోలు నడుపుతున్నారు. వారిపై పరోక్షంగా 3 వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ఇప్పుడు ఈ కుటుంబాలన్నీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. 

రైళ్ల రాకపోకలు లేక పూర్తిగా  బంద్‌ అయిన కిరాయిలు

హైదరాబాద్‌, మణుగూరు మధ్య నిత్యం రెండు రైళ్లు నడిచేవి. లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన ఆ రైళ్లు మళ్లీ పట్టాలెక్కలేదు. దీంతో రైల్వేస్టేషన్‌ నుంచి మండలంలోని వివిధ ప్రాంతాలకు, ఆయా ప్రాంతాల నుంచి రైల్వేస్టేషన్‌కు వెళ్లివచ్చే ప్రయాణికులు లేకపోవడంతో ఆ రూట్లో ఆటోలు నడిపే ఆటోవాలాలకు, అద్దె కార్ల యజమానులకు కిరాయిలు పూర్తిగా బంద్‌ అయ్యాయి. 

కుటుంబ పోషణ భారంగా ఉంది 


ఇప్పుడు లాక్‌డౌన్‌ లేకపోయినా ఆటోలు ఎక్కేందుకు ప్రయాణికులు జంకుతున్నారు. ఒక్క డ్రాప్‌ పడడం కూడా కష్టమవుతోంది. దీంతో కుటుంబ పోషణ భారంగా ఉంది. 

-కొత్తపల్లి సత్యనారాయణ,  ఆటో యూనియన్‌ అధ్యక్షుడు

కిరాయిలు లేవు.. 


లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుం చి కార్లకు కిరాయిలు ఉండడం లేదు. దీంతో కార్ల కిస్తీలు పెండింగ్‌లోనే ఉన్నాయి. వాహనాలకు టాక్స్‌ కట్టాలంటే ఇంట్లో ఉన్న వస్తువులు, ఆభరణాలు తాకట్టుపెట్టాల్సి వస్తోంది.         

-లక్ష్మణ్‌, కార్‌ డ్రైవర్‌