బుధవారం 21 అక్టోబర్ 2020
Badradri-kothagudem - Sep 17, 2020 , 01:59:10

భాగ్యనగర్‌ తండా సబ్‌స్టేషన్‌ను ప్రారంభించాలి

భాగ్యనగర్‌ తండా సబ్‌స్టేషన్‌ను ప్రారంభించాలి

  • అసెంబ్లీ జీరో అవర్‌లో వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌

వైరా: కారేపల్లి మండలం భాగ్యనగర్‌ తండాలో సుమారు రూ.కోటితో నిర్మించిన 33 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ప్రభుత్వం వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ కోరారు. హైదరాబాద్‌లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం జీరో అవర్‌లో ఆయన మాట్లాడారు.

భాగ్యనగర్‌ తండాల్లో సుమారు మూడేళ్ల క్రితం రూ.కోటితో ప్రభుత్వం 33 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను నిర్మించిందన్నారు. ఆ సబ్‌స్టేషన్‌ నిర్మించేందుకు అవసరమైన స్థలాన్ని దానం చేసిన వారికి ఉద్యోగవకాశం కల్పిస్తామని అప్పట్లో ప్రభుత్వం హామీ ఇచ్చిందని వివరించారు.

అయితే ఆ స్థల దాతలకు ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో అది ప్రారంభానికి నోచుకోవడం లేదని సభ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించి సబ్‌స్టేషన్‌ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ స్పందిస్తూ ఈ విషయాన్ని సంబంధిత మంత్రి జగదీశ్వర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని సమాధానమిచ్చారు.  


logo