మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Badradri-kothagudem - Sep 16, 2020 , 03:35:10

రాజ్యం ఏలుతుండ్రు

రాజ్యం ఏలుతుండ్రు

  • టీఎన్జీవోస్‌ హౌసింగ్‌ సొసైటీలో అక్రమాల పరంపర
  • సంఘాన్ని అభాసుపాలు చేసిన ‘ప్రధాన’ బాధ్యులు
  • ఖమ్మం రూరల్‌లో రూ.100 కోట్ల విలువైన భూమి కబ్జా
  • ఉద్యోగ సంఘాల పేరుతో యథేచ్ఛగా దోపిడీ
  • అమాయకులను ఇక్కట్ల పాలు చేస్తున్న సొసైటీ బాధ్యులు
  • సభ్యులు కానివారికి కూడా ప్లాట్ల కేటాయింపు
  • అధికార హోదాలను అడ్డం పెట్టుకొని ధనార్జన
  • భూములకు ధర పెరగడంతో అక్రమాలు

టీఎన్‌జీవోస్‌ సంఘానికి ‘ఛీ’ఎన్జీవో సంఘంగా మచ్చ తెచ్చారు అందులోని ‘ప్రధాన’ పెద్దలు. సంఘంలోని సభ్యుల ప్లాట్లను అక్రమంగా కొల్లగొట్టడంతో పాటు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమినీ తమ సొంతం చేసుకున్నారు. సభ్యులకు నివాస స్థలాలను ప్రభుత్వం నుంచి నామమాత్రపు   ధరలకు అందించేందుకు ఏర్పడిన టీఎన్‌జీవోస్‌ కో ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీలో అక్రమాల పరంపర కొనసాగుతోంది. సంఘానికి సర్కారు ఇచ్చిన భూములు ఇప్పుడు రూ.కోట్లు                             పలుకుతుండటంతో యూనియన్‌ పెద్దల కన్ను పక్కనే ఉన్న ప్రభుత్వ భూములపై పడింది. దీంతో ఖమ్మం రూరల్‌లో రూ.100 కోట్ల విలువైన సర్కారు భూమినీ కలిపేసుకున్నారు. అదీగాక సొసైటీ ప్లాట్లను సభ్యులకు కాకుండా ఇతరులకూ కట్టబెట్టారు. సంఘ సభ్యులెవరైనా గడువు తీరాక  తమ స్థలాలను ఇతరులకు విక్రయించబోతే అడ్డుకున్నారు. ఈ క్రమంలో అన్యాయానికి గురైన కొందరు సభ్యులు ఇటీవల ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం, ఉన్నతాధికారులు విచారణ                 జరపడం, చర్యలకు ఆదేశించడం వంటి ఘటనలు చోటుచేసుకోవడంతో సొసైటీ ముసుగులో   జరుగుతున్న అక్రమాల చిట్టా వెలుగులోకి వచ్చింది. 

-ఖమ్మం ప్రతినిధి, నమస్తే తెలంగాణ  

ఖమ్మం ప్రతినిధి, నమస్తే తెలంగాణ : వారంతా ప్రభుత్వ విధానాలను అమలు చేస్తూ, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ ఉండే ఉద్యోగులు. ప్రభుత్వం అందించే వేతనాలతో జీవితాలను నడుపుకునేవారు. కనీస అవసరాలకు కొదవ లేకున్నా.. విలాసాల వైపు కన్నెత్తకుండా సౌకర్యవంతంగా ఉండేందుకు ప్రణాళికను రూపొందించుకోవాలనుకుంటారు. భవిష్యత్తు అవసరాల రీత్యా గూడు కట్టుకోవాలని భావించే సగటు జీవులు. వారే ఖమ్మం జిల్లాకు చెందిన తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ అధికారులు (టీఎన్‌జీవోస్‌). నివాసయోగ్య ప్రాంతంలో ఉండేందుకు అవసరమైన స్థలాన్ని సమకూర్చుకునేందుకు ప్రభుత్వం నుంచి కొంత రాయితీ వస్తే సంతోషించాలని యోచించారు. అంతా సమైక్యమయ్యారు. సొసైటీగా ఏర్పడ్డారు. సమష్టి ప్రయోజనాల కోసం ఏకతాటిపై నిలిచారు. ఆ ఆలోచన నుంచి ఉద్భవించిందే ఖమ్మంలోని టీఎన్జీవోస్‌ కోఆపరేటీవ్‌ హౌస్‌బిల్డింగ్‌ సొసై టీ. ఉద్యోగులకు అదనపు ప్రయోజనాలను సమకూర్చడాన్ని బాధ్యతగా భావించిన ప్రభుత్వం అందుకు సహకరించింది. అడిగిన విధంగానే అనుమతులు ఇచ్చింది. దీంతో అందులోని నాయకులు ఇక అంతా తామే అన్నట్లు వ్యవహరించారు. సభ్యులకు దక్కాల్సిన ఫలాలను పక్కదారి పట్టించారు. అధికారులకు, అనుయాయులకు, అడిగినవారికి అడ్డంగా పంచేశారు. సొసైటీ నిబంధనలకు తూట్లు పొడిచారు. నిజమైన లబ్ధిదారుకులకు అవకాశం కల్పించకుండా ఇక్కట్లపాలు చేశారు. ప్రశ్నించినవారిని ఇబ్బందిపెట్టారు. దోపిడీని ప్రశ్నిస్తే వేధింపులకు గురిచేశారు. బలహీనులను బానిసలుగా చేసుకున్నారు. అందినకాడికి దోసుకున్నారు. భూములకు విలువ పెరగడంతో అక్రమాలను కొనసాగిస్తున్నారు.  

ఖమ్మం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని టీఎన్జీవోలు ఇంటి స్థలాలను సమకూర్చుకునేందుకు అనువుగా 2005లో జీవో నెంబర్‌ 144 ప్రకారం ఖమ్మం రూరల్‌ మండలంలోని 103 ఎకరాల 26 కుంటల ప్రభుత్వ స్థలాల్ని నామమాత్రపు వ్యయంతో ప్రభుత్వం నుంచి పొందారు. ఏదులాపురం పంచాయతీలోని 99, 100, 105/1, 105/2, 106/2/1, 106/2/3, 106/3, 107/3/3 సర్వే నెంబర్లలో 54 ఎకరాల 15 కుంటల భూమిని, దానవాయిగూడెం పంచాయతీలోని 63/2/3/64/1, 65/2,66/2,67, 68 తదితర సర్వే నెంబర్లలో 49 ఎకరాల 11 కుంటల భూమిని టీఎన్జీవోస్‌ కోఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీకి ఇచ్చారు. నిబంధనల ప్రకారం సొసైటీ ఏర్పాటు చేసిన నాడు 1686 మంది సభ్యులు ఉన్నారు. వారికి మాత్రమే ఈ భూమిని కేటాయించాలని నిబంధనలు సూచిస్తున్నాయి. అయితే సొసైటీలోని నాయకులు తమ స్వప్రయోజనాల కోసం నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారు. తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. సభ్యుల ప్రయోజనాలను పణంగా పెట్టి అక్రమ మార్గాలకు తెరలేపారు. దీంతో అర్హులకు దక్కాల్సిన భూమి అనేకమంది అనర్హులకు దక్కింది. ఖమ్మం రెవెన్యూ పరిధిలోని ఉద్యోగులకు మాత్రమే ఇవ్వాల్సిన భూమిని రాష్ట్ర ముఖ్య నగరం నుంచి దేశ రాజధాని వరకు పని చేస్తున్న వారికి ఇచ్చారు. అక్కడి వారికి కూడా ఇక్కడ స్థలాలను కేటాయించడంతో సొసైటీలోని నిజమైన అర్హులు ఇబ్బందిపడ్డారు. సొసైటీ ఏర్పాటు సమయంలో ఖమ్మం రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగికి మాత్రమే ఇంటి స్థలం కేటాయించాలనే నిబంధన ఉంది. కానీ దాన్ని అతిక్రమించి సొసైటీ నాయకులు తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు పలువురు రాజకీయ పార్టీలకు చెందిన వారికి, ప్రజాప్రతినిధులకు, వివిధ వర్గాల వారికి కేటాయించారు. 

అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ..

ఖమ్మంలోని టీఎన్జీవోస్‌ కోఆపరేటీవ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీకి నామమాత్రపు వ్యయంతో కేటాయించిన స్థలాల్లో సభ్యులు కానివారు, అనర్హులు ప్రవేశించడంతో ఆవేదనకు గురైన సొసైటీలోని కొందరు సభ్యులు విజిలెన్స్‌ అధికారులకు, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్‌ అధికారులు స్పందించి అవకతవకలపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపారు. అలాగే అదే నివేదికను ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ (సీసీఎల్‌ఏ), పంచాయతీరాజ్‌ కమిషనర్‌, వరంగల్‌ రీజినల్‌ విజిలెన్స్‌ అధికారి, కమిషనర్‌, ల్యాండ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌, జిల్లా సహకార అధికారులకు కూడా పంపారు. అక్రమాలకు పాల్పడిన సొసైటీ అధ్యక్ష కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని నివేదిక ఇచ్చారు. 

అక్రమాల అడ్డా.. ఆ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం..

టీఎన్జీవోస్‌ కోఆపరేటీవ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీలోని స్థలాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ఆ సొసైటీ పరిధిలోని రిజస్ట్రేషన్‌ కార్యాలయం కీలకంగా మారింది. అందులో పనిచేసిన, చేస్తున్న అధికారులు ఈ అక్రమాలకు సంపూర్ణ మద్దతుగా నిలవడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ యథేచ్ఛగా కొనసాగినట్లు తెలుస్తోంది. విజిలెన్స్‌ నివేదికను అధారం చేసుకొని రిజిస్ట్రేషన్లు నిలిపి వేయాలంటూ ఆర్‌సీ నెంబర్‌ 341/213 ద్వారా 2016లో సొసైటీ అధ్యక్షుడికి, కూసుమంచి సబ్‌ రిజిస్ట్రార్‌కు ఖమ్మం డిప్యూటీ కోఆపరేటివ్‌ రిజిస్ట్రార్‌ ఆదేశాలు జారీ చేశారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా గెజిటెడ్‌ అధికారులతోపాటు 137 మంది ఇతరులకు కేటాయించిన ప్లాట్లను కూడా రద్దు చేయాలని ఆదేశించారు. స్థలాలను పొందిన 15 మంది అధికారుల పూర్తి వివరాలను తెలియజేయాలని సూచించారు. అయినప్పటికీ ఆ ఆదేశాలను పట్టించుకోకుండా యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు కొనసాగించారు. ఇదంతా సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి సమీప బంధువైన రిజిస్ట్రేషన్‌ శాఖలోని ఓ అధికారి ప్రమేయంతోనే కొనసాగినట్లు ఆరోపణలు ఉన్నాయి. సొసైటీలో తమకు అనుకూలమైన వారికి తక్షణం రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు అక్కడ పని చేసే అధికారిని ఉపయోగించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.  

యథేచ్ఛగా దురాక్రమణ 

అవకతవకల ద్వారా భారీ ఆర్జనకు అవకాశం ఏర్పడడంతో నిబంధనలను విస్మరించి.. 1686 మంది వాస్తవ సభ్యులకు అదనంగా మరో 1400 మందిని సొసైటీ బాధ్యులు చేర్పించారు. నిబందనల ప్రకారం తొలుత సొసైటీలో ఉన్న సభ్యులకు మాత్రమే కేటాయించే స్థలాలను మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. కానీ అదనంగా చేరిన సుమారు 1400 మందికి కూడా స్థలాలను ఎలా కేటాయించగలిగారనేది రహస్యం. అయితే ప్రభుత్వం సొసైటీకి ఇచ్చిన స్థలాన్ని ఆసరాగా చేసుకొని సమీపంలోని ప్రభుత్వ స్థలాలను కూడా సొసైటీ బాధ్యులు కబ్జా చేశారు. దీంతో సమీపంలోకి ఎవరినీ రానివ్వకుండా చూస్తూ ఆక్రమణలకు తెరలేపారు. కేటాయించిన స్థలానికి సమీపంలోని సుమారు 30 ఎకరాల ప్రభుత్వ భూములను నిబంధనలకు వ్యతిరేకంగా కలుపుకున్నట్లు తెలుస్తోంది. సొసైటీ సభ్యుల ప్రయోజనాల రీత్యా అదనపు భూమి అవసరమున్నట్లయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్నతాధికారులను సంప్రదించి విజ్జప్తుల ద్వారా పొందే వెసులుబాటు ఉంది. కానీ ఆ నిబంధనలు పాటించకుండా సంఘ బాధ్యులు ఆక్రమణలకు పాల్పడడం గమనార్హం. ప్రభుత్వ కార్యకలాపాలను చట్టపరిధిలో అమలు చేయాల్సిన అధికారులు, ఉద్యోగులతో ఉన్న సొసైటీ నిర్వాహకులే ఇలాంటి అక్రమాలకు పాల్పడడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆక్రమణలపై గతంలో కలెక్టర్‌గా పనిచేసిన లోకేశ్‌కుమార్‌ ఘాటుగా స్పందించారు. సొసైటీ పక్కన ఆక్రమించిన ఆరు ఎకరాల మూడు కుంటల భూమిని స్వాధీనం చేసుకొని సొసైటీ కమిటీపై చర్యలు తీసుకోవాలని 2015లో ఖమ్మం రూరల్‌ తహసీల్దార్‌ను ఆదేశించారు. అయినప్పటికీ ఆ స్థలా న్ని అధికారులు ఇంత వరకూ స్వాధీనం చేసుకోలేదు. వారు స్వాధీన పర్చుకోకుండా అక్రమార్కులు అడ్డుకుంటున్నారు. సొసైటీ స్థలానికి పక్కనే ఉన్న 30 ఎకరాల భూమినే కాకుండా.. మూసివేసిన క్వారీ స్థలాలను కూడా ఈ సొసైటీ బాధ్యులు కలుపుకున్నారు. ఈ స్థలాన్ని చదును చేసి ప్లాట్లుగా చేసి విక్రయాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అధికార హోదాలను, ఉద్యోగ సంఘాలను అడ్డం పెట్టుకొని ప్రభుత్వ స్థలాలను యథేచ్ఛగా ఆక్రమిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

నిర్వాహకులే కీలకం..

టీఎన్జీవోస్‌ కోఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ అక్రమాల్లో దాని నిర్వాహకులే కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో టీఎన్జీవోస్‌ నాయకుడిగా వ్యవహరించిన ఓ బాధ్యుడు ప్రస్తుతం మండల ప్రజా పరిషత్‌ అభివృద్ధి అధికారిగా కూడా పనిచేస్తున్నారు. ఆయనతోపాటు టీఎన్జీవోస్‌ ప్రస్తుత జిల్లా బాధ్యులు ఈ వ్యవహారం భాగస్వాములుగా ఉంటూ సొసైటీ సభ్యులకు అన్యాయం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే పూర్తి ఆధారాలతో సొసైటీలోని ఓ సభ్యుడు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ కమిషనర్‌కు 2016లో ఫిర్యాదు చేశాడు. సొసైటీలో ఖమ్మానికి చెందిన నాయకుడు సొసైటీలో ఆర్థిక స్థోమతలేని సభ్యులను గుర్తించి వారి వద్ద నుంచి తక్కువకు ప్లాటును కొనుగోలు చేస్తూ బయట వ్యక్తులకు అధిక ధరలకు విక్రయిస్తూ వ్యాపారాలు చేస్తున్నట్లు సభ్యులు ఆరోపిస్తున్నారు. 

నన్ను మోసం చేశారు..

నాకు వెలుగుమట్ల ప్లాట్‌ నెంబర్‌ 58ని విక్రయిస్తానని మాచర్ల శేఖర్‌బాబు రూ.ఏడు లక్షలు తీసుకొని అగ్రిమెంట్‌ చేశాడు. అనంతరం నాకు ప్లాట్‌గానీ, డబ్బులు గానీ ఇవ్వకుండా ఇతరులకు రిజిస్ట్రేషన్‌ చేసి నన్ను మోసం చేశాడు. దీంతో నేను పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన రాలేదు. దీంతో కోర్డును ఆశ్రయించి ఆర్డర్‌ పొందాను. త్రీటౌన్‌ పోలీసుస్టేషన్‌లో వారిపై కేసు నమోదయింది. న్యాయస్థానంలో  

కేసు నడుస్తోంది.   

  -తుంగపల్లి దానయ్య, విద్యుత్‌శాఖ రిటైర్డ్‌ ఉద్యోగి

సొసైటీ అంతా అక్రమాల పుట్ట..

టీఎన్జీవోస్‌ కోఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ వ్యవహారమంతా అక్రమాల పుట్ట. ఇందులో సభ్యులు ఎవరో, కానివారు ఎవరో అర్థంకాని పరిస్థితి. సభ్యులు కాని వారు కూడా ఈ సొసైటీ నుంచి ఎలా స్థలాలు పొందుతారో అర్థం కావడంలేదు. సంస్థ సభ్యుల నోరుకొట్టి ఇతరులకు స్థలాలు ఇవ్వడమంటే అర్హులకు అన్యాయం చేయడమే. సొసైటీకి భూమి కేటాయించే నాటి కంటే ప్రస్తుతం భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. అందువల్ల సొసైటీ పక్కనే ఉన్న భూములను కూడా ముఖ్య బాధ్యులు ఆక్రమించారు. సొసైటీ పేరు చెప్పి అధిక ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. 

-సునిల్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌, సొసైటీ సభ్యుడు


రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు

టీఎన్జీవోస్‌ కోఆపరేటీవ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ అంతా అక్రమాల పుట్ట. ముఖ్య బాధ్యులు సొసైటీ సభ్యుల ప్రయోజనాల కంటే కూడా సొంత ప్రయోజనాలకే సంఘాన్ని ఉపయోగించుకుంటున్నారు. సభ్యులకు న్యాయం చేయడం లేదు. సొసైటీ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. సొసైటీని తమ కబంధ హస్తాల్లో పెట్టుకొని చాలామంది సభ్యులకు అన్యాయం చేశారు. సభ్యులకు కాకుండా బయటివారికి ప్లాట్లను కేటాయించారు. సొసైటీ సభ్యులు, ఉద్యోగుల ప్రయోజాలను దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్న వారిపై విచారణ జరిపించాలి. 

-అఫ్జల్‌ హసన్‌, టీఎన్జీవోస్‌ నాయకుడు, సొసైటీ సభ్యుడు


బాధ్యతను  విస్మరించడం దారుణం..

టీఎన్జీవోస్‌ కోఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ నిర్వాహకులు తమ బాధ్యతలను విస్మరించడం దారుణం. సొసైటీలోని సభ్యులకు కాకుండా ఇతరులకు సొసైటీ భూములు కేటాయించడంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. ఉన్నతాధికారులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదు. అనేక ఏళ్లుగా ఈ అక్రమాలు జరుగుతున్నాయి. ఉద్యోగుల ప్రతినిధులుగా వ్యవహరించేవారు బాధ్యతాయుతంగా ఉండాలి. కానీ వారే ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తూ విక్రయిస్తున్నారు. 

-మజీద్‌, అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌, 

సొసైటీ సభ్యుడు

  • ఉదయం మరో సభ్యుడి పేరిట..సాయంత్రం తన భార్య పేరిట..
  • సభ్యుడి స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న సొసైటీ పెద్ద

ఖమ్మం ప్రతినిధి, నమస్తే తెలంగాణ: గౌరవ ప్రదమైన వృత్తిలో ఉన్న వ్యక్తులే చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన వైనమిది. ఖమ్మం టీఎన్జీవోస్‌ కోఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీలో అక్రమాలు ఒక్కొక్కటీ వెలుగుచూస్తున్నాయి. సొసైటీ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. టీఎన్జీవోస్‌ సొసైటీలో సభ్యుడిగా ఉన్న మాచర్ల అర్లప్ప అనే వ్యక్తికి వెలుగుమట్ల సర్వే నెంబర్‌ 140లో ప్లాట్‌ నెంబర్‌ 58ని కేటాయించారు. అతడు చనిపోవడంతో ఆయన కుమారుడు శేఖర్‌బాబు హక్కుదారుగా ఉన్నాడు. విద్యుత్‌ శాఖలో పనిచేసి పదవీవిరమణ పొందిన గుట్టల బజార్‌కు చెందిన తుంగపల్లి దానయ్య అనే వ్యక్తికి ఆ ప్లాట్‌ను విక్రయిస్తానని శేఖర్‌బాబు అగ్రిమెంట్‌ చేశాడు. అయితే సొసైటీ నుంచి నిరభ్యంతర పత్రం పొందాల్సి ఉండడంతో శేఖర్‌బాబు సొసైటీ అధ్యక్ష కార్యదర్శులైన ఏలూరి శ్రీనివాసరావు, పొట్టపింజర రాజారావులను సంప్రదించాడు. దీంతో వారు ఆ ప్లాట్‌ను బయట వ్యక్తులకు విక్రయించేందుకు అంగీకరించలేదు. సొసైటీ సభ్యుడైన అనుమల సుధాకర్‌కు విక్రయించాలని సూచించారు. దీంతో శేఖర్‌బాబు 2019లో సుధాకర్‌కు రిజిస్ట్రేషన్‌ చేశాడు. అయితే అదే రోజు సాయంత్రానికి తిరిగి అదే ప్లాట్‌ను సుధాకర్‌ ఏలూరి శ్రీనివాసరావు సతీమణి గంగవరపు పద్మజారాణి పేరుతో రిజిస్ట్రేషన్‌ చేశాడు. ఓకే ప్లాట్‌ను ఉదయం ఒకరికి, సాయంత్రం మరొకరికి రిజిస్ట్రేషన్‌ చేయడం గమనార్హం. దీంతో గతంలో ఆ ప్లాట్‌ను అగ్రిమెంట్‌ చేసుకున్న తుంగపల్లి దానయ్య కుమారుడు శ్రీధర్‌ తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. తరువాత న్యాయస్థానాన్నీ ఆశ్రయించాడు. దీంతో కోర్డు ఉత్తర్వుల ప్రకారం 2019 ఏప్రిల్‌ 17న ఖమ్మం త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో మాచర్ల శేఖర్‌బాబు, గంగవరపు పద్మజారాణి, ఏలూరు శ్రీనివాసరావు, పొట్టపింజర రాజారావు, అనుముల సుధాకర్‌లను ముద్దాయిలుగా చేర్చారు. అయితే వీరికి పోలీసులు నోటీసులు జారీ చేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బెయిల్‌పై బయటికొచ్చారు. వందలాది మంది ఉద్యోగులు ఉన్న సొసైటీకి అధ్యక్షుడిగా ఏలూరి శ్రీనివాసరావు.. సొసైటీకి చెందిన ప్లాట్‌ను ఒకే రోజు ఇద్దరికి రిజిస్ట్రేషన్‌ చేస్తున్నా పట్టించుకోకపోవడం, అందులోనూ తన భార్య పేరునే రిజిస్ట్రేషన్‌ చేయించడం సభ్యులను విస్మయానికి గురిచేసింది. logo