శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - Sep 15, 2020 , 00:32:20

సక్రమం చేసుకోండి..

సక్రమం చేసుకోండి..

  • మళ్లీ ‘ఎల్‌ఆర్‌ఎస్‌'ను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
  • జిల్లాలో 378 వెంచర్లలో 41,357 ప్లాట్లు అక్రమమే
  • క్రమబద్ధీకరించుకోకుంటే అనుమతులుండవు
  • వెంచర్ల యజమానులే బాధ్యత వహించాలి
  • స్పష్టం చేసిన జిల్లా  పంచాయతీరాజ్‌ శాఖ

అనధికార ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం మరో సదవకాశాన్ని కల్పించింది. అక్రమంగా వెంచర్లు వేసి ప్లాట్లుగా చేసి విక్రయించిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల నుంచి  కొనుగోలు చేసిన వారు తమ ప్లాట్లను నిబంధనల మేరకు క్రమబద్ధీకరించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ప్రభుత్వం ప్రకటించిన ఈ లేఅవుట్‌    రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌  (ఎల్‌ఆర్‌ఎస్‌)ను ప్లాట్లు కొనుగోలు చేసిన వారు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు  సూచిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఖమ్మం నగరపాలక సంస్థ సహా మధిర, వైరా, సత్తుపల్లి మున్సిపాలిటీలతో పాటు   20 మండలాల పరిధిలోని 584 గ్రామ పంచాయతీల్లో  ఈ ఎల్‌ఆర్‌ఎస్‌ను అమలు చేస్తున్నారు. గ్రామ  పంచాయతీల్లో తొలిసారిగా  దీనిని అమలు చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. 

  -మామిళ్లగూడెం

మామిళ్లగూడెం : ప్రధానంగా గ్రామ పంచాయతీల పరిధిలో అక్రమంగా వేసిన వెంచర్ల వల్ల ఆ గ్రామ పంచాయతీకి రావాల్సిన ఆదాయం పోతోంది. అలాగే స్థలాలు కొనుగోలు చేసిన వారికి బ్యాంకు రుణాలు, ఇతర సౌకర్యాలు అందడం లేదు. అలాగే అక్రమ వెంచర్లలో కొనుగోలు చేసిన ఇంటి స్థలాలకు రక్షణ లేకుండా పోతోంది. దీంతోపాటు ఇల్లు నిర్మాణ సమయంలో అనుమతులు తీసుకునేందుకు అడ్డదారులు తొక్కాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వీటన్నింటినీ గమనించిన రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు కొనుగోలు చేసిన వారికి సరైన న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ ఎల్‌ఆర్‌ఎస్‌ను ప్రవేశ పెట్టింది. 

క్రమబద్ధీకరణకు కావాల్సిన పత్రాలు..

-2020 ఆగస్టు 26 కంటే ముందు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ దస్తావేజు పత్రాలు. ప్లాటు లేఔట్‌, 

పట్టణ భూ గరిష్ట చట్టం కింద జారీ అయిన ధ్రువపత్రం (యూఎల్‌సీ).

-ప్రభుత్వం విధించిన తేదీలోపు ఇంటి స్థలం మార్కెట్‌ విలువ ధ్రువపత్రం

-దరఖాస్తుదారుడి ఆధార్‌, ఇతర గుర్తింపు కార్డులు. 

చార్జీలు ఇలా..

-దరఖాస్తు చేసుకున్న వారు భూమి ప్లాటు విస్తీరణాన్ని అనుసరించి ప్రభుత్వం నిర్దేశించిన రుసుము చెల్లించాలి. అప్లికేషన్‌ ఫీజు రూ.1000 చెల్లించాలి. అదే వెంచర్‌ యజమానులు అయితే దరఖాస్తు రుసుము రూ.10 వేలు చెల్లించాలి. 

-వ్యక్తిగత ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు 0-100 చదరపు మీటర్లకు రూ. 200, 101-300 మీటర్లకు రూ.400, 301- 500 మీటర్లకు రూ.600, 500 చదరపు మీటర్లకు మించితే రూ.750 వరకు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మురికి వాడల్లో అయితే చదరపు మీటరుకు రూ.5 చెల్లిస్తే సరిపోతుంది. 

ఆన్‌లైన్‌లో సులభంగా..

www.lrs.telangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్‌ఆర్‌ఎస్‌ చేసుకునే దరఖాస్తుదారుడు సమీపంలోని మీ సేవ సెంటర్‌కుగానీ, నెట్‌ సెంటర్‌కు గానీ వెళ్లి తమ వద్ద ఉన్న ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. ఈ అవకాశం 31 జనవరి 2021 వరకు ఉంది. 

జిల్లాలో పరిస్థితి ఇలా..

ఖమ్మం జిల్లాలోని 20 గ్రామీణ మండలాల్లో చిన్న, పెద్ద వెంచర్లు వెలిశాయి. వాటికి అనుమతులు తీసుకోకుండానే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వినియోగదారులకు విక్రయించారు. జిల్లాలో 584 పంచాయతీల్లో ఇప్పటి వరకు అనుమతులు లేని వెంచర్లు 378 వరకు ఉన్నాయి. వాటిలో 41,357 ఇండ్ల ప్లాట్లు క్రయవిక్రయాలు జరిగాయి. కేవలం 81 వెంచర్లు మాత్రమే ప్రభుత్వ నిబంధనల మేరకు ఉన్నాయి. ఈ విషయాలను జిల్లా పంచాయతీ అధికారులు గుర్తించారు. 

మండలాల వారీగా ఇలా..

మండలం పంచాయతీలు అక్రమ వెంచర్లు ప్లాట్లు           

రఘునాథపాలెం 40 175 23,843

ఖమ్మం రూరల్‌ 23 47 5496

బోనకల్లు 22 18 387

చింతకాని 26 44 2837

ఏన్కూరు 25 00 00

కల్లూరు 31 08 732

కామేపల్లి 24 00 00

కొణిజర్ల 27 15 1540

కూసుమంచి 41 23 2208

మధిర 27 06 319

ముదిగొండ 25 16 1035

నేలకొండపల్లి 32 11 426

పెనుబల్లి 33 00 00

సత్తుపల్లి 21 04 613

సింగరేణి 41 03 218

తల్లాడ 27 03 115

తిరుమలాయపాలెం 40 09 1548

వేంసూరు 26 01 40

వైరా 22 00 00      

ఎర్రుపాలెం 31 00 00 584 378 41,357

-ఏన్కూరు, కామేపల్లి, వైరా మండలాల్లో ఇంకా కొన్ని పెద్ద గ్రామ పంచాయతీల్లో అక్రమంగా వెలిసిన వెంచర్ల జాబితాను జిల్లా పంచాయతీ అధికారులు సేకరిస్తున్నారు.

క్రమబద్ధీకరించుకోకుంటే చర్యలు తప్పవు


అక్రమ వెంచర్లు చేసిన వాళ్లు, అక్రమ వెంచర్లలో ఇండ్ల స్థలాలు కొనుగోలు చేసిన వారు ప్రభుత్వ నిబంధనల మేరకు ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవాలి. వాళ్లు తమ ప్లాట్లు, వెంచర్లు క్రమబద్ధీకరించుకోకుంటే భవిష్యత్తులో చట్టపరమైన చర్యలు ఉంటాయి. ప్లాట్ల కొనుగోలుదారులు ఇంటి నిర్మాణాలకు, రిజిస్ట్రేషన్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ ఉండాల్సిందే. కాబట్టి ప్లాట్ల కొనుగోలుదారులు తప్పని సరిగా తమ ఇంటి స్థలాలను ఎల్‌ఆర్‌ఎస్‌లో క్రమబద్దీకరించుకోవాల్సిందే. 

 -శ్రీకాంత్‌, జిల్లా పంచాయతీ అధికారి, ఖమ్మం