గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Sep 11, 2020 , 02:50:41

రెవె‘న్యూ’ చట్టం భేష్‌

రెవె‘న్యూ’ చట్టం భేష్‌

నూతన రెవెన్యూ చట్టంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. అత్యంత అవినీతిమయంగా మారిన వీఆర్‌వో వ్యవస్థను ప్రభుత్వం గుడ్‌బై చెప్పింది. దాని స్థానంలో నూతన చట్టాన్ని తీసుకొస్తున్నది. దీనిపై ప్రజలు, మరీ ముఖ్యంగా రైతులు ఆనందోత్సాహాల ఉన్నారు. ఈ చట్టంపై ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్న కొత్తగూడెం న్యాయవాది పలివెల గణేశ్‌బాబుతో ‘నమస్తే’ ఇంటర్వ్యూ.. 

- భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ  

నూతన రెవెన్యూ చట్టం ఎలా ఉంది...?

అడ్వకేట్‌: సీఎం కేసీఆర్‌ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టం బిల్లు  అద్భుతంగా ఉంది. రైతులకు ఏవిధంగా న్యాయం చేయగలమనే అంశంపై సుదీర్ఘకాలంపాటు అధ్యయనం చేసిన తరువాతనే ఈ బిల్లును ప్రభుత్వం రూపొందించింది. ఈ బిల్లు చట్టంగా మారితే రైతులకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. గతంలో రైతులు భూమిని అమ్మినా, కొన్నా అనేకరకాల ఇబ్బందులను ఎదుర్కొనేవారు. వీటన్నింటికీ ఈ ఒక్క చట్టంతో తెర పడుతుంది. రానున్న రోజుల్లో భూముల క్రయవిక్రయాల్లో సమూల మార్పులు వస్తాయి. భూముల సమగ్ర రికార్డు ప్రభుత్వం వద్ద ఉంటుంది. తప్పుడు రిజిస్ట్రేషన్లకు ఆస్కారం ఉండదు. 

రానున్న రోజుల్లో ఇది ఇంకా ఎలా ఉపయోగపడనుంది..?

రానున్న రోజుల్లో ఈ చట్టం రైతులకు ఎంతో మేలు చేస్తుంది. ఈ చట్టంతో భూముల సమగ్ర సర్వే జరుగుతుంది. భూముల రికార్డులు సంపూర్ణంగా, స్పష్టంగా ఉంటాయి. భూములకు సంబంధించి డబుల్‌-త్రిబుల్‌ రిజిస్ట్రేషన్లు ఉండవు. భూముల రికార్డులన్నీ పక్కాగా ఉండడంతో ఎవరు కొన్నా, అమ్మినా వెంటనే మార్పులు-చేర్పులు పూర్తవుతాయి. ఇప్పటివరకూ ఇదంతా లేదు. రైతులు సులువుగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా భూములను అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. గతంలోలాగా ఇరు వర్గాలు కోర్టులకు వెళ్లడం, ఏళ్లకేళ్లు తిరగడం వంటి సమస్యలు దాదాపుగా ఉండవు.

 ఈ చట్టంతో పేద రైతులకు 

ఎలాంటి మేలు కలుగుతుంది.. ?

అడ్వకేట్‌: పేద రైతులకు ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుంది. రైతులు తమ భూములను అమ్మినా, కొన్నా సులభంగా పాస్‌ పుస్తకంలో మార్పుకోవచ్చు. ఈ చట్టంతో తహసీల్దార్‌కు రిజిస్ట్రేషన్‌ అధికారాలు ఉంటాయి. భూమిని కొన్న వెంటనే రిజిస్ట్రేషన్‌, అదే రోజు మ్యుటేషన్‌ పూర్తవుతుంది.

అమ్మినవారి పాస్‌ బుక్‌లో మార్చేసి, ఆ భూమిని కొన్నవారి పాస్‌ పుస్తకంలో వివరాలు నమోదు చేస్తారు. ఇదంతా ఒక్కరోజులేనే పూర్తవుతుంది. 30, 40 ఏళ్ల కింద కొన్న భూములు కూడా ఇంకా రికార్డుల్లో మారలేదు. దీంతో గతంలో అమ్మిన వారు తమ పేరుతోనే ఉంది కదా అని తిరిగి అమ్మడం, వేరే వ్యక్తులు కొనడం వంటి మోసాలు ఇప్పటివరకూ జరిగాయి. ఇవన్నీ గొడవలకు, కక్షలకు దారితీశాయి. ఇక ముందు వీటికి అవకాశముండదు.