ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - Sep 09, 2020 , 01:14:04

రెవెన్యూ

రెవెన్యూ

n వీఆర్వో వ్యవస్థ రద్దుపై ప్రజల హర్షం

n కొత్త రెవెన్యూ చట్టానికి స్వాగతం

n క్యాబినెట్‌ నిర్ణయానికి మద్దతు

n రిజిస్ట్రేషన్‌తోనే మ్యుటేషన్‌

కోర్‌ బ్యాంకింగ్‌ తరహాలో సేవలు

రెవెన్యూశాఖలో అక్రమాలకు అడ్డకట్ట వేయడానికి కేసీఆర్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకున్నది.. ప్రక్షాళనలో భాగంగా వీఆర్వో వ్యవస్థను రద్దు చేసింది.. కొత్త చట్టం అమలుకు బలమైన పునాదులు వేసింది.. భూ యాజమాన్య హక్కులు- పట్టాదార్‌ పాస్‌పుస్తకాల బిల్లు-2020 బిల్లుకు క్యాబినెట్‌తో ఆమోద ముద్ర  సైతం వేయించింది.. ఇప్పటికే వీఆర్వోల నుంచి రికార్డులను సైతం స్వాధీనం చేసుకున్నది.. దీనిపై రైతాంగం, ప్రజానీకం నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.. ముఖ్యమంత్రి నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నారు.. కొత్త చట్టాన్ని సాదరంగా స్వాగతిస్తున్నాయి..

- ఖమ్మం ప్రతినిధి/     భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ

వందేళ్ల వారసత్వ భూమి  రికార్డుల్లో లేకుండా చేశారు..

సుబ్లేడులోని 459 సర్వే నెంబర్లో మా అమ్మ నెల్లుట్ల రాములమ్మ పేర 30 కుంటల భూమి ఉన్నాది. దానికి సంబంధించిన పాత పట్టాదారు పుస్తకం సుత ఉంది. అయినా సాదాబైనామాలో కొత్త పాస్‌బుక్‌ రాలేదు. తర్వాత ఆ భూమి అసలు రికార్డుల్లోనే లేదని వీఆర్వో చెప్పిన్రు.. ఆ భూమిని ఇప్పుడు ఎవరికో కట్టబెట్టిన్రు. పట్టా కూడా చేసిన్రు. ఇక మా గోడు ఇక ఎవరికి చెప్పాలయ్యా. సీఎం కేసీఆర్‌ మంచి నిర్ణయం తీసుకున్నరు. రైతులకు మరింత లాబం చేయాలె. మా కష్టం తీర్చాలె..

- నెల్లుట్ల వీరన్న, సుబ్లేడు, తిరుమలాయపాలెం, ఖమ్మం జిల్లా     

ఖమ్మం ప్రతినిధి /భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ : గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. రెవెన్యూ వ్యవస్థ సమూల ప్రక్షాళన చేసి, అవినీతి రహిత నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమవుతాయని పలువురు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో వీఆర్‌వో వ్యవస్థను రద్దు చేస్తూ  నూతన వ్యవస్థకు అంకురం చేయడాన్ని స్వాగతిస్తున్నారు. ఇన్నాళ్లు తాము పడిన ఇబ్బందులు ఇకమీదట ఉండవేనే నమ్మకాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. భూ రికార్డుల నిర్వహణ వీఆర్వోల పరిధిలో ఉండడంతో కొంతమంది చేతివాటం ప్రదర్శిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఉన్నతాధికారులకు పలు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో వీఆర్వో వ్యవస్థను సమూలంగ మార్పు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు గ్రామాల్లో వీఆర్వో వ్యవస్థ రద్దడవడంతో పండుగు వాతావరణ ం కనపించింది. ఇప్పటి వరకు ప్రజలకు వారి వెంట తిప్పుకున్న వీఆర్వోలు ఇక మీద అలా ఉండరని, మనకు న్యాయం జరుగుతుందని అన్యాయానికి గురైన పలువురు రైతులు ఆనందిస్తున్నారు. 

పారదర్శకతే ప్రాథమికం..

పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఒకే రోజులో రిజిస్ట్రేషన్‌,  మ్యూటేషన్‌,  పాస్‌బుక్‌ వచ్చే విధంగా నూతన చట్టం రానుంది. ఈ తరహా  చట్టం దేశంలోనే ఎక్కడా లేకపోవడంతో రైతులు, ప్రజలకు మంచి రోజులు రానున్నాయి. అవినీతికి తావులేకుండా పారదర్శకంగా, వివాదాలకు ఆస్కారం లేని చట్టం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. కొత్త చట్టం వల్ల ఒక్క రోజులోనే రికార్డుల మార్పిడి జరగనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో వీఆర్వోలు,

తహసీల్దార్‌ కార్యాలయంలో అవినీతి వల్ల ప్రజలు  తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. గతంలో ప్రభుత్వం నిర్వహించిన ధర్మగంట కార్యక్రమంలో పలు అవినీతి చర్యలు బహిర్గతమయ్యాయి. భూములకు విలువ పెరగడంతో పట్టణ, పట్టణ పరిసర ప్రాంతాల్లో వివాదాలు ఎక్కువయ్యాయి. క్రయ విక్రయాల్లో విపరీతమైన వ్యత్యాసం కనిపిస్తుండడంతో ఈజీ మనీ పెరిగింది. దీంతో వ్యవస్థీకృత నేరాల స్థానంలో భూ వివాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. గతంలో కొనుగోలు  చేసిన వ్యక్తులు భూములకు సంబంధించి పలు అంశాల్లో వివాదాలను సృష్టించే చర్యలకు వీఆర్వో వ్యవస్థ ఆజ్యం పోషించిందని పలువురు ఆరోపించడం గమనార్హం. రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో డబుల్‌, త్రిబుల్‌ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా పట్టించుకోవడంలో వీరు విఫలమవుతున్నారు. కావాలనే వివాదాలకు ఆజ్యం పోస్తూ భూమి స్వంతదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.