సోమవారం 30 నవంబర్ 2020
Badradri-kothagudem - Sep 07, 2020 , 01:28:02

24\7ప‌వ‌ర్‌

24\7ప‌వ‌ర్‌

  • భారీ వర్షాలు కురిసినా నిరంతరాయంగా కరెంటు సరఫరా 
  • పల్లె, పట్టణ ప్రగతిలో పరిష్కారమైన విద్యుత్‌ సమస్యలు
  • u నూతన స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు వేసిన అధికారులు
  • u కుంగిన స్తంభాలు, తెగిన తీగల స్థానాల్లో కొత్తవి ఏర్పాటు
  • u ఫలితంగా వానకాలంలో రెప్పపాటు కూడా లేని అంతరాయం
  • u ఉమ్మడి జిల్లాలో రూ.31.28 కోట్లతో కొనసాగుతున్న పనులు
  • u నిరంతర కరెంటుతో ఉపాధి, ఉత్పత్తి రంగాలకు ఊతం
  • u నాణ్యమైన విద్యుత్‌ సరఫరాతో సకల జనుల్లో ఆనందం
  • u నాన్‌స్టాప్‌ పవర్‌తో నిరుడు గణనీయంగా పెరిగిన దిగుబడి

తెలంగాణ ఏర్పడితే ప్రజలు చీకట్లో జీవించాల్సిందే అని మాట్లాడిన వాళ్ల నోళ్లు మూతపడ్డాయి. విద్యుత్‌ లేకపోవడంతో పరిశ్రమలు ఏర్పాటు కావు వ్యాపార వేత్తలు పెట్టుబడులు పెట్టరు అన్న వాళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీటైన సమాధానం చెప్పారు. నిరంతర విద్యుత్‌ అందిస్తూ కరెంట్‌ కష్టాల నుంచి గట్టెక్కించారు. విద్యుత్‌ శాఖ నిపుణులతో చర్చించి రాష్ట్రంలో కరెంట్‌ సమస్యలకు చరమ గీతం పాడారు. కేసీఆర్‌ ముందుచూపుతో రాష్ట్రం విద్యుత్‌ కాంతులతో వెలుగులు విరజిమ్ముతున్నాయి. పల్లె, పట్టణ ప్రగతితో  ప్రతి వినియోగదారునికి నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అందుతోంది. గ్రామాలు, పట్టణాల్లో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించి ప్రభుత్వ లక్ష్యాలను సాధిస్తూ నిరంతరం వెలుగులు అందిస్తున్నారు.   

2014కు ముందు.. 

వర్షం వచ్చిందంటే చాలు.. చిటుక్కున కరెంటు పోయేది. వర్షం తగ్గినా కూడా వచ్చేది కాదు. గజిబిజిగా ఉన్న విద్యుత్‌ లైన్లలో సమస్యలు తలెత్తేవి. రోజుల తరబడి మరమ్మతులు జరిగేవి. ఎప్పటికో కరెంటు వచ్చేది. 

2014 తరువాత..

నిరంతరం కరెంటు సరఫరా అవుతోంది. నాణ్యమైన విద్యుత్‌ అందుతోంది. ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. కానీ రెప్పపాటులో కూడా కరెంటు కట్‌ కాలేదు. ఎడతెరిపి లేకుండా జోరు వానలు కురుస్తున్నా కూడా.. విరామం లేకుండా కరెంటు సరఫరా అయింది. దీనికి ముఖ్య కారణం.. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు. నిరుడు ఇదే రోజుల్లో ’30 రోజుల కార్యాచరణ’గా మొదలైన కార్యక్రమంలో విద్యుత్‌ సమస్యలను తీర్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. తరువాత ‘పవర్‌ వీక్‌' ప్రోగ్రాంలో విద్యుత్‌ సమస్య అన్నదే లేకుండా చేసేందుకు అధికారులు అహర్నిశలూ కృషిచేశారు. వేలాడుతున్న వైర్లను, తెగిపోయిన తీగలను తీసేసి వాటి స్థానంలో కొత్తవాటిని ఏర్పాటుచేశారు. ట్రాన్స్‌ఫార్మర్లకు మరమ్మతులు చేయించారు. కాలం చెల్లిన వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చారు. విద్యుత్‌ సబ్‌ స్టేషన్లనూ ప్రక్షాళన చేశారు. ఫలితంగా ప్రజలకు నిర్వఘ్నంగా కరెంటు సరఫరా అవుతోంది. దీంతో విద్యుత్‌ సమస్యలను ప్రభుత్వం సంపూర్ణంగా పరిష్కరించినట్లయింది.  కుంభవృష్టి కురిసినా ఉమ్మడి జిల్లాలో ఏ ఒక్క గ్రామంలోనూ కరెంటు పోకపోవడమే రాష్ట్ర ప్రభుత్వ ముందుచూపునకు ఉదాహరణ.  

రూ.31.28 కోట్లతో  విద్యుత్‌ సమస్యల పరిష్కారం..

ఖమ్మం జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా 18.48 కోట్లు, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రూ.11.70 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మొత్తం 31.28 కోట్లతో 80 శాతం పనులను పూర్తి చేసింది. 20 శాతం పనులు కొనసాగుతున్నాయి. అధికారులు 14 రకాల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించారు. ప్రధానంగా పల్లెలో రైతులకు వ్యవసాయానికి వసరమైన విద్యుత్‌ సరఫరాకు ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. గ్రామాల్లో లోవోల్టేజీ సమస్యలు రాకుండా నూతనంగా ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. వంగిన, విరిగిన, తుప్పుపట్టిన స్తంభాలను తొలగించి కొత్తవి అమర్చారు. సాగిన, తెగిన వైర్లను సరిచేశారు. అవసరమైన చోట 3వ, 5వ లైన్‌ ద్వారా అదనపు వైర్లు లాగి విద్యుత్‌ సరఫరాకు మార్గం సుగమం చేశారు. 

ఆగస్టు 16 ..   ఖమ్మం రూరల్‌ మండలం పల్లెగూడెం చెరువులోని విద్యుత్‌      స్తంభం భారీ వర్షాలకు మరమ్మతులకు గురవ్వడంతో తనగంపాడుకు           విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వెంటనే విషయం తెలుసుకున్న విద్యుత్‌ అధికారులు చెరువులో నాటుపడవపై స్తంభం వద్దకు చేరుకొని మరమ్మతులు  చేసి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. 


నాడు.. గాలిదుమారం వచ్చినా.. చిన్న వర్షం పడినా.. కరెంటు పోయేది. విద్యుత్‌ తీగలు తెగిపడేవి. స్తంభాలు నేలకొరిగేవి. ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోయేవి. కరెంటు తీగలు తగిలి ప్రాణాలు పోయేవి. కరెంటు పోవడంతో పల్లెలు అంధకారంలో ఉండేవి.. మళ్లీ కరెంటు రావడానికి రోజులు పట్టేవి.. మారుమూల ప్రాంతాల్లో అయితే ఒక్కోసారి నెలలు గడిచినా గూడేల్లో వెలుగులు రాకపోయేవి. 


నేడు.. భారీ వర్షాలు కురిసినా.. గాలి దుమారం బీభత్సం సృష్టించినా.. వైర్లు తెగిపడడం లేదు.. స్తంభాలు నేలకొరగట్లేదు. అసలు కరెంటు కష్టాలు ఈ వర్షాకాలంలో మచ్చుకు కూడా కానరాలేదు. ఇటీవల వర్షాలు దంచి కొట్టాయి. వాగులు, చెరువులు పొంగి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. అయినా కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడిన సంఘటన భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా కనిపించలేదు. సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో ప్రవేశపెట్టిన ‘పల్లె ప్రగతి’తో కరెంటు సమస్య సమూలంగా సమసిపోయాయి. ‘పవర్‌ వీక్‌' పేరుతో విద్యుత్‌ లైన్ల మరమ్మతుల పనులు సమస్యలు కూకటివేళ్ల నుంచి తుడిచిపెట్టాయి.  


కానీ ఇప్పటి పరిస్థితి పూర్తి భిన్నం. 

స్వరాష్ట్రం సిద్ధించింది..

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పగ్గాలు చేపట్టింది. 

ఎంతో ముందుచూపుతో పాలన సాగిస్తోంది. 

ఇందుకు ఒక్కటే ఉదాహరణ. కేసీఆర్‌ పాలనలో ఇలాంటి కష్టాలేవీ లేకపోవడం. 

పైన చెప్పుకున్న కరెంటు కష్టాలు ఈ వర్షాకాలంలో మచ్చుకు కూడా కానరాలేదు. ఇటీవల రెండు మూడు వారాలపాటు ఎడతెరిపి లేకుండా, కాలు బయట పెట్టేందుకు ఆస్కారం లేకుండా వర్షాలు దంచి కొట్టాయి. వాగులు, చెరువులు పొంగి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. ఆ సమయంలోగానీ, ఆ తరువాత సమయంలోగానీ కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడిన సంఘటన భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా కన్పించలేదు. సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో ఆలోచించి తీసుకున్న నిర్ణయంతో ఎంతో మేలు జరిగింది. జోరు వానలు కురిసినా దోమల బెడద లేకుండా ప్రజలంతా ప్రశాంతంగా నిద్రపోయారు. నిరుడు ఇదే రోజున ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొదలు పెట్టిన ’30 రోజుల కార్యాచరణ’, దానికి కొనసాగింపుగా వచ్చిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం.. గ్రామాల్లో సమస్యలను సమూలంగా రూపుమాపాయి. ముఖ్యంగా ‘పవర్‌ వక్‌' పేరుతో కొనసాగిన విద్యుత్‌ లైన్ల మరమ్మతుల పనులు కరెంటు సమస్యలను కూకటివేళ్ల నుంచి తుడిచిపెట్టాయి. దాని ఫలితాన్ని మొన్నటి జోరు వర్షాల సమయంలో జిల్లా ప్రజలందరూ ఆస్వాదించారు. ఇదీ.. ప్రజా సం‘క్షేమం’ కోసం అసలైన ప్రభుత్వం తీసుకునే సిసలైన చర్య.  

-ఖమ్మం ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ 


ట్రింగ్‌.. ట్రింగ్‌.. ట్రింగ్‌..

‘హలో.. కరెంటాఫీసా అండి.’

‘అవును.. చెప్పండి. ఏం కావాలి?..’

‘సార్‌ మా ఊళ్లో కరెంటు పోయి మూడు రోజులైంది. మొన్న వర్షం వచ్చినప్పుడు కరెంటు తీశారు. ఇన్ని రోజులైనా ఇంకా ఇవ్వలేదు. కరెంటు లేక రాత్రిళ్లు జాగారం చేస్తున్నాం. దోమలు దండయాత్ర చేస్తుండడంతో చిన్న పిల్లలు నిద్ర కూడా పోవడం లేదు. ఇంతకూ కరెంటు ఎప్పుడొస్తుంది సార్‌..’

‘ఇప్పట్లో రాదయ్య.. ఇంకా వారం రోజులు పడుతుంది. మీ లైన్‌లో రెండు స్తంభాలు విరిగాయి. ఒక ట్రాన్స్‌ఫార్మర్‌ కూలింది. నాలుగు చోట్ల వైర్లు తెగిపోయాయి. ఇవన్నీ సరిచేయడానికి ఇంకా టైం పడుతుంది. ఇంకా వారం పది రోజులు ఆగండి. గడియ గడియకూ ఫోన్‌ చేసి విసిగించకండి.’

సమైక్య పాలనలో ఇలాంటి సంభాషణలు కోకొల్లలు. స్తంభాలు పాతాలని, ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేయించుకొని రావాలని, తెగిన వైర్లను సరిచేయడానికి సమయం పడుతుందని చెబుతూ రోజులకు రోజులు సాగదీసేవారు విద్యుత్‌ శాఖ అధికారులు. అప్పటి ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోకపోవడంతో ఇటు విద్యుత్‌ అధికారులు నలిగిపోయే వారు. ఇటు ప్రజలూ అనేక అవస్థలు పడేవారు. కరెంటు వచ్చే దాకా ఎదురు చూస్తూనే ఉండేవారు.

పక్కాగా పనులు..

పల్లె ప్రగతిలో జరిగిన పనుల్లో గుర్తించిన పనుల పురోగతి ఇలా ఉంది. వంగిన స్తంభాలు 4048 ఉండగా వాటిని మొత్తానికి మొత్తం సవరించారు. దెబ్బతిన్న స్తంభాలు 3724 ఉండగా అన్నింటినీ తొలగించి కొత్తవి ఏర్పాటుచేశారు. రహదారికి మధ్యలో ఉన్న 6929 స్తంభాలను తొలగించారు. 2045 ట్రాన్స్‌ఫార్మర్లకు ఎర్తింగ్‌ ఇచ్చారు. స్తంభాల మధ్య సాగిన తీగలను లాగడానికి 1724 పనులు గుర్తించి వాటిలో 1704 పనులను పూర్తి చేశారు. స్తంభాల మధ్య సాగిన తీగలకు అదనంగా స్తంభాల ఏర్పాటుకు 1961 పనులు గుర్తించారు. వాటిలో 1782 పూర్తి చేశారు. దెబ్బతిన్న తీగలను లాగేందుకు 771.01 కిలోమీటర్లను గుర్తించి పూర్తి చేశారు. వీధి లైట్లకు మీటర్లు ఏర్పాటు చేసేందుకు 2381 పనులను గుర్తించి అన్నింటినీ పూర్తి చేశారు. మూడో లైన్‌ అవసరం ఉన్న ప్రాంతాల్లో 855.13 కిలోమీటర్లను గుర్తించి పూర్తి చేశారు. ఐదో లైన్‌ అవసరం ఉన్న ప్రాంతాల్లో 44.34 కిలోమీటర్లను గుర్తించి పూర్తి చేశారు. సాగిన తీగలను బిగించేందకు 9773 పనులు గుర్తించి పూర్తి చేశారు. ఎంసీబీ బాక్సుల ఏర్పాటు కోసం 2892 పనులను పూర్తి చేశారు. మొత్తంగా పల్లె ప్రగతి ద్వారా 90 శాతం పనులు పూర్తి చేశారు. పట్టణ ప్రగతిలో కూడా ఇదే విధంగా పనులు జరిగాయి.  


కరెంట్‌ కష్టాలకు చెక్‌

గతంలో వర్షం పడితే కరెంట్‌ తీగలు తెగిపోయేవి. స్తంభాలు కూలిపోయేవి. ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులకు గురయ్యేవి. ఒక్కోసారి ప్రాణనష్టం కూడా జరిగేది. తెగి పడిన విద్యుత్‌ తీగలకు విద్యుత్‌ సరఫరా అయ్యే కారణంగా మూగజీవాలైతే లెక్కకు మిక్కిలి ప్రాణాలు వదిలేవి. ఇలాంటి వాటన్నింటికీ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో ప్రభుత్వం చెక్‌ పెట్టింది. విద్యుత్‌శాఖలో గణనీయమైన మార్పులు తెచ్చింది. విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయి

నుంచే చొరవ చూపింది. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసింది. అలాగే వైర్లను కూడా కొత్తగా అమర్చింది. దీంతో అవన్నీ పటిష్టంగా ఉన్నారు. ఇటీవల భారీ వర్షాలు కురిసినా చెక్కు చెదరలేదు. భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం దాల్చి 61.6 అడుగులకు చేరుకొని ప్రమాదకర పరిస్ధితులలో ప్రవహించింది. అయినప్పటికీ గోదావరి పరీవాహక ప్రాంతాల్లో మాత్రం విద్యుత్‌ సరఫరాకు ఆటంకం కలుగలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గుండాల మండలంలో మల్లన్నవాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆ ఒక గ్రామంలోనే విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. జిల్లా అధికారులు అప్రమత్తమై యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేసి కరెంట్‌ సరఫరాను పునరుద్ధరించారు.

గోదావరి వరదలకు కొన్ని ఊళ్లు మునిగినా విద్యుత్‌ సరఫరాకు ఆటంకంల లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. నాటు పడవల్లో వెళ్లి మరీ మరమ్మతులు చేసి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. బూర్గంపహాడు మండలంతోపాటు గోదావరి అవతల ఉన్న దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో కొన్ని చోట్ల వైర్లు తెగిపోతే విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ సురేందర్‌ ఆధ్వర్యంలో అధికారులు వెంటనే మరమ్మతులు చేసి ప్రజలకు విద్యుత్‌ను అందించారు.