బుధవారం 02 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Sep 05, 2020 , 01:26:53

శ్లోకాలను పఠిస్తే మానసిక స్థైర్యం

శ్లోకాలను పఠిస్తే మానసిక  స్థైర్యం

  •  భద్రాద్రిలో కైంకర్యాలన్నీ సంప్రదాయ ప్రకారమే జరుగుతున్నాయి
  • కరోనా ఈ ఏడాదంతా ఉండే అవకాశముంది
  •  త్రిదండి చినజీయర్‌స్వామి
  • భద్రాచలంలోరాముణ్ని దర్శించుకున్న చినజీయర్‌స్వామి

భద్రాచలం: శ్రీరామాయణంలోని 24 వేల శ్లోకాలను ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క రోజు పఠిస్తే చక్కటి ఆత్మైస్థెర్యాన్ని పొందుతారని త్రిదండి చినజీయర్‌స్వామి వెల్లడించారు. భద్రాచలంలో త్రిదండి చినజీయర్‌స్వామి, అహోబిల రామానుజ జీయర్‌స్వామిలు శుక్రవారం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తదుపరి చినజీయర్‌స్వామి కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఆలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి దివ్యమూర్తులకు జరిగే కైంకర్యాలన్నీ సంప్రదాయబద్ధంగానే జరుగుతున్నాయని  త్రిదండి చినజీయర్‌స్వామి వెల్లడించారు.


రామాలయంలో స్వామి వారికి జరిగే పూజా కార్యక్రమాలన్ని భక్తరామదాసు, తూము లక్ష్మీనరసింహదాసుల కాలం నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారమే జరుగుతున్నాయని అన్నారు. ఇక్కడ కల్యాణాలు పూర్వ కాలం నుంచి ఏ విధంగా జరుగుతున్నాయో అదేవిధంగా ఇప్పుడూ జరుగుతున్నాయని అన్నారు. ఎవరి సంప్రదాయం వారిది కాబట్టి ఇతరులు కూడా దానిని గౌరవించాలని కోరారు. నిజ ఆశ్వయుజ పునర్వసు నుంచి కార్తీక పునర్వసు వరకు 27 రోజుల పాటు శ్రీరామాయణ పారాయణ క్రతువును నిర్వహిస్తున్నామని చినజీయర్‌స్వామి తెలిపారు. అలాగే కరోనా మహమ్మారి ఇప్పట్లో పోయేది కాదని, శార్వరీ నామ సంవత్సరాంతం వరకు ఉండే అవకాశం ఉందని,  సృష్టిని కలుషితం చేయకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని అన్నారు. శ్రీరాముడు 11 వేల సంవత్సరాలు ప్రజారంజక పరిపాలన సాగించారని, ఆ సమయంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని, అలాంటి వాతావరణం ఈ లోకానికి ఎంతో అవసరమని వివరించారు. దేవస్థానం ఈవో రమాదేవి, ఏఈవో శ్రావణ్‌కుమార్‌, స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు పాల్గొన్నారు.

శ్రీరంగనాథునికి ప్రత్యేక పూజలు

భద్రాచలంలోని స్థానిక జీయర్‌మఠంలో ఉన్న శ్రీరంగనాథుని ఆలయంలో త్రిదండి చినజీయర్‌స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మఠం నిర్వాహకులతో కొద్దిసేపు మాట్లాడారు.