గురువారం 03 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Sep 02, 2020 , 02:49:09

స్మార్ట్‌ పాఠాలు షురూ

స్మార్ట్‌ పాఠాలు షురూ

రఘునాథపాలెం మండలంలోని కోయచెలక, రేగుల చెలకలో మంగళవారం ఖమ్మం కలెక్టర్‌, డీఈవో మదన్‌మోహన్‌ ఆన్‌లైన్‌ పాఠాలను ప్రారంభించారు. కోయచెలక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రేగులచెలక ప్రాథమిక పాఠశాలల విద్యార్ధుల ఇండ్లను సందర్శించి ఆన్‌లైన్‌ తరగతులను కలెక్టర్‌ పరీశీలించారు. టీ శాట్‌ ద్వారా 4వ, 10వ తరగతి విద్యార్థులకు దూరదర్శన్‌ చానెల్‌ ద్వారా ప్రసారమవుతున్న మ్యాథ్స్‌, ఫిజికల్‌ సైన్స్‌ తరగతులను పరిశీలించారు. ఇండ్లలో విద్యార్ధులు తరగతులకు హజరయ్యే సందర్భంగా తప్పనిసరిగా మాస్క్‌లు ధరించి, భౌతికదూరం పాటించేలా చూడాలని కలెక్టర్‌ సూచించారు. ఆన్‌లైన్‌ పాఠాలను శ్రద్ధగా విని నోట్‌ చేసుకోవాలని, సందేహాలను సంబంధిత టీచర్ల ద్వారా నివృత్తి చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఆయా పాఠశాలలకు సంబంధించిన అన్ని సబ్జెక్ట్‌ల ఉపాధ్యాయుల సెల్‌ఫోన్‌ నెంబర్లు ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉంచాలని డీఈఓని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈవో శ్రీనివాసరావు, మండల ప్రత్యేకాధికారి కే విజయకుమారి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు మాదంశెట్టి హరిప్రసాద్‌, కొర్లపాటి రామారావు, ఎంపీటీసీ బలుసుపాటి సుజాత, ఉపసర్పంచ్‌లు నున్నా వెంకటేశ్వర్లు, చెరుకూరి పూర్ణచందర్‌రావు, ఎస్‌ఎంసీ చైర్మన్‌ రమణ తదితరులు ఉన్నారు.

తొలిరోజు 88.64 శాతం హాజరు

 జిల్లాలో డిజిటల్‌ పాఠాలను తొలిరోజు 88.64 శాతం వీక్షించారు. మండలాల వారీగా  సింగరేణిలో 70.55శాతం, కామేపల్లిలో 84.28, రఘునాథపాలెం 98.95, ఖమ్మం రూరల్‌ 98, తిరుమలాయపాలెం 98.72, కూసుమంచి 79.98, నేలకొండపల్లి 96.61, ముదిగొండ 96.72, చింతకాని 95.93, ఖమ్మం అర్బన్‌లో 86.44, కొణిజర్ల 98.12, ఏన్కూర్‌ 90.17, కల్లూరు 91.01, పెనుబల్లి 79.61, సత్తుపల్లి 85.76, వేంసూర్‌ 73.59, తల్లాడ 87.56, వైరా 86.33, బోనకల్‌ 62.13, మధిర 97.54, ఎర్రుపాలెం 98.40 శాతం విద్యార్థులు ఆన్‌లైన్‌లో పాఠాలు విన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,329 పాఠశాలలు ఉండగా 75,163 మంది విద్యార్థులున్నారు. వీరిలో 66,622మంది పాఠాలు విని 88.64 శాతం నమోదైంది. 

 క్షేత్రస్థాయిలో టీచర్లు

 ఆన్‌లైన్‌ పాఠాల నేపథ్యంలో ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్ల బాటపట్టారు. ఉదయం 8 గంటల నుంచే డిజిటల్‌ పాఠాలు మొదలయ్యాయి. డీటీహెచ్‌ ద్వారా 21,132 మంది, టీవీల ద్వారా 49,459 ద్వారా వీక్షిస్తున్నారు. టీవీలు, డీటీహెచ్‌లు, మొబైల్‌ఫోన్లు లేని విద్యార్థులకు పాఠశాలల్లో ఏర్పాట్లు చేశారు.

భద్రాద్రి జిల్లాలో..

కొత్తగూడెం ఎడ్యుకేషన్‌: సుమారు ఐదు నెలల లాక్‌డౌన్‌ అనంతరం విద్యార్థులకు పాఠశాలల్లో బోధన, ఆన్‌లైన్‌ ద్వారా ఈ రోజు ప్రారంభం అయింది. టీశాట్‌, దూరదర్శన్‌ యాదగిరి ఛానల్స్‌ ద్వారా 3 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్‌, గణితం, సామాన్యశాస్త్రం, భౌతికశాస్త్రం విషయాల్లో ప్రసారమైన పాఠాలను విద్యార్థులు ఎంతో ఆసక్తిగా తిలకించారు.  ఉపాధ్యాయులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే విద్యార్థులు పాఠాలను ఎలా అనుసరిస్తున్నారో గమనించారు.  మండల విద్యాశాఖాధికారుల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం జిల్లాలోని మొత్తం 1,364 పాఠశాలల్లో 3 నుంచి 10వ తరగతి వరకు 69,443 మంది విద్యార్థులు ఉండగా వారిలో 43,197 మంది దూరదర్శన్‌ ద్వారా 288 మంది కంప్యూటర్ల ద్వారా మొబైల్‌ ఫోన్ల ద్వారా 8160 మంది వీక్షించారు. మంగళవారం ప్రసారమైన పాఠాల్లో 5వ తరగతి విద్యార్థులు, ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థులకు ఎటువంటి ప్రసారం  కాలేదు. ఎటువంటి డిజిటల్‌ పరికరాల సదుపాయం లేని 418 మందికి వర్క్‌షీట్ల ద్వారా పాఠాలు అందించారు. జిల్లాలోని 3228 మంది ఉపాధ్యాయులు పిల్లలను పర్యవేక్షించారు. కొన్ని ప్రాంతాల్లో కేబుల్‌ నెట్‌వర్క్‌ ద్వారా కూడా టీశాట్‌ ప్రసారాలు రాకపోవడం వల్ల కొంతమంది విద్యార్థులు ఇబ్బంది పడినప్పటికీ ఉపాధ్యాయులు వారిని వేరే విద్యార్థులతో మ్యాపింగ్‌ చేశారు. జిల్లా మానిటరింగ్‌ అధికారులైన ఎం.రామేశ్వరరావు, ఎస్‌.మాధవరావు జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో చదువుతున్న పిల్లల ఇళ్లకు వెళ్లి వారు టీవీ లేదా మొబైల్‌ ఫోన్ల ద్వారా పాఠాలను ఎలా వింటున్నారో పరిశీలించారు. ప్రసారాలు లేని ప్రాంతాల్లో కేబుల్‌ ఆపరేటర్లతో మాట్లాడి టీశాట్‌ ప్రసారం అయ్యేలా చూస్తామని డీఈవో సోమశేఖరశర్మ తెలిపారు.