శనివారం 28 నవంబర్ 2020
Badradri-kothagudem - Sep 02, 2020 , 00:51:20

అడవి జంతువుల జోలికొస్తే జైలుకే

అడవి జంతువుల జోలికొస్తే జైలుకే

లక్ష్మీదేవిపల్లి: అటవీ జంతువుల సంరక్షణకు అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. అడవిలోని అరుదైన జాతులకు చెందిన జంతువులు వేటగాళ్లబారిన పడకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్త్తున్నారు. అడవి జంతువులను వేటాడేందుకు అంతర్రాష్ట్ర ముఠాలు తిరుగుతున్నాయి. అడవిలోని గిరిజనులను మభ్య పెట్టి, వారి సహకారంతో వేట సాగిస్తున్నారు. ఆ జంతువులను ఈ ముఠాలు ఇతర రాష్ర్టాలకు, దేశాలకు తరలిస్తూ దండిగా దండుకుంటున్నాయి. వీరి గుట్టు రట్టు చేసేందుకు, ఆట కట్టించేందుకు అటవీ అధికారులు అండర్‌ కవర్‌ ఆపరేషన్‌ దాడులు సాగిస్తున్నారు. 

పంగోలిన్‌ ముఠా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అటవీ ప్రాంతంలో పంగోలిన్‌(అలుగు)లు ఉన్నాయి. వీటిని వేటాడేందుకు అంతర్రాష్ట్ర ముఠాలు రంగంలోకి దిగుతున్నాయి. జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉండే అమాయకులైన గిరిజనుల సహకారంతో పంగోలిన్‌లను సేకరిస్తున్నారు. వీటి పొలుసు(చర్మం)కు ఎక్కువ డిమాండ్‌ ఉంది. అందుకే వీటిని పట్టుకునేందుకు దాదాపు 10 నుంచి 12 మంది కలిసి ముఠాగా ఏర్పడుతున్నారు. వీరిలో ఒకరు పంగోలిన్‌ను పట్టుకుంటారు. దానిని మరొకరు తరలిస్తారు. మరొకరు అమ్ముతారు. పంగోలిన్‌ పొలుసు చర్మాలకు జాతీయ, అంతర్జాతీయంగా ఎక్కువ డిమాండ్‌ ఉంది. అందుకే వీటిపై వేటగాళ్లు దృష్టి సారించారు. ఇలాంటి ముఠాలను ఇటీవల అటవీ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇది ఎలా జరిగిందంటే...

అండర్‌ కవర్‌ ఆపరేషన్‌..

ఈ అంతర్రాష్ట్ర ముఠాలను పట్టుకునేందుకు అటవీ అధికారులు అండర్‌ కవర్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఇటీవల అందిన విశ్వసనీయ సమాచారంతో అటవీ అధికారులు దాదాపు నెల రోజులపాటు శ్రమించి పకడ్బందీగా వ్యూహం పన్ని ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు. పొలుసు చర్మాన్ని అమ్మకానికి పెట్టిన అంతర్రాష్ట్ర ముఠాను రాష్ట్ర అటవీ శాఖ ఇటీవల ఛేదించింది. సుమారు వారం రోజులపాటు అండర్‌ కవర్‌ ఆపరేషన్‌ చేసిన అటవీశాఖ అధికారులు తామే కొనుగోలుదారులుగా అవతారమెత్తి మొత్తం 12మందిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ సహా కొత్తగూడెం, భద్రాచలం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లో అధికారులు ఈ ఆపరేషన్‌ నిర్వహించారు. చర్మాలను సేకరిస్తున్నారనే సమాచారంతో కొత్తగూడెం అటవీ అధికారులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతను ఇచ్చిన సమాచారంతో మూడు రోజులపాటు హైదరాబాద్‌ సహా వివిధ ప్రాంతాల్లో అటవీ అధికారులు నిఘా పెట్టి ముఠా సభ్యులను పట్టుకున్నారు. ఈ అంతర్రాష్ట్ర ముఠాలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌, అస్సాం, ఒడిశా, బెంగాల్‌ రాష్ర్టాలకు చెందిన వారు ఉన్నట్లుగా అటవీ అధికారులు గుర్తించారు. ఈ అండర్‌ కవర్‌ ఆపరేషన్‌ను రెండుసార్లు నిర్వహించారు. జూన్‌ 14న ములకలపల్లి మండలంలో ఏడుగురిని, ఆగస్టు 4న 12మందిని అదుపులోకి తీసుకున్నారు. అలుగు పొలుసులను సేకరించి అమ్మాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పొలుసులతో పట్టుపడితే జైలు జీవితం తప్పదని హెచ్చరిస్తున్నారు.

 పంగోలిన్‌ పొలుసులకు  భారీ డిమాండ్‌ 

పంగోలిన్‌ పొలుసుల వల్ల వివిధ రకాల ప్రయోజనాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. అందుకే వాటికి బ్లాక్‌ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ పొలుసుల కేజీ విలువ లక్షల రూపాయల్లో ఉంటుందని సమాచారం. చైనా సంప్రదాయ ఔషధాల తయారీలో అలుగు పొలుసులను వాడతారని సమాచారం. కరోనా నేపథ్యంలో అలుగు మాంసం, చర్మం క్రయవిక్రయాలను చైనా నిషేధించింది. కొన్ని రకాల మెడిసిన్‌ తయారీతోపాటు ఉంగరాలను ధరించడం ద్వారా దుష్ట శక్తులు దరిచేరవనే మూఢ నమ్మకాల కారణంగా కూడా వీటికి డిమాండ్‌ ఏర్పడింది. మన దేశం నుంచి రోడ్డు మార్గం ద్వారా బీహార్‌, నేపాల్‌, మణిపూర్‌, బర్మా రూట్లలో చైనాకు ఇవి ఎగుమతయ్యే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. పంగోలిన్‌ పొలుసులతో ప్రయోజనాల పేరుతో ప్రచారంలో ఉన్నవన్నీ అవాస్తవాలేనని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.  

జంతువుల జోలికొస్తే జైలుకే

అడవి జంతువుల జోలికొస్తే జైలుకు వెళ్లాల్సుంటుంది. అటవీ ప్రాంతాల్లో జంతువుల వేట తగ్గింది. అయితే కొందరు అంతర్రాష్ట్ర ముఠాల సభ్యులు గిరిజనులకు కొద్ది మొత్తంలో ఆశ చూపి అలుగు వంటి జంతువుల పొలుసులను సేకరిస్తున్నారు. ఇటువంటి అరుదైన జంతువులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఈ నేరం చేసి పట్టుపడితే జైలుకు వెళ్లాల్సిందే. - రంజిత్‌నాయక్‌, డీఎఫ్‌వో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా