గురువారం 03 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Aug 31, 2020 , 02:47:14

మణుగూరుకు మహర్దశ

మణుగూరుకు మహర్దశ

  • డ్రైనేజీ పనులకు రూ.150 కోట్ల నిధులు
  • పట్టణ సుందరీకరణ వైపు అడుగులు
  • ఆహ్లాదం కోసం గ్రీన్‌ పార్క్‌లు, గ్రీనరీ కోసం నర్సరీల ఏర్పాటు
  • మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రభుత్వ విప్‌ రేగా ప్రత్యేక చొరవ

మణుగూరు: మణుగూరు మున్సిపాలిటీ కొత్త సొబగులు సంతరించుకోనుంది. పట్టణానికి మహర్దశ పట్టనుంది. మున్సిపాలిటీ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా మున్సిపాలిటీ డ్రెయిన్స్‌ అభివృద్ధి పనులకు కోసం ప్రత్యేకంగా రూ.150 కోట్ల నిధుల విడుదలకు అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. స్టామ్‌ వాటర్‌ డ్రైనేజీ సిస్టం ఏర్పాటుకు రూ.44.72 కోట్ల వ్యయంతో ప్రత్యేక ప్రతిపాదనలు తయారు చేశారు. మరో రూ.109.39 కోట్లు వ్యయంతో సీవరేజ్‌ సిస్టమ్‌ నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్దం చేశారు. కొత్తగా డంపింగ్‌ యార్డు ఏర్పాటుకు రూ. 5 కోట్లుతో ప్రతి పాధనలు రూపొందించారు. ఇటీవల కురిసిన వర్షాలకు పట్టణంలోని మొట్లవాగు, కట్టువాగు ఉప్పొంగడంతో పాటు మణుగూరు ఏరియా సింగరేణి గనులు నుంచి వరద రావడం, కుంటలు చెరువులు అలుగుపడి మణుగూరు పట్టణ జలదిగ్బందమైంది. దీంతో మణుగూరు మున్సిపాటీలో పర్యటించిన రాష్ట్ర  ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, భద్రాద్రి కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డిలు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని కొత్తగా డ్రెయిన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

పారిశుధ్యానికి ప్రాధాన్యం..

ఇంతకు ముందు నిర్మాణం చేసిన అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ తొలగించి కొత్త డ్రైనేజీని నిర్మాణం చేయనున్నారు. ప్రత్యేకంగా డ్రైనేజ్‌ నుంచి వచ్చే నీటి ఒక్క దగ్గర నిల్వచేసి మోటర్ల ద్వారా ఎస్టీపీలో రిసైక్లింగ్‌ చేసి మంచినీటిని పంట పొలాలకు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు జరుగనున్నాయి. ఇటీవల రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ను ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కలిసి మణుగూరు మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాని కోరారు. ఇప్పటికే కొత్తగా మణుగూరు తహసీల్దార్‌ కార్యాలయంలో రూ. 3 కోట్ల వ్యయంతో మున్సిపాలిటీ కార్యాలయం నిర్మాణం కోసం మణుగూరు అంబేద్కర్‌ సెంటర్‌ వద్ద కొత్తగా ఫ్రూట్‌, ఫ్లవర్‌ మార్కెట్‌ ఏర్పాటు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. పట్టణ ప్రజలకు ఆహ్లాదరకమైన వాతావరణాన్ని అందించేలా కొత్తగా గ్రీన్‌ పార్క్‌లు ఏర్పాటు  చేస్తున్నారు. కొత్తగా 6 ఎకరాల్లో గ్రీన్‌ పార్కు, ఒక ఎకరాలో  స్మృతి వనం, రాశినవం, 5 ఎకరాల్లో గ్రీన్‌ బెల్ట్‌ పార్కు, 1/2 ఎకరాలో నర్సరీ, ఒక ఎకరాలో వైకుంఠధామ నిర్మాణం చేపట్టనున్నారు. ప్రత్యేకంగా 5 వార్డులకు ఒక్క నర్సరీ చొప్పన 4 నర్సరీ ఏర్పాటు చేయనున్నారు. గ్రీన్‌ పార్కులకు, నర్సరీల ఏర్పాటకు, వైకుంఠధామానికి, స్మృతివనం, రాశివనం ఏర్పాటుకు స్థలాలను పరిశీలించినట్లు, కొన్ని పనులు జరుగుతున్నట్లు మున్సిపల్‌ అధికారులు తెలిపారు.

సుందరీకరణ దిశగా..

మున్సిపాలిటీకి అభివృద్ధికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీంతో పలు రకాల అభివృద్ధి పనులను పూర్తయ్యాయి. మరి కొన్ని పనులు చేపట్టనున్నారు. మణుగూరు మున్సిపాలిటీలో 23 వార్డులు ఉండగా.. 2011 జనాభా లెక్కల ప్రకారం 32,065 మంది జనాభా ఉన్నారు. ఇందులో పురుషులు 16169 మంది ఉండగా మహిళలు 15896 మంది ఉన్నారు. ఇప్పటికే మున్సిపాలిటీలోని ప్రతి వీధిలో ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లను పూర్తిగా సీసీరోడ్లుగా మార్చేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అన్ని వార్డుల్లో ఎల్‌ఈడీ స్ట్రీట్‌ లైటింగ్‌ బల్బులు ఏర్పాటయ్యాయి. ప్రధాన రహదారితో పాటు ముఖ్యమైన ప్రాంతాల్లో కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ బ్యూటీఫికేషన్‌ ఆఫ్‌ జంక్షన్‌, మినీ జంక్షన్లు ఏర్పాటు కానున్నాయి. పట్టణంలోని ప్రధాన రహదారిలో రూ.కోటితో కొత్తగా డివైడర్స్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మొత్తం పట్టణంలో 20 ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం పనులు జరుగుతున్నాయి. 

మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి 


మణగూరు మున్సిపాలిటీ అభివృద్ధిపైనే ప్రత్యేక దృష్టి పెట్టాను.  పట్టణంలో మౌలిక వసతుల కల్పనే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం. కొత్తగా డ్రైనేజీ నిర్మాణానికి  ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేశారు. పట్టణంలో పచ్చదనం, పరిశుభ్రతతో వెల్లివిరిసేందుకు పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అవసరమైన నిధులు తీసుకువచ్చి మున్సిపాలిటీని అందమైన, ఆదర్శమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా. అభివృద్ధి విషయంలో అందరి సహకారంతో ముందుకు వెళ్తాన్నాం. 

- రాష్ట్ర ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు