శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - Aug 29, 2020 , 05:24:07

పల్లెపల్లెకూ కొవిడ్‌ పరీక్షల వాహనం

  పల్లెపల్లెకూ కొవిడ్‌ పరీక్షల వాహనం

  • కొవిడ్‌ రోగుల కోసమే జిల్లా ఆసుపత్రి 
  • రూ.60.69 లక్షల హడ్కోసాయంతో రెండు అంబులెన్స్‌లు 
  • u రోగుల సౌకర్యార్థం మొబైల్‌ టెస్టింగ్‌ వాహనం
  • u వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు.. 
  • u కరోనా వేళ రాజకీయాలు చేస్తే ప్రజలు క్షమించరు
  • u అంబులెన్స్‌ ప్రారంభోత్సవంలో మంత్రి పువ్వాడ 
  • u పాల్గొన్న భద్రాద్రి జడ్పీ చైర్మన్‌ కోరం, ఎమ్మెల్యే వనమా 

“కొవిడ్‌ నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.. ప్రభుత్వ ఆసుత్రులను అధునాతన సౌకర్యాలతో తీర్చిదిద్దుతోంది.. కరోనా పరీక్షలు పెంచేందుకు పల్లె పల్లెకూ మొబైల్‌ టెస్టింగ్‌ వాహనాలను  సమకూర్చింది.. పాజిటివ్‌ వచ్చిన వారికి వైద్యం అందించేందుకు జిల్లా ఆసుపత్రిని కొవిడ్‌ వైద్యశాలగా మార్చింది” అని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం భద్రాద్రి జిల్లా ఆసుపత్రిలో హడ్కోసాయంతో రూ. 60.69 లక్షలతో మంజూరైన రెండు అంబులెన్స్‌లను, సంచార కొవిడ్‌ టెస్టింగ్‌ వాహనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అధునాతన టెక్నాలజీతో ఉన్న అంబులెన్స్‌ల సద్వినియోగం చేసుకోవాలన్నారు. తన సొంత జిల్లా కోసం ఎలాంటి కార్యక్రమాలనైనా చేస్తానన్నారు.       -కొత్తగూడెం 

 

కొత్తగూడెం : కొవిడ్‌ రోగుల కోసం రాష్ట్ర సర్కార్‌ ప్రభుత్వ ఆస్పత్రులను అధునాతన టెక్నాలజీతో ఏర్పాటు చేస్తోందని, దూరాభారం లేకుండా ప్రతీ గ్రామానికి కరోనా పరీక్షల వాహనం ఏర్పాటు చేసిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. హడ్కో సహాయంతో రూ.60.69 లక్షలతో మంజూరైన రెండు అంబులెన్స్‌లను, సంచార కొవిడ్‌ టెస్టింగ్‌ వాహనాలను శుక్రవారం జిల్లా ఆస్పత్రిలో ఎమెల్యే వనమా వెంకటేశ్వరరావు, జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్యతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి పువ్వాడ హడ్కో సీఈవోతో మాట్లాడి జిల్లాకు సహాయం చేసినందుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. కొవిడ్‌ రోగుల కోసమే జిల్లా ఆస్పత్రిని కొవిడ్‌ కేర్‌ ఆస్పత్రిగా మార్చామన్నారు. ఇక వైరస్‌కు భయపడే పనిలేదని, పాజిటివ్‌ వచ్చినా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మంచి వైద్యం అందుతుందన్నారు. అత్యవసర సేవల కోసమే అంబులెన్స్‌లను ఏర్పాటు చేశామన్నారు. దూరాభారం లేకుండా ప్రతీ గ్రామానికి టెస్టింగ్‌ చేసే వాహనం వస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌ కొవిడ్‌ నియంత్రణకు అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో అధునాతన టెక్నాలజీతో ఆక్సీజన్‌ బెడ్స్‌ను ఏర్పాటు  చేసి వెంటిలేటర్ల సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారని, భద్రాచలం ఆస్పత్రిలో 150 ఆక్సీజన్‌ బెడ్స్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా కేంద్రంలో నాలుగు వెంటిలేటర్ల సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు. ‘కేసీఆర్‌ కిట్‌'కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. అనంతరం ఆస్పత్రిలో వెంటిలేటర్లను ప్రారంభించి, వరదల్లో ఇండ్లు కోల్పోయిన వారికి చెక్కులు పంపిణీ  చేశారు.

కొవిడ్‌ వేళ రాజకీయాలు చేస్తే ప్రజలు క్షమించరు

కరోనా సమయంలో ప్రతిపక్ష నాయకులు రాజకీయాలు చేస్తున్నారని, వారిని ప్రజలు క్షమించరని మంత్రి పువ్వాడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముసుగు దొంగల్లా వచ్చి వైద్యం చేసే వారిని దుర్భాషలాడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారిని విమర్శించారు. ప్రజలకోసం ప్రభుత్వం పనిచేస్తుంటే ఏమీ చేతకాక చేసేదేమీ లేక కొందరు పనిగట్టుకుని వైద్యులను దూషించడం మంచిది కాదన్నారు. పాజిటివ్‌ కేసుల బారిన పడిన వారికి వైద్యం అందిస్తున్నారంటే నిజంగా వారు దేవుళ్లతో సమానమని, అలాంటి వారిని దూషించడం అవివేకమన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేసే వారు కళ్లున్న కబోధలని అన్నారు. కార్యక్రమంలో భద్రాద్రి కలెక్టర్‌ ఎంవీ రెడ్డి, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌ దిండిగాల రాజేందర్‌, జడ్పీ వైస్‌చైర్మన్‌ కంచర్ల చంద్రశేఖరరావు, అడిషనల్‌ కలెక్టర్లు కర్నాటి వెంకటేశ్వర్లు, అనుదీప్‌, ఆర్డీవో స్వర్ణలత, డీఎంహెచ్‌వో ఎల్‌ భాస్కర్‌నాయక్‌, డీసీహెచ్‌ఎస్‌ ముక్కంటేశ్వరరావు, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సరళ, ఎంపీపీలు బాదావత్‌ శాంతి,విజయలక్ష్మి, టీఆర్‌ఎస్‌ నాయకుడు వనమా రాఘవేంద్రరావు పాల్గొన్నారు.

జిల్లాకు మంత్రిగా పువ్వాడ ఉండటం మన అదృష్టం : ఎమ్మెల్యే వనమా 

మన జిల్లాకు మంత్రిగా పువ్వాడ అజయ్‌కుమార్‌ ఉండటం మన అదృష్టమని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. జిల్లా అభివృద్ధికి అడగకుండానే అన్నీ చేస్తున్నారని, ప్రజల కోసం సేవ చేస్తే ప్రజలు మనల్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటారని తెలిపారు. మంత్రి పువ్వాడ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. కరోనా కష్ట కాలంలో కొత్తగూడెం ప్రజలకోసం చాలా కార్యక్రమాలు చేశానని, వైరస్‌ ఉన్నా ప్రజల ముందుకు ధైర్యంగా వెళ్లడమే తన లక్ష్యమన్నారు. 

 భయపడాల్సిన పనిలేదు : జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య

కరోనాకు ఎవరూ భయపడాల్సిన పనిలేదని జడ్పీ చైర్మన్‌, జిల్లా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ కోరం కనకయ్య  అన్నారు. కరోనా అన్ని వ్యాధుల వంటిదేనని, వైరస్‌ సోకినప్పుడు ఇంటి వద్దనే ఉండి మందులు వాడి, జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని తెలిపారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మన జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారని, కరోనా పరీక్షలకు సంచార వాహనం ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. ఈ వాహనాలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలన్నారు.