బుధవారం 02 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Aug 27, 2020 , 04:33:00

ప్రకృతి వనాలను సుందరంగా తీర్చి దిద్దాలి

ప్రకృతి వనాలను సుందరంగా తీర్చి దిద్దాలి

  • భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి

అశ్వాపురం : గ్రామస్తులకు ఆహ్లాదాన్ని అందించేందుకు నిర్మిస్తున్న పల్లె ప్రకృతి వనాలను సుందరంగా తీర్చి దిద్దాలని కలెక్టర్‌ ఎంవీ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండలంలోని మొండికుంట, మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. తొలుత మొండికుంటలోని డంపింగ్‌యార్డు, శ్మశాన వాటిక, ప్రకృతి వనం నిర్మాణాలను కలెక్టర్‌ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామాల్లోని ప్రకృతి వనాలను ఎంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలన్నారు. పల్లె ప్రకృతి వనంలో ఎటువంటి మొక్కలు నాటాలి, వాకింగ్‌ ట్రాక్‌, పార్కులో ప్రజలు కూర్చోవడానికి బల్లలు ఏర్పాటు చేయాలని సర్పంచ్‌కు సూచించారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరతగతిన పూర్తి చేయాలని సర్పంచ్‌, అధికారులకు సూచించారు. అనంతరం మల్లెలమడుగు గ్రామంలో నిర్మిస్తున్న రైతువేదిక నిర్మాణాన్ని పరిశీలించారు.

రైతువేదిక నిర్మాణం ఆలస్యంపై పంచాయతీరాజ్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రామచంద్రాపురం గ్రామానికి చేరుకొని ఆక్కడి కూరగాయల పంటలను పరిశీలించారు. గోదావరి వరద ప్రభావం వల్ల నష్టపోయిన పంటలను ఆయన పొలాల వద్దకు వెళ్లి పరిశీలించి రైతులతో మాట్లాడారు. నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేస్తామని భరోసా కల్పించారు. పంట నష్టాన్ని నమోదు చేసేందుకు మండల స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.  కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ మధుసూదన్‌రాజు, డీపీఓ రమాకాంత్‌, ఆర్డీఓ స్వర్ణలత, తహసీల్దార్‌ పీవీ రామకృష్ణ, ఎంపీపీ ముత్తినేని సుజాత, జడ్పీటీసీ సూదిరెడ్డి సులక్షణ, సర్పంచ్‌లు మర్రి మల్లారెడ్డి, కోడి కృష్ణవేణి, కాకా అశోక్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ తుక్కాని మధుసూదన్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ మేడవరపు సుధీర్‌, చావా వీరరాఘవులు, ఎంపీటీసీ కమటం నరేశ్‌, బేతం రామకృష్ణ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్‌, నాయకులు సూదిరెడ్డి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.