గురువారం 03 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Aug 24, 2020 , 01:04:20

వ‌ర‌ద న‌ష్టం అంచ‌నాలు సిద్ధం చేయండి

వ‌ర‌ద న‌ష్టం అంచ‌నాలు సిద్ధం చేయండి

  • పంట నష్టాన్ని గుర్తించండి
  • అధికారులకు భద్రాద్రి కలెక్టర్‌ ఎంవీ రెడ్డి ఆదేశాలు

కొత్తగూడెం: గోదావరి వరదల వల్ల జరిగిన నష్టాలపై అంచనాలు తయారు చేయాలని భదాద్రి కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. శనివారం ఇండ్లు, పంటలు, రహదారులు, అంటువ్యాధులు, కరోనా, వీధివ్యాపారుల గుర్తింపు, రుణాలు మంజూరు, మంచినీరు, పారిశుధ్యం, చెరువుకట్టల మరమ్మతులు, బలోపేతం తదితర అంశాలపై మండల, జిల్లా, మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారాన్ని అందిందచేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని చెప్పారు. ఇటీవల కురిసిన వర్షాలకు డ్రైనేజీల్లో వ్యర్థాలు అడ్డుపడి నీరు పారడానికి అవకాశం లేక రహదారులపైకి నీరు చేరిందని, ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని చెప్పారు. వర్షాల వల్ల డ్రైనేజీల్లో నీళ్లు వెళ్లడానికి వ్యర్థాలు అడ్డుపడకుండా మెష్‌ ఏర్పాటు చేయాలన్నారు. వరుసగా రెండు సార్లు గోదావరి వరద ప్రమాద స్థాయిలో ప్రవహించినప్పటికీ ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి ఏర్పాట్లు చేయడం పట్ల అధికారులను అభినందించారు. దోమలు నియంత్రణకు ప్రతి గ్రామ పంచాయతీ ఫాగింగ్‌ యంత్రాన్ని కలిగి ఉండాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన మలేరియా వ్యాధి కేసులపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలన్నారు. రేగళ్ల వైద్యాధికారి టెలీకాన్ఫరెన్స్‌లో హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని డీఆర్వోకు సూచించి అతని పెర్ఫార్మెన్స్‌ నివేదికలు అందించాలన్నారు.

కరోనా వ్యాధి నిర్ధారణ ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ నివేదికల్లో వ్యత్యాసం వస్తుందని, వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యాన, పశువుల నష్టాలపై సమగ్ర నివేదికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న పంటలకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. మరణించిన పశువుల జాబితాను తయారు చేయడంతో పాటు పశువులు అనారోగ్యానికి గురికాకుండా ఆరోగ్య చికిత్సలు నిర్వహించడంతో పాటు చాలా ప్రాంతాల్లో పశువులు మురుగునీరు తాగుతున్నాయని,

  నీటి వినియోగం వల్ల పశువులు వ్యాధులకు గురయ్యే అవకాశం ఉన్నందున నియంత్రణ చర్యలు పాటించాలన్నారు. జాతీయ విపత్తుల ఉత్తర్వులను అనుసరించి పాక్షికంగా, శాశ్వతంగా దెబ్బతిన్న గృహాలకు తక్షణం పరిహారం చెల్లింపు ప్రక్రియను చేపట్టాలన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ నివేదిక ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కాన్ఫరెన్స్‌లో ఐటీడీఏ పీవో గౌతం, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, అనుదీప్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.