శుక్రవారం 04 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Aug 22, 2020 , 02:02:09

మావోయిస్టు పార్టీ గ్రామ కమిటీ సభ్యుల అరెస్ట్‌

మావోయిస్టు పార్టీ గ్రామ కమిటీ సభ్యుల అరెస్ట్‌

కరకగూడెం: మావోయిస్టు పార్టీగ్రామ కమిటీ సభ్యులను శుక్రవారం కరకగూడెం పోలీసులు అరెస్ట్‌ చేశారు. మణుగూరు ఏఎస్పీ శబరీశ్‌ శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలు... పోలీసులను హతమార్చేందుకు మందుపాతర్లు అమర్చుతున్న 12 మంది మావోయిస్టు గ్రామ కమిటీ సభ్యులను ఏడూళ్లబయ్యారం సీఐ దోమల రమేశ్‌, కరకగూడెం ఎస్సై రాజేందర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలు  అరెస్ట్‌ చేశాయి.

మావోయిస్టు పార్టీ గ్రామ కమిటీ సభ్యులైన పొడియం లక్ష్మయ్య, పొడియం అడమయ్య, కొవ్వాసి సురేశ్‌ను కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడు, మొట్లగూడెం అటవీ ప్రాంతంలో సీఐ బృందం అదుపులోకి తీసుకుంది. ఇదే పార్టీకి చెందిన గ్రామ కమిటీ సభ్యులు సోడి లింగయ్య, మొసకి సన్ను, మడకం రాజు, మడివి సాయికిరణ్‌, పొడియం సింగయ్య, పొడియం భీమయ్య, ముసకి రాజు, పొడియం రమేశ్‌, కుంజం శ్రీనును ఎస్సై బృందం అదుపులోకి తీసుకుంది. వీరి నుంచి 14 డిటోనేటర్లు, మూడు టిఫిన్‌ బాక్స్‌లు, తొమ్మది బ్యాటరీలు, 75 మీటర్ల విద్యుత్‌ తీగ స్వాధీనపర్చుకున్నారు.

గత మూడేళ్లుగా మావోయిస్టు పార్టీకి సహాయ సహకారాలు అందిస్తున్నట్లుగా వీరు పోలీసుల విచారణలో చెప్పారు. ఈ 12 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ చెప్పారు.