సోమవారం 23 నవంబర్ 2020
Badradri-kothagudem - Aug 21, 2020 , 00:42:58

ముంపు గ్రామాల్లో స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాలి

ముంపు గ్రామాల్లో స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాలి

  • అధికారులకు భద్రాద్రి కలెక్టర్‌ ఆదేశాలు

కొత్తగూడెం: భద్రాచలం వద్ద గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లాకేంద్రం నుంచి జిల్లా, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. మరో మూడు రోజులు విస్తారంగా వర్షాలు కరురిసే అవకాశం ఉందని, ప్రభుత్వ సేవలకు ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు చేపట్టాలన్నారు. గోదావరి పెరుగుతున్నందున వాగులకు వరద పోటెత్తే అవకాశం ఉందని, ప్రజలు వాగులు దాటే ప్రయత్నాన్ని మాన్పించాలన్నారు. ప్రజలకు సేవలు అందించేందుకు కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఎన్డీఆర్‌ఎఫ్‌, పోలీస్‌ కమాండెంట్‌ సిబ్బంది సేవలు అందుబాటులో ఉన్నాయని, వారిని మన బృందాల్లో భాగస్వాములుగా ఉన్నారన్నారు. ముంపు ప్రాంతాల్లో 100 మంది గజ ఈతగాళ్లు, ఇంజన్‌ బోట్లు, 46 నాటు పడవలు, లైఫ్‌ జాకెట్లు ముంపు ప్రాంతాల్లో అందుబాటులో ఉంచామన్నారు. ప్రజలు పాములు, తేళ్లు కాటుకు గురైతే సమాచారం తెలియగానే వైద్యాధికారులు గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు అందించాలన్నారు. టెలీకాన్ఫరెన్స్‌లో ఐటీడీఏ పీవో గౌతమ్‌, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, అనుదీప్‌, డీపీవో రమాకాంత్‌, డీఎంహెచ్‌వో భాస్కర్‌నాయక్‌, ఇరిగేషన్‌ ఈఈ వెంకటేశ్వర్‌రెడ్డి, సబ్‌ కలెక్టర్‌ స్వర్ణలత పాల్గొన్నారు.

ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి: ఎస్పీ సునీల్‌దత్‌


ముంపు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో పోలీసు అధికారులందరూ బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ ఆదేశించారు. గురువారం ఎస్పీ కార్యాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో పోలీసు అధికారులతో మాట్లాడారు. ముంపు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. గోదావరి నది, కిన్నెరసాని పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు. రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. పెట్రోలింగ్‌, బ్లూకోల్ట్స్‌ వాహనాలు నిరంతరం రోడ్లపై తిరగాలన్నారు. డయల్‌ 100కు వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ఎలాంటి ఆలస్యం చేయకుండా  బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.