సోమవారం 23 నవంబర్ 2020
Badradri-kothagudem - Aug 21, 2020 , 00:09:45

అప్రమత్తంగా ఉండాలి

అప్రమత్తంగా ఉండాలి

  • మున్సిపల్‌ కమిషనర్‌ తీరుపై కలెక్టర్‌ ఆగ్రహం

మణుగూరు రూరల్‌: వరద ప్రమాదాల నివారణకు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వరదనీటి ముంపుకు గురికాకుండా అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే రేగా కాంతారావు, కలెక్టర్‌ ఎంవీ రెడ్డి అన్నారు. గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో వైద్య, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, పోలీసు అధికారులతో నిర్వహించిన అత్యవసర సమావేశంలో వారు మాట్లాడారు. తొలుత తహసీల్దార్‌ విల్సన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటస్వామితో కలెక్టర్‌ మాట్లాడి ముంపు ప్రాంతాల బాధితులకు కల్పించిన భోజన, తాగునీరు, రవాణా విషయాలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీలోని సుందరయ్యనగర్‌, గాంధీనగర్‌, కమలాపురం ప్రాంతాల్లో నీరు ఇండ్లల్లోకి చేరడంపై, బాధితులు పునరావాస కేంద్రాలకు రాకపోవడంపై ఆరా తీశారు.

మున్సిపాలిటీలో సిబ్బంది ఉన్నప్పటికీ రోడ్లపైకి వరద నీరు రావడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.. కాల్వలన్నీ ఎప్పటికప్పుడు చెత్తాచెదారాన్ని శుభ్రం చేయించి ఉంటే ఇలా జరిగేది కాదని మున్సిపల్‌ కమిషనర్‌పై సీరియస్‌ అయ్యారు. నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి శాశ్వత పరిష్కారం చూపే దిశగా నీటిని బయటకు పంపేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. గృహాలు మునగడం వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఆల్పాహారం, భోజన వసతి, తాగునీరు కల్పించాలన్నారు. వారికి మైక్‌ల ద్వారా నచ్చజెప్పి పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు సూచించారు.

అంతకుముందు శ్రీవిద్య డిగ్రీ కళాశాల సమీపంలో నీరు నిలిచిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ విపత్కర సమయంలో ప్రజలు సహకరించాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ అనుదీప్‌, ఏఎస్పీ శబరీశ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ అధికారి బాబులాల్‌ యాదవ్‌, ఆర్డీవో స్వర్ణలత, జడ్పీటీసీ పోశం నర్సింహారావు, ఎంపీపీ, తహసీల్దార్‌, ఎంపీవో, వైద్యాధికారులు, సీఐ షుకూర్‌ తదితరులు పాల్గొన్నారు.

వైద్య సిబ్బంది సేవలు గుర్తించాలి

 ప్రభుత్వం వైద్య సిబ్బందికి అమలు చేసిన విధంగా సింగరేణి తమకు అలవెన్సులు అమలు చేయాలని ఏరియా హాస్పిటల్‌ వైద్య సిబ్బంది డీవైసీఎంఓ మేరికుమారికి వినతిపత్రం అందజేశారు. గురువారం  వైద్య సిబ్బంది మాట్లాడుతూ ఏరియా హాస్పటల్‌లో వార్డులన్ని కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులతో నిండిపోయాయని పనిచేస్తున్న సిబ్బంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పనిచేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం సమాలోచన చేసి గతంలో ఇచ్చిన సర్క్యులర్‌ని సవరించి 15 శాతం అలవెన్సులు,ఇన్సూరెన్స్‌ కల్పించాలని వినతి పత్రంలో కోరారు.