శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - Aug 20, 2020 , 01:51:57

వినాయకుడికే విఘ్నం

వినాయకుడికే విఘ్నం

  • కరోనా ఎఫెక్ట్‌తో అమ్ముడుపోని విగ్రహాలు

మణుగూరు రూరల్‌: వినాయక చవితి ఉత్సవాలపై కరోనా ప్రభావం పడింది. మంటపాలకు పోలీసులు అనుమతికి నిరాకరించడంతో వినాయక విగ్రహాల అమ్మకంపై ప్రభావం పడింది. బిజినెస్‌లేక తయారీదారులు ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే, వినాయక మండపాలు లేక కాలనీలు బోసి పోయే పరిస్థితి వస్తున్నది. మరో మూడురోజుల్లో  విఘ్నాలు నేటికీ తొలిగే పరిస్థితి కనిపించడం లేదు. రోజురోజుకు కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతుండటంతో మరో ఐదు రోజుల్లో వినాయక చవితి జరుగనున్న ఉత్సవాలు జరిగే పరిస్థితి లేదు. ఇప్పటికే భారీ విగ్రహాలు రంగులద్దుకుని విక్రయానికి సిద్ధంగా ఉండాలి. తయారీదారులు ఉత్సవ కమిటీలు ఇచ్చే ఆర్డర్లతో, వారికి నచ్చిన విగ్రహాల తయారీలో బిజీబిజీగా ఉండాల్సిన సమయంలో రద్దీ లేక వెలవెలబోతున్నాయి. కరోనా నేపథ్యంలో  విగ్రహాల కొనుగోలుపై ప్రజలు ఆసక్తి చూపడం లేదు. రూ.కోటికి పైగా వ్యాపారం జరిగే నియోజకవర్గంలోని అన్ని మండలాలకు మణుగూరు కేంద్రంగా ఉంది. మణుగూరు పట్టణం నుంచే నియోజకవర్గంలోని అశ్వాపురం, పినపాక, ఆళ్లపల్లి, కరకగూడెం మండలాలకు కమలాపురం, దుగినేపల్లి, వంటి దూర ప్రాంతాలతో పాటు మణుగూరులోని ప్రతీ పల్లెకూ, చిన్న గ్రామాలకు విగ్రహాలు విక్రయించేవారు. 2019లో ఒక్క మణుగూరు మండలంలో 150కి పైగా చోట్ల విగ్రహాల ఏర్పాటుకు పోలీసులు అనుమతి ఇవ్వగా, వ్యాపారులు సుమారు 900కు పైగా విగ్రహాలు విక్రయించగా ఈ దఫా ఆర్డర్లు లేక చతికిల పడిపోయారు. విగ్రహాల తయారీలో పరోక్షంగా, ప్రత్యక్షంగా 150 మంది ఉపాధి పొందే అవకాశాలున్నప్పటికీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.

సంక్షోభంలో వ్యాపారం


కరోనా ప్రభావంతో మా వ్యాపారం పూర్తిగా ఇబ్బందిగా మారింది.  ఈ ఏడాది మాకు పెట్టుబడి మాత్రమైనా వచ్చే పరిస్థితి లేదు. చవితి దగ్గరపడుతున్నా ఇంతవరకు ఆర్డర్‌ కూడా రాలేదు. కరోనా పరిస్థితిని గుర్తించి ముందుగానే తయారీలను తగ్గించి 4 ఫీట్ల నుంచి 10 ఫీట్ల వరకు విగ్రహాలు తయారు చేసి విక్రయానికి అందుబాటులో ఉంచాం..

-తన్నీరు వెంకన్న, తయారీదారుడు