సోమవారం 30 నవంబర్ 2020
Badradri-kothagudem - Aug 18, 2020 , 00:21:07

గిరిజన వాచకం

గిరిజన వాచకం

  • u స్థానిక భాషలోనే పాఠాలు
  • u భద్రాద్రి జిల్లాలో 209 పాఠశాలలకు కొత్త పుస్తకాలు
  • u ఆదిమ తెగల సంస్కృతికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం
  • u హర్షం వ్యక్తం చేస్తున్న ఆదివాసీలు

ఒకజాతి/తెగ అస్తిత్వాన్ని దెబ్బతీయాలంటే.. వారి భాష, సంస్కృతిని ధ్వంసం చేస్తే చాలు..! అలాంటి ప్రయత్నాలు మనదేశంలో కోకొల్లలుగా జరుగుతున్నా.. కోరి తెచ్చుకున్న తెలంగాణలో మాత్రం ఆదిమభాషకు  ‘అక్షరా’భిషేకం జరుగుతున్నది. ఇన్నాళ్లూ అడవుల్లోనే కాలం వెళ్లదీస్తూ.. తమ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్న ఆదిమవాసుల భాషకు తెలంగాణ ప్రభుత్వం సముచిత గౌరవం ఇస్తున్నది.  గిరి పుత్రుల మాటలను వాచకంగా తయారు చేసి  ప్రాథమిక, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు చేరవేస్తున్నది.  భవిష్యత్‌ తరాలకు వారి సంస్కృతిని కానుకగా అందిస్తున్నది.     

- కొత్తగూడెం ఎడ్యుకేషన్‌


కొత్తగూడెం ఎడ్యుకేషన్‌: చిన్నభాషలు ఎదిగితే.. పెద్ద భాషలకు ప్రమాదం ముంచుకొస్తుందనే వాదన తప్పు అని తెలంగాణ ప్రభుత్వం నిరూపించింది. ఏ జాతి అయినా మాతృభాషను కోల్పోతే.. పూర్తిగా పరాయీకరణ చెంది గుర్తింపును, గౌరవాన్ని కోల్పోతుంది. అలాంటి ప్రమాదం కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏర్పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చిన్నభాషల పరిరక్షణకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నది. గోండులు, చెంచులు, కోయలు, బంజారా, కొలామిల భాషలకు లిపిని అభివృద్ధి చేసి, వారి సంస్కృతీ సంప్రదాయాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నది టీఆర్‌ఎస్‌ సర్కార్‌. ఈ క్రమంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన గిరిజనుల మాతృభాషను ప్రాథమిక పాఠశాలల్లోని గిరిజన విద్యార్థులకు వాచకాల రూపంలో అందించేందుకు సిద్ధమైంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నది. దీంతో పాటు వారిలో అక్షరాస్యతను నింపి, అభివృద్ధి వైపు అడుగులు వేయించే విధంగా గిరిజన గురుకులాలను సైతం ఏర్పాటు చేసింది. 

209 పాఠశాలలకు వాచకాలు

తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం కొలామి వాచకం, కోయ వాచకం, గోండి వాచకం, లంబాడీ వాచకాలను ఈ విద్యా సంవత్సరానికి అందుబాటులోకి తెచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 209 ప్రాథమిక, ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న 1,2 తరగతుల విద్యార్థులకు ఈ వాచకాలు అందనున్నాయి. గిరిజన ఇతివృత్తాల ద్వారా ఆసక్తికర అంశాలను ఎంచుకొని, చిన్నారులకు గిరిజన సంస్కృతి, చరిత్రను తెలియజేసేలా వాచకాలను రూపొందించారు. 1వ తరగతిలో నేర్చుకున్న భాషా నైపుణ్యాలను 1వ పాఠంలో పునశ్చరణ చేసి, మిగిలిన పాఠాలను విద్యార్థి పఠన, లేఖన, శ్రవణ నైపుణ్యాలను పెంపొందించే విధంగా వాచకాలను రూపొందించారు.

ఆదివాసీల్లో హర్షాతిరేకాలు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లంబాడీ, కోయ తెగలకు సంబంధించిన వారు ఎక్కువగా నివసిస్తుంటారు. జిల్లా వ్యాప్తంగా వారి జనాభానే ఎక్కువ. భద్రాచలం, అశ్వారావుపేట, పినపాక నియోజకవర్గాల్లో కోయతెగలకు చెందిన వారు కొత్తగూడెం, ఇల్లెందు నియోజకవర్గాల్లో లంబాడీ తెగలకు చెందిన వారు ఎక్కువశాతం ఉంటారు. గిరిజన కుటుంబాల్లో తాతలు, నానమ్మ లు, అమ్మమ్మలు వారి భాషల్లో వారి చరిత్రకు సంబంధించిన కథ లు చెప్తుండేవారు. తద్వారా చిన్నారులకు భాషపై, వారి సంస్కృతి, సంప్రదాయాలపై చిన్నతనం నుంచే అవగాహన ఉండేది. దేశంలోనే మొదటి సారిగా ఆదివాసీ తెగల భాషల పరిరక్షణ కోసం వాచకాలను వారి మాతృభాషల్లోనే తెలంగాణ సర్కార్‌ ప్రవేశపెట్టింది. గిరిజనుల చరిత్రలను చిన్నారులకు సులభంగా అర్థమయ్యే రీతిలో చిత్రాలు, పదజాలం ద్వారా ఈ వాచకాలను అందించనున్నారు. కొలామి, కోయ, గోండి, లంబాడీ వాచకాల్లోని పాఠాలను ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించేందుకు చివరి పేజీల్లో తెలుగులో పాఠాలు ఉంటాయి. తద్వారా విద్యార్థులు తమ మాతృభాషతో పాటు తెలుగుభాషపై కూడా పట్టు సాధిస్తారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజన భాషాభివృద్ధి వారి సంస్కృతి పరిరక్షణ కోసం రూపొందించిన వాచకాలు గిరిజనుల ఆత్మాభిమానాలను ఇనుమడింపజేసేలా ఉన్నాయి. దీంతో సీఎం కేసీఆర్‌ తీసుకున్న ఈ చర్యల పట్ల గిరిజన లోకం హర్షం వ్యక్తం చేస్తున్నది.

వాచకాలు రావడం శుభపరిణామం 


రాష్ట్రంలో గిరిజన సంక్షేమశాఖ విద్యార్థులకు సరళంగా అర్థమయ్యేలా ప్రధాన తెగల భాషల్లో 1,2 తరగతుల పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి తీసుకురావడం శుభపరిణామం. గిరిజనుల భాషను ప్రాచూర్యంలోకి తేవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. తెలుగుభాషకు సమాంతరంగా మా మాతృభాషల్లో బోధన చేయడం వల్ల రెండు భాషలపై పట్టుసాధిస్తారు. నాగరికతకు దూరంగా ఉన్న గిరిజన తెగలకు మాతృభాషపై ఉన్న పట్టు తెలుగుభాషపై లేదు. ఈ నిర్ణయం శుభపరిణామం. 

- ఇస్లావత్‌ లక్ష్మణ్‌ నాయక్‌, టీఎస్‌టీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు

డ్రాఫ్‌అవుట్స్‌ తగ్గుతాయి 


ప్రాథమిక విద్యలో మాతృభాషలో బోధించడం వల్ల వారి సామాజిక విలువలు పెరుగుతాయి. కోయభాషలో బోధించడం వల్ల ఆదివాసీల్లో డ్రాప్‌అవుట్స్‌ తగ్గుముఖం పడతాయి. విద్యాప్రమాణాలు పెరిగి ఉన్నతవిద్యపై మక్కువ పెరుగుతుంది. వారికి అర్థమయ్యే రీతిలో బోధన ఉండ టం వల్ల భాషపై పట్టు, ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు పరిరక్షింపబడతాయి. దేశవ్యాప్తంగా 8 కోట్ల మంది కొయిత్తూరు భాషను మాట్లాడుతున్నారు. మ భాషపై వాచకాలను రూపొందించిన సర్కార్‌కు కృతజ్ఞతలు.

- వాసం రామకృష్ణ దొర, ఆదివాసీ ఐకాసా రాష్ట్ర కన్వీనర్‌