శనివారం 28 నవంబర్ 2020
Badradri-kothagudem - Aug 18, 2020 , 00:21:07

వరద గోదావరి

వరద గోదావరి

  • భద్రాచలంలో 61 అడుగులు దాటి ప్రవాహం
  • n రామాలయ పరిసర  ప్రాంతాలు జలమయం
  • n ప్రధాన రహదారులపై  నిలిచిన వరద నీరు
  • n సురక్షిత ప్రాంతాలు,  పునరావాస కేంద్రాలకు  ముంపువాసులు
  • n కేంద్రాలను పరిశీలించిన  భద్రాద్రి కలెక్టర్‌ ఎంవీ రెడ్డి 
  • n ‘పినపాక’లోని ముంపు    ప్రాంతాల్లో పర్యటించిన  ప్రభుత్వ విప్‌ రేగా

ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరిలోకి భారీగా  వరద నీరు చేరుతోంది.. భద్రాచలం వద్ద సోమవారం61 అడుగులు దాటి ఉధృతంగా ప్రవహిస్తున్నది.. పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లోకి ఇప్పటికే వరద నీరు చేరుతుండగా అధికారులు అప్రమత్తమై ముంపు వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు.. కేంద్రాలను భద్రాద్రి కలెక్టర్‌ పరిశీలించారు.. వరద బాధితులకు అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు.. మరోవైపు ఎడతెరపిలేని వానలకు వాగులు, వంకలు పొంగి ఏజెన్సీ జల దిగ్బంధమైంది.. జన జీవనం స్తంభించింది.. వరదలో చిక్కుకుపోయిన వారిని అధికారులు ప్రత్యేక పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పినపాక నియోజకవర్గంలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు.         

-భద్రాచలం


భద్రాచలం: ఏజెన్సీలో గోదావరి ఉప్పొంగింది. సోమవారం 61 అడుగులు దాటి ప్రవహించింది. వరద ఉధృతితో ఏజెన్సీ జల దిగ్బంధంలో చిక్కుకున్నది.  ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరడంతో పలుగ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ముంపు ప్రాంతవాసులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. వారికి అందుతున్న సేవలను కలెక్టర్‌ ఎంవీ రెడ్డి పరిశీలించారు. 

61 అడుగులు దాటి ప్రవాహం


గోదావరి వరదలు భద్రాచలం ఏజెన్సీని అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరిక దాటి  ప్రవహిస్తుండగా సోమవారం ఉగ్రరూపం దాల్చింది. ఉదయం 6 గంటలకు 58.10 అడుగులుండగా 7 గంటలకు 58.60, 8 గంటలకు 59.00, 9గంటలకు 59.50, 10 గంటలకు 59.90, 11 గంటలకు 60.20, 12 గంటలకు 60.5, 1 గంటకు 60.7, 2 గంటలకు 61, రాత్రి 8 గంటలకు 61 అడుగులకు చేరింది. రాత్రికి మరింత పెరుగనుందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. 

పలు ప్రాంతాలు జలమయం

భద్రాచల పుణ్యక్షేత్రాన్ని గోదావరి తాకింది. రామాలయం పరిసరాలు సుభాష్‌నగర్‌ కాలనీ, అశోకనగర్‌ కొత్తకాలనీ, ఏఎంసీ కాలనీలు జలమయం అయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. కలెక్టర్‌ ఎంవీ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావు, పార్టీ నాయకుడు మానె రామకృష్ణ తదితరులు పునరవాస కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. దుమ్ముగూడెం మండలంలోని నర్సాపురం, తూరుబాక, రేగుబల్లి, గంగోలు, పర్ణశాల వద్ద ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. పర్ణశాల సబ్‌స్టేషన్‌ నీట మునిగింది. సున్నంబట్టి, కాశీనగరం, పర్ణశాలల ప్రజలను పునరవాస కేంద్రాలకు తరలించారు. చర్ల మండలంలో తాలిపేరు ఉగ్రరూపం దాల్చడంతో మొత్తం గేట్లు 25 ఎత్తి నీటిని దిగువకు విడిచిపెట్టారు. కుదునూరు, దేవరపల్లి, సుబ్బంపేట గుంపెనగూడెం వద్ద ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. గొంపల్లి వద్ద ఈతవాగు పొంగడంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వెంకటాపురం మండలం ఆలుబాక, వీరభద్రవరం, పాత్రాపురం గ్రామాల వద్ద బ్రిడ్జిపైకి వరద నీరు చేరడంతో మండలంలో రాకపోకలు నిలిచిపోయాయి. మరో వైపు ఆంధ్రాలో కలిసిన కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆయా మండలాల్లో ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరడంతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణకు రాకపోకలు నిలిచిపోయాయి.