గురువారం 03 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Aug 17, 2020 , 00:39:54

అనుక్షణం.. అప్రమత్తం

 అనుక్షణం.. అప్రమత్తం

  • సహాయక చర్యల్లో నిర్లక్ష్యం వహించొద్దు
  • అత్యవసరమైతే హెలికాప్టర్‌ పంపిస్తాం 
  • పునరావాస కేంద్రాల్లో బాధితులకు  మంచి ఆహారం అందించాలి
  • గోదావరి వరద సమీక్షలో మంత్రి అజయ్‌
  • ఖమ్మంలో మున్నేరు పరిసర ప్రాంతాల పరిశీలన

గోదావరి వరద సహాయక చర్యల్లో అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని, ముంపు ప్రాంత గ్రామాల్లోని బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్‌కుమార్‌ సూచించారు. భద్రాచలంలోని సబ్‌కలెక్టర్‌ సమావేశ మందిరంలో ఆదివారం ఆయన జిల్లా అధికారులతో గోదావరి వరదలపై సమీక్ష          నిర్వహించారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు మంచి ఆహారం అందజేయాలన్నారు. తొలుత ఖమ్మంలోని మున్నేరు, గోదావరి వరదలను పరిశీలించారు.          పునరావాస కేంద్రాల్లో బాధితులకు అందుతున్న                   సేవలను అడిగి తెలుసుకున్నారు.    


భద్రాచలం/ఖమ్మం : గోదావరి వరదల నేపథ్యంలో అధికారులు, ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని,  అధికారులు తమ విధుల్లో ఎటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా అంకితభావంతో సహాయక చర్యల్లో పాల్గొనాలని రాష్ట్ర రోడ్డు రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. భద్రాచలంలోని సబ్‌కలెక్టరు సమావేశ మందిరంలో ఆయన జిల్లా అధికారులతో గోదావరి వరదలపై సమీక్ష నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతం మొత్తం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుందని, ముంపు ప్రాంతాల ప్రజలను తక్షణం పునరావస కేంద్రాలకు తరలించాలని అన్నారు. అక్కడ బాధితులకు మంచి పౌష్టికాహారం అందజేయాలని, నిధుల కొరత లేదని చెప్పారు. వరదల నుంచి ప్రజలను కాపాడేందుకు అధికారులు చిత్తశుద్ధితో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి లాంచీలు, పడవలులు సిద్ధంగా ఉంచాలని, అలాగే గజ ఈతగాళ్లను కూడా అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. రామాలయం పరిసర ప్రాంతాల్లో చేరిన నీటిని తొలగించేందుకు ప్రస్తుతం ఏర్పాటు చేసిన ఆరు మోటార్లు సరిపోవడం లేదని, అదనంగా మోటార్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రహదారులు మునిగిన ప్రాంతాల్లో బస్సులు నడపొద్దని అన్నారు. అత్యవసరంగా పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించేందుకు ఆర్టీసీ ఉచితంగా సేవలు అందించడానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. వరద సహాయక పుననరావాస కేంద్రాల్లో కొవిడ్‌-19 నిబంధనలు పక్కాగా అమలు చేయాలని, పారిశుధ్య చర్యలను పంచాయతీ అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఆర్డీవో స్వర్ణలతను ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలు చిక్కుకుంటే అత్యవసర పరిస్థితుల్లో హెలికాప్టర్‌ను సైతం పంపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. అలాగే కరోనా, వర్షాల నేపథ్యంలో గ్రామాల్లో జ్వరాలు ప్రబలకుండా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ రేగాకాంతారావు, ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, జిల్లా కలెక్టర్‌ డా.ఎంవిరెడ్డి, పీవో పోత్రు గౌతమ్‌, ఇన్‌చార్జి ఆర్డీవో స్వర్ణలత పాల్గొన్నారు.

ప్రజలు ఆందోళన చెందొద్దు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాల వల్ల ప్రజలకు ఎటువంటి నష్టం కలుగకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ముందస్తు చర్యలు చేపట్టామని, ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. ఖమ్మం నగరంలోని నయాబజార్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని కలెక్టర్‌ కర్ణన్‌తో కలిసి ఆదివారం మంత్రి పరిశీలించారు. ముంపు ప్రాంతాల ప్రజలతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు. వరద ప్రవాహం తగ్గే వరకు అందరూ పునరావాస కేంద్రంలోనే ఉండాలని మంత్రి ప్రజలకు సూచించారు. పునరావాస కేంద్రంలో ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం మున్నేరు బ్రిడ్జి వద్ద వరద ప్రవాహాన్ని కలెక్టర్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. మున్నేరు ప్రక్కన గల బొక్కలగడ్డ, మోతీనగర్‌, జలగంనగర్‌, ముంపు ప్రాంతాల ప్రజల కోసం ఇప్పటికే నగరంలో 3 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, వసతితో కూడిన భోజన సదుపాయాలు, వైద్య సేవలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. మున్నేరు పరివాహాక ప్రాంతంలో రెండు వైపుల కరకట్ట నిర్మాణానికి ప్రభుత్వానికి నివేదిస్తామని మంత్రి పువ్వాడ అన్నారు. వరదల పరిస్థితులపై ప్రజలు ఆందోళన చెందవద్దని మంత్రి అన్నారు. మరో రెండు, మూడు రోజులు ప్రజలు ఎటువంటి ప్రయాణాలు చేయవద్దని, లోతట్టు ప్రాంతా లు వరదలు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దన్నారు. వరద కాలువలు పొంగే ప్రాంతాలకు ప్రస్తుతం ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం వద్దని ఆర్టీసీ అధికారులను మంత్రి ఆదేశించారు.