మంగళవారం 24 నవంబర్ 2020
Badradri-kothagudem - Aug 16, 2020 , 00:27:57

తెలంగాణ దేశానికే ఆదర్శం

తెలంగాణ దేశానికే ఆదర్శం

  • సీతారామతో జిల్లా సస్యశ్యామలం
  • అన్ని రంగాల్లో అభివృద్ధి పరుగులు
  • ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు

  • కలెక్టరేట్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
కొత్తగూడెం : అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం   దేశానికే ఆదర్శమని ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు అన్నారు.  శనివారం కొత్తగూడెంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కొత్తగూడెం కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పంట మార్పిడి విధానాన్ని అమలు చేస్తుందని అన్నారు. అధిక దిగుబడులు సాధించి రైతులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. వ్యవసాయ రంగంలో మెళకువలు తెలుసుకునేందుకు 23 మండల కేంద్రాలతో పాటు 44 వ్యవసాయ క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణాలు చేపట్టామన్నారు. జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు 13 వేల 58 కోట్లతో సీతారామ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు.  జిల్లాకు 6443 ఇండ్లు మంజూరు కాగా 6063 ఇండ్లకు పరిపాలన అనుమతులు లభించాయన్నారు. 4743 ఇండ్ల నిర్మాణాలకు టెండర్‌ ప్రక్రియ పూర్తి చేశామని, 2922 ఇండ్లు నిర్మాణ దశలోనూ, 1821 ఇండ్లు నిర్మాణం పూర్తయ్యాయని, ఎంపిక చేసిన 609 మంది నిరుపేదలకు ఇండ్లు కేటాయించినట్లు వివరించారు.  1.47 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా హరితహారంలో మొక్కలు నాటుతున్నామన్నారు. నాబార్డు నిధులు రూ.31.59 కోట్లతో 11 వంతెనలు నిర్మించామని, డీఎంఎస్‌ నిధులు రూ.101.29 కోట్లతో 1427 పనులు చేపట్టగా 396 పనులు పూర్తయ్యాయన్నారు. రూ.23.41 కోట్లతో 30 రహదారులకు తారు వేసే పనులు చేపట్టగా అవి పురోగతిలో ఉన్నాయన్నారు. రూ.5.30 కోట్లతో రెండు మినీ స్టేడియం నిర్మాణాలు చేపట్టగా ఒకటి పూర్తయిందని తెలిపారు. రూ.14.74 కోట్లతో చేపట్టిన 67 రైతు వేదికల నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని, రూ.4 కోట్ల సీఎస్‌ఆర్‌ నిధులతో చేపట్టిన 50 అంగన్‌వాడీల భవనాలు నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లోని వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు, ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నామని చెప్పారు. 
పట్టణాల అభివృద్ధిలో ప్రధాన సమస్యగా ఉన్న కుక్కలు, పందులు, కోతుల బెడద నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. లాక్‌డౌన్‌ సడలింపు తరువాత వ్యాధి వ్యాప్తి జరుగుతున్నందున ప్రజలు సుదూర ప్రాంతాలకు చికిత్సకు వెళ్లకుండా జిల్లాలోని చికిత్స నిర్వహిస్తున్నామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ర్యాపిడ్‌ కిట్స్‌ ద్వారా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ వ్యాధి సోకిన వ్యక్తులను హోం క్వారంటైన్‌లో ఉంచి చికిత్స చేస్తున్నట్లు వివరించారు. అనంతరం విప్‌ రేగా కాంతారావు కలెక్టరేట్‌లో ఈ -ఆఫీస్‌ విధానాన్ని ప్రారంభించారు. సత్వర సేవలందించేందుకు ప్రభుత్వం అన్ని కార్యాలయాల్లో ఈ -ఆఫీస్‌ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియా నాయక్‌, కలెక్టర్‌ ఎంవీ రెడ్డి, ఎస్పీ సునీల్‌దత్‌, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, అనుదీప్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దిండిగాల రాజేందర్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు సీతాలక్ష్మి, వెంకటేశ్వర్లు, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ చంద్రశేఖర్‌రావు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ దామోదర్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.