మంగళవారం 01 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Aug 13, 2020 , 02:35:47

జ‌ల‌మ్ము నిశ్చ‌య‌మ్మురా...

జ‌ల‌మ్ము నిశ్చ‌య‌మ్మురా...

  • ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు
  • జలాశయాలు, ప్రాజెక్టులకు జలకళ
  • భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చిన్న, మధ్యతరహా నీటి ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. ఇక వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా.. చెరువులు మత్తడి దుంకుతూ కళకళలాడుతున్నాయి. ఆయా ప్రాజెక్టులు, రిజర్వాయర్ల పరిధిలోని ఆయకట్టు సాగుకు ఈసారి ఎలాంటి ఢోకా లేదు. ఇప్పటికే భూమికి పచ్చని రంగు వేసినట్లు పొలాలు జీవకళను సంతరించుకున్నాయి. నీరు పుష్కలంగా ఉండటంతో అన్నదాతలు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు.   

  నమస్తే నెట్‌వర్క్‌


భద్రాద్రి రాముడి చెంత ‘గోదారి’ పరవళ్లు తొక్కుతుండగా.. వన్నె చిన్నెల ‘కిన్నెరసాని’ వరద పైటేసి.. వస్తోంది. ‘తాలిపేరు’ తుళ్లిపడుతూ కిందకు పరవళ్లు తొక్కుతున్నది. కృష్ణమ్మ నీటికి ‘పాలేరు’ పరివశించిపోతుండగా.. వర్షపు నీటికి ‘వైరా’ ఉరకలు వేస్తున్నది. అన్నదాతల ‘సాగు ఆకలి’ తీర్చేందుకు ప్రాణధార పుష్కలంగా రావడంతో.. పంట పొలాలు జీవకళను సంతరించుకున్నాయి.


- నమస్తే నెట్‌వర్క్‌

నిండుకుండలా వైరా రిజర్వాయర్‌

సాగర్‌ నీరు, ఎగువన కురుస్తున్న వానలకు ఈ రిజర్వాయర్‌ జలకళను సంతరించుకున్నది.  ఈ నెల5వ తేదీన పూర్తిస్థాయిలో నిండి 18.05 అడుగులకు నీటిమట్టం చేరింది. దీంతో ఆ సమయంలో రిజర్వాయర్‌ అలుగుల ద్వారా వరదనీరు వైరా నదిలోకి ప్రవహించింది. అయితే కుడి, ఎడమ కాల్వల్లో ప్రతిరోజు సాగునీరు ప్రవహిస్తుండటంతో బుధవారం సాయంత్రానికి నీటిమట్టం 18.01కు తగ్గింది. 


పూర్తిస్థాయి నీటిమట్టం

18.05 అడుగులు

ప్రస్తుత నీటిమట్టం : 18.01

ఆయకట్టు పరిధి

అధికారికంగా 17,500 ఎకరాలు 

 (అనధికారికంగా 25వేల ఎకరాలు)

తాలిపేరు తుళ్లింత..


 పూర్తిస్థాయి నీటిమట్టం : 74 మీటర్లు

ప్రస్తుత నీటిమట్టం : 72 మీటర్లు

ఆయకట్టు పరిధి : 25వేల ఎకరాలు

 చర్ల రూరల్‌ మండంలోని తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువన ఉన్న అటవీప్రాంత వాగువంకల నుంచి నీరు వస్తుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులోకి 17,952 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో 7గేట్లు 5 అడుగుల మేర ఎత్తారు. వరినాట్ల నిమిత్తం 100 క్యూసెక్కుల నీరు ఎడమకాలువకి సరఫరా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కింద ఇప్పటివరకు 15 వేల ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయి. 

పెదవాగు పరవళ్లు..
ప్రాజెక్ట్‌ పేరు : పెదవాగు ప్రాజెక్టు
పూర్తిస్థాయి నీటిమట్టం : 21 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం : 21 అడుగులు 
ఆయకట్టు పరిధి : 16వేల ఎకరాలు 
(తెలంగాణ 4వేలు, ఏపీ 12 వేలు)
అశ్వారావుపేట మండలంలోని ఉన్న ఈ ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయిలో నిండడంతో.. 5,240 క్యూసెక్కుల వరదనీటిని కిందికి విడుదల చేస్తున్నారు. భారీగా కురుస్తున్న వర్షాలకు వాగుల పొంగడంతో ఈ ప్రాజెక్టులోకి వరదనీరు చేరింది. కుడి, ఎడమ కాల్వల ద్వారా తెలంగాణ ప్రాంతంలో 4వేల ఎకరాలు, ఆంధ్రప్రదేశ్‌లో 12వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు.
బేతుపల్లి కల్పతరువు
ప్రాజెక్ట్‌ పేరు : బేతుపల్లి పెద్దచెరువు  
పూర్తిస్థాయి నీటిమట్టం : 16 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం : 15.6 అడుగులు
ఆయకట్టు పరిధి : 10వేల ఎకరాలు
 పూర్తి వర్షాధారంతో ఈ చెరువు నిండుతుంది.  20 రోజుల క్రితం బేతుపల్లి ప్రత్యామ్నాయ కాలువకు నీటిని విడుదల చేయగా సత్తుపల్లి, వేంసూరు మండలాల్లోని 54 చెరువులకు సాగునీరు అందుతున్నది. ప్రస్తుతం ప్రత్యామ్నాయ కాలువ ద్వారా 350 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. 
 లంకసాగర్‌ 
పూర్తిస్థాయి నీటిమట్టం : 16.4 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం : 15.8 అడుగులు
ఆయకట్టు పరిధి : 8వేల ఎకరాలు
పెనుబల్లి మండలంలోని లంకాసాగర్‌ ప్రాజెక్టు ప్రస్తుతం నిండుకుండలా ఉన్నది. లంకపల్లి, ఏరుగట్ల, శ్రీనివాసపురం, మండాలపాడు, చౌడవరం గ్రామ ప్రాంతాల నుంచి వరద నీరు ఈ ప్రాజెక్టులోకి వస్తుంది. రెండు రోజుల్లోనే అలుగుపడే అవకాశం కనిపిస్తున్నది.
పాలేరు పరవశం 
పాలేరు రిజర్వాయర్‌

పూర్తిస్థాయి నీటిమట్టం :
23 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం
22.6 అడుగులు
ఆయకట్టు పరిధి : 
3,91,000 ఎకరాలు
 ఎగువన కురిసిన వర్షాలకు తోడు.. కృష్ణానది నీరు పాలేరుకు వస్తుంది. సాగర్‌ డ్యాం నుంచి ఎడమ కాలువకు విడుదలవుతున్న నీరు 3500 క్యూసెక్కులు. ప్రస్తుత ఇన్‌ఫ్లో 1650 క్యూసెక్కులు, అవుట్‌ ఫ్లో 2000వేల క్యూసెక్కులు. ఇందులో పాలేరు పాత కాలువకు 200 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. 
కిన్నెరసాని వచ్చిందమ్మా.. 
ప్రాజెక్టు పేరు : కిన్నెరసాని
పూర్తిస్థాయి నీటిమట్టం : 407 అడుగులు 
(8.4 టీఎంసీలు)
ప్రస్తుత నీటిమట్టం : 405 అడుగులు 
(7.85 టీఎంసీలు)
ఆయకట్టు పరిధి : 10వేల ఎకరాలు
 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, కొత్తగూడెం, బూర్గంపాడు మండలాల్లోని 10వే ల ఎకరాలకు కిన్నెరసాని ద్వారా నీరందుతుంది. కిన్నెరసానికి రెండు కాలువలు ఉన్నాయి. ఎడమ కాలువ ద్వార 7వేల ఎకరాలు, ఎడమ కాలువ ద్వార 3వేల ఎకరాలకు నీరందుతుంది.