బుధవారం 21 అక్టోబర్ 2020
Badradri-kothagudem - Aug 12, 2020 , 02:41:04

ర్యాపిడ్‌ స్పీడ్‌

ర్యాపిడ్‌ స్పీడ్‌

రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో నిర్ధారణ కేంద్రాలను జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కొవిడ్‌ పరీక్షలను గ్రామస్థాయికి విస్తరించింది. ఇందుకోసం తక్కువ వ్యవధిలో ఫలితాలనందించే యాంటీజెన్‌ కిట్లను పీహెచ్‌సీ, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లకు పంపిణీ చేసింది. ఈ క్రమంలో నిర్ధారణ పరీక్షలు చేసేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ మెడికల్‌ ఆఫీసర్లకు, కిందిస్థాయి సిబ్బందికి ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. ర్యాపిడ్‌ టెస్టులతో 30 నిమిషాల్లోనే నిర్ధారణ ఫలితాలు వెలువడుతున్నాయి. గత నెల 14న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ లాంఛనంగా ర్యాపిడ్‌ కిట్లను ప్రారంభించారు. గత నెల 27వ తేదీన ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న 26 పీహెచ్‌సీలు, 4 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లకు వైద్యారోగ్యశాఖ ఈ కిట్లను పంపిణీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 40 కేంద్రాల్లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాకు 11,196 యాంటీజెన్‌ కిట్లు వచ్చాయి. వీటిలో 3,262 మందికి పరీక్షలు చేయగా 972 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 2,291 మందికి నెగిటివ్‌ వచ్చింది. ఇప్పటి వరకు 3,014 మంది ఐసొలేషన్‌లో చికిత్సలు పొంది ఇంటికి చేరుకున్నారు. మరో 1,188 మంది హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. జిల్లాలోని 29 పీహెచ్‌సీలో, 6 సీహెచ్‌సీలు, 5 యూపీహెచ్‌సీలు, జిల్లా ఏరియా ఆస్పత్రి, రెండు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రుల్లో పరీక్షలు చేస్తున్నారు. 

సత్వరమే వైద్యం..

గతంలో కొవిడ్‌ లక్షణాలు కనబడితే పల్లె ప్రాంతం నుంచి పట్టణానికి తమ సొంత వాహనాల పైనో, లేదా 108 ద్వారానో జిల్లా కేంద్రంలోని పెద్దాసుపత్రికి వచ్చే వారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొవిడ్‌ పరీక్షలు విస్తృతం చేయడంతో బాధితులకు సత్వర వైద్యం అందుతున్నది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులై తీవ్ర రక్తస్రావం జరిగిన వారికి, గర్భిణులకు సాధారణ కాన్పు చేయాలన్నా, శస్త్రచికిత్స చేయాలన్నా ఈ కిట్ల ద్వారా కొవిడ్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా జ్వర పీడితుల సర్వే చేపట్టిన అధికారులు జ్వరాలకు మందులు పంపిణీ చేస్తున్నారు. దీంతోపాటు కరోనా బారిన పడిన రోగులకు ఇంటి వద్దకే వైద్యం అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లావ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 1,011 మందికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3,262  మందికి ర్యాపిడ్‌ కిట్ల ద్వారా కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

బాధితులకు మనోధైర్యం..

     కరోనా బారిన పడిన బాధితులకు వైద్య సిబ్బంది తామున్నామంటూ మనోధైర్యాన్నిస్తున్నారు. ప్రతీ రోజు రోగి ఇంటికి వెళ్లి వారి యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు. ఏ రోజు ఏ మందులు వేసుకుంటున్నారు.. ఎలాంటి ఆహార నియమాలు తీసుకుంటున్నారు.. పరిశుభ్రత ఎలా పాటిస్తున్నారనే దానిపై స్థానిక వైద్య సిబ్బంది తోడుగా నిలుస్తున్నారు. 

అత్యవసర కేసులకు ర్యాపిడ్‌ కిట్లు 

జిల్లావ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీల్లోనూ అత్యవసర కేసులకు ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్లను విధిగా ఉపయో గిస్తున్నాం. పీహెచ్‌సీల చుట్టూ పక్కల గ్రామాల్లో ప్రజలకు కొవిడ్‌ లక్షణాలు, దాని వ్యాప్తి నివారణాంశాలపై మా సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. కొవిడ్‌ నియంత్రణ కోసం ఆహర్నిశలు శ్రమిస్తున్నాం. ఈ కిట్‌ ద్వారా కరోనా ఉందో లేదో తెలుసుకుని తగు జాగ్రత్తలతో శస్త్రచికిత్సలు అవసరమున్న వారికి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి 108 వాహనం ద్వారా తరలిస్తున్నాం.-డాక్టర్‌ బి.మాలతి, ఖమ్మం జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి


logo