మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Badradri-kothagudem - Aug 11, 2020 , 03:27:29

ప్రత్యేక రహదారిని ఏర్పాటు చేయాలి

ప్రత్యేక రహదారిని ఏర్పాటు చేయాలి

  • పాల్వంచలో ప్రత్యేక కొవిడ్‌ చికిత్సకు 
  • వార్డులు ఏర్పాటు చేయాలి
  • జిల్లా ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్‌ ఎంవీ రెడ్డి

కొత్తగూడెం : కొత్తగూడెం జిల్లా ఆస్పత్రిలో కరోనా చికిత్సలు నిర్వహిస్తున్న వార్డులకు వెళ్లేందుకు ప్రత్యేక రహదారిని ఏర్పాటు చేయాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాధారణ వార్డు, ఆస్పత్రి పరిసరాలు, ప్రసూతి కేంద్రం, కరోనా వ్యాధి చికిత్సలు నిర్వహిస్తున్న వార్డులను ఆయన పరిశీలించారు. ఆస్పత్రిలో కరోనా వ్యాధి చికిత్సలు నిర్వహిస్తున్న వార్డు పక్కనే ప్రసూతి వార్డు ఉండటం వల్ల చిన్నారులకు, తల్లులకు కూడా అంత మంచిది కాదని, అందువల్ల ప్రత్యేకంగా పాల్వంచలో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగూడెం ఆస్పత్రికి లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ మంజూరు చేసినందున ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు ఆస్పత్రి పరిసరాల్లో స్థలాన్ని పరిశీలించి సమగ్ర నివేదికలు అందజేయాలని చెప్పారు. డిప్యూటేషన్‌పై వచ్చిన సిబ్బంది కొవిడ్‌ వార్డులో విధులకు గైర్హాజరవుతున్నట్లు కలెక్టర్‌ గుర్తించారు. వీరిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆస్పత్రిలో కావాల్సిన మౌలిక వసతులు సౌకర్యాలు, సిబ్బంది నియామకంపై నివేదికలు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మి, అదనపు కలెక్టర్‌ కే.వెంకటేశ్వర్లు, ఆస్పత్రుల సమన్వయ అధికారి ముక్కంటేశ్వర్‌రావు, పర్యవేక్షకులు సరళ, డీఎంహెచ్‌వో భాస్కర్‌ నాయక్‌, ఆర్‌ఎంవో రవిబాబు నాయక్‌, ఆర్డీవో స్వర్ణలత పాల్గొన్నారు.


logo