మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Badradri-kothagudem - Aug 11, 2020 , 03:13:55

నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి

నేడు శ్రీకృష్ణ  జన్మాష్టమి

‘కృష్ణం వందే జగద్గురుమ్‌...’ సమస్త జగత్తుకు గురుస్థానంలో దిశానిర్దేశం చేసే ద్వాపర యుగావతార పురుషుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. భగవాన్‌ శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఎంతో విభిన్నమైనది శ్రీకృష్ణావతారం. ఆయన పుట్టిన గడియలు మొదలుకొని అవతార పరిసమాప్తి వరకు అడుగడుగునా లీలామృతం పరవళ్లు తొక్కుతుంది. భగవద్గీతను బోధించి మానవ జీవిత పరమార్థాన్ని చాటిచెప్పిన గోపాలకృష్ణుడి జన్మాష్టమి నేడే.  

- కొత్తగూడెం టౌన్‌/ఇల్లెందు రూరల్‌

శ్రావణమాసంలో కృష్ణపక్ష అష్టమితిథి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణ పరమాత్ముడే దేవకి వసుదేవుడికి జన్మించాడు. ఈ రోజున భక్తకోటి రకరకాల మిఠాయిలను ఆవునెయ్యితో తయారు చేసి కృష్ణుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. యశోద నందనుల పర్యవేక్షణలో పెరిగిన ‘నందగోపాలుడు’ అనే పేరు కూడా ఉంది. ‘ఓం.. నమో నారాయణః’ అనే మంత్రంలోనూ ఎనిమిది అక్షరాలు ఉన్నాయి. దశావతరా ల్లో కృష్ణావతారం ఎనిమిదవది. కృష్ణావతారానికి ఎనిమిది సంఖ్యతో అనుబంధాన్ని గుర్తించవచ్చు. 

అర్ధరాత్రి వేళ అభిషేకం

శ్రీకృష్ణుడు అర్ధరాత్రి సమయంలో జన్మించాడు. దీంతో ఆలయాల్లో అర్ధరాత్రి వేళ కృష్ణుడి విగ్రహమూర్తులకు ఆవుపాలతో క్షీరాభిషేకం చేస్తుంటారు. భక్తిభావంతో దేవుని నామస్మరణల నడుమ స్వామివారికి అభిషేకాలు చేస్తారు. గోకులాష్టమి కృష్ణుడి పుట్టినరోజు.. నల్లనయ్య నవ్వులు చిందించిన రోజు. ఈ పండుగను పిల్లాజల్లా అందరూ ఎంతో ఆనందంగా కొవిడ్‌ నిబంధనలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని ఎవరి ఇంట్లో వారు పూజలు చేసేందుకు భక్తులు సిద్ధమయ్యారు.

పండుగ విధానం..

కృష్ణాష్టమి రోజున పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజిస్తారు. పళ్లు, సొంటి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యంగా పెడతారు. అందులో శ్రీకృష్ణుడి విగ్రహాలను పడుకోబెట్టి ఊపుతూ రకరకాల జోలపాటలు, కీర్తనలు పాడుతారు. పురవీధుల్లో ఎత్తుగా ఉట్టికట్టి వా టిని అందుకోవడానికి యువకులు పోటీ పడతారు. అందుకే ఈ పండుగను ‘ఉట్ల పండుగ’ అని పిలుస్తారు. నేడు కృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరిస్తే సకల సంపదలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. సాక్షాత్తు బ్రహ్మదేవుడే తన మానస పుత్రుడైన నారద మహర్షికి కృష్ణాష్టమి వ్రత విధానాన్ని చెప్పినట్లు పురాణ విధి. 

ఇదీ.. వ్రత విధానం

శ్రీకృష్ణుడు ఇంట్లోకి రావాలని కోరుతూ ఇంటి ఎదుట బియ్యం పిండి, లేదా ముగ్గుతో గోపాలుడి పాదముద్రలు వేసుకోవాలి. చిన్నికృష్ణుడి ప్రతిమలను శుభ్రం చేసుకొని చందనం, కుంకుమలతో తిలకం దిద్దాలి. పంచామృతాలతో నందసూక్తులు, విష్ణు స్తోత్రాలతో పూజలు చేయాలి. ఉపవాస దీక్షలు చేయాలి. సాయంకాలం కృష్ణుడిని ఉయ్యాలలో ఉంచి పాటలు, పద్యాలు, స్తోత్రాలతో పూజించాలి. పాలు, వెన్న, పండ్లు, అటుకులు నైవేద్యంగా సమర్పించి ఉట్టికొట్టే వేడుకలు నిర్వహించాలి. భాగవతాన్ని పటించాలి, దానధర్మాలు చేయాలి. 

ఆలయాలు ముస్తాబు

శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా శ్రీకృష్ణుని ఆలయాలు అందంగా ముస్తాబయ్యా యి. భక్తులు ఆలయాలకు నూతనంగా రంగులు వేయడంతోపాటు విద్యుత్తు దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీకృష్ణాష్టమిని ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


logo