గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Aug 10, 2020 , 00:33:49

బీటీపీఎస్‌ యూనిట్‌-2 సీవోడీకి సిద్ధం

బీటీపీఎస్‌ యూనిట్‌-2  సీవోడీకి సిద్ధం

  • ఈ నెలలోనే విద్యుత్‌ ఉత్పత్తి  జరిగేలా చర్యలు
  • అహర్నిశలూ  శ్రమిస్తున్న ఇంజినీర్లు
  • పనులను  పర్యవేక్షిస్తున్న అధికారులు 

మణుగూరు: రాష్ట్ర ప్రభుత్వం మణుగూరు-పినపాక సరిహద్దు ప్రాంతంలో నిర్మిస్తున్న 1080(4x270) మెగావాట్ల సామర్థ్యం గల భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం(బీటీపీఎస్‌)లో యూనిట్‌-2ను సీవోడీకి సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ యూనిట్‌లో జెన్‌కో, భెల్‌ అధికారులు సమష్టి కృషితో సింక్రనైజేషన్‌ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. ఇక సీవోడీ ప్రక్రియను పూర్తి చేసి విద్యుత్‌ ఉత్పత్తి చేయనున్నారు. ఇందుకు అవసరమైన పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ నెలలో యూనిట్‌-2లో సీవోడీ చేసి విద్యుత్‌ ఉత్పత్తిని గ్రీడ్‌కు అనుసంధానం చేయనున్నట్లు జెన్‌కో అధికారులు తెలిపారు. ఈ యూనిట్‌లో 270 మోగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అయ్యేలా ట్రయల్న్‌ నిర్వహించి, విద్యుత్‌ ఉత్పత్తి స్టేబుల్‌ కాగానే అధికారికంగా సీవోడీ చేయనున్నారు. ఇప్పటికే సమష్టి కృషితో యూనిట్‌-1ను పూర్తి చేసి విద్యుత్‌ ఉత్పత్తిని ప్రాంభించారు. ఇదే స్ఫూర్తితో రెండో యూనిట్‌ను సీవోడీకి సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర అవసరాలకు బీటీపీఎస్‌ రెండో యూనిట్‌ నుంచి త్వరలోనే విద్యుత్‌ను వినియోగించనున్నారు. సుమారు 1,179 ఎకరాల్లో 1,080 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్‌ ప్లాంట్‌ను రూ.10వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇక్కడ జెన్‌కో, భెల్‌ తరఫున సుమారు 200 మంది ఇంజినీర్లు పని చేస్తూ రక్షణ చర్యలకు ప్రాధాన్యమిస్తూ నిరంతరం పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ పనులను జెన్‌కో డైరెక్టర్‌(సివిల్‌) ఎ.అంజయ్‌, డైరెక్టర్‌(ఆపరేషన్‌) ఎం. సచ్చితానందం పర్యవేక్షణలో బీటీపీఎస్‌ చీఫ్‌ ఇంజినీర్‌ పిల్లి బాలరాజు ఆధ్వర్యంలో పనులు వేగవంతంగా నిర్వహిస్తున్నారు.

సీవోడీకి ఏర్పాట్లు చేస్తున్నాం


భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం(బీటీపీఎస్‌) యూనిట్‌-2ను సీవోడీకి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ నెల 15వ తేదీ తర్వాత ట్రయల్న్‌ ప్రక్రియలో భాగంగా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తాం. పని ప్రదేశంలో రక్షణ చర్యలకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ నిరంతరం పనులను పర్యవేక్షిస్తున్నాం. అనుకున్న సమయానికి పవర్‌ ప్లాంట్‌ మిగతా యూనిట్లు పూర్తి చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాం. పనులు శరవేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం.

-పిల్లి బాలరాజు,  బీటీపీఎస్‌ చీఫ్‌ ఇంజినీర్‌