సోమవారం 28 సెప్టెంబర్ 2020
Badradri-kothagudem - Aug 09, 2020 , 03:45:49

అపురూపం.. ఆదివాసీల సంప్రదాయం

అపురూపం.. ఆదివాసీల సంప్రదాయం

  • తర తరాలుగా  కొండకోనల్లో నివాసం
  • ఈ దేశానికే మూలవాసులు
  • నేడు సామాజిక చైతన్యం వైపు అడుగులు
  • ఆదివాసీలను అక్కున చేర్చుకుంటున్న  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం
  • నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

చుట్టూ దట్టమైన అరణ్యం.. కొండకోనల మధ్య ఆవాసం.. విలువైన సంప్రదాయాలు కట్టుబాట్లతో జీవనం.. విలక్షణమైన ఆహార్యం..     అడవి తల్లి నీడలో తర తరాల పయనం.. వారే అభం శుభం ఎరుగని ఆదివాసీలు. వారే ఈ దేశానికి మూలవాసులు. తమ సంస్కృతిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ భవిష్యత్‌పై కోటి ఆశలతో మనుగడ సాగిస్తున్నారు. సామాజిక చైతన్యం వైపు అడుగులు వేస్తున్నారు. వేషభాషల్లో మార్పులు వస్తున్నా.. సంప్రదాయాలకే ప్రాధాన్యమిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్‌ అడవి బిడ్డల ప్రగతికి పెద్దపీట వేయడంతో అభివృద్ధి బాట పడుతున్నారు. అక్షరాలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్న ఆదివాసీలకు మాతృభాషలో బోధన జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నారు. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీలపై   ‘నమస్తే తెలంగాణ’  అందిస్తున్న ప్రత్యేక కథనం.  

 -భద్రాచలం


 భద్రాచలం : పచ్చని ప్రకృతి ఒడిలో అడవి తల్లినే నమ్ముకొని తర తరాలుగా జీవనం సాగిస్తున్న అడవి బిడ్డలు ఆదివాసీలు. ప్రపంచ వ్యాప్తంగా 370 మిలియన్ల ఆదివాసీలు ఉండగా వారు 90 దేశాల్లో నివసిస్తున్నారు. ప్రపంచ జనాభాలో ఐదు శాతం ఆదివాసీలు ఏడువేల భాషల్లో మాట్లాడుతున్నారు. ఐదువేల భిన్న సంస్కృతులు వీరివి. భారత రాజ్యాంగం ప్రకారం మన దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 8.6 శాతం ఆదివాసీలున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌ తదితర రాష్ర్టాల్లో కొన్ని ప్రాంతాలు 5వ షెడ్యుల్‌ ఏరియాలో చేర్చారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు సమీప ఆంధ్రప్రదేశ్‌తో కలిపి 12 లక్షలకు పైగానే ఆదివాసీలు నివసిస్తున్నారు. ఆదిమ జాతులైన గోండు, కొలాం, తోటి, ప్రధాన్‌, నాయకపోడు, కోయ, మన్నెవారు, చెంచు, గుట్టకోయ, కొండరెడ్లు తదితర ఆదివాసీ తెగలు మొత్తం 23 వరకు ఈ రెండు రాష్ర్టాల్లో జీవనం సాగిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో నివసిస్తూ తమ సంస్కృతి సంప్రదాయాలు కొనసాగిస్తున్నారు. మరికొందరు మైదాన ప్రాంతాల్లో సైతం నివసిస్తున్నారు.

బాహ్య ప్రపంచానికి దూరంగా..

బాహ్య ప్రపంచానికి దూరంగా అడవి బిడ్డలు తమ మనుగడ సాగిస్తున్నారు. వీరికి అడవి అంటే ప్రాణం. కొండకోనల మధ్య ఆవాసం అటవీ ఉత్పత్తులను సేకరించడంతో పాటు వ్యవసాయమే వృత్తిగా చేసుకొని వరి, జొన్న, మొక్కజొన్న, పత్తి, పొగాకు తదితర పంటలు సాగుచేస్తున్నారు. ప్రధానంగా వరి, జొన్న ఎక్కువగా పండించి వాటిని తమ ఆహారంగా తీసుకుంటున్నారు. అంతేకాకుండా వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు పండించుకొని ఆహారానికి వినియోగిస్తున్నారు. మరో వైపు జిగురు, ఇప్పపువ్వు, చింతపండు, వివిధ రకాల అటవీ పండ్లను సేకరించి సంతలకు తీసుకొచ్చి వాటిని విక్రయించి తమకు కావాల్సిన వస్తువులను వస్తుమార్పిడి విధానం ద్వారా దక్కించుకుంటారు. గిరిజన సంప్రదాయం అపురూపం. వారి వేషభాషలు, కట్టుబాట్లు అపురూపంగా ఉంటాయి. స్థానికంగా దొరికే ఆభరణాలను ధరిస్తారు. ఆసక్తి గొలిపే వస్త్ర ధారణగావిస్తారు. ప్రత్యేక ఆహారపు అలవాట్లు ఉంటాయి. విలక్షణమైన ఆహార్యం వీరి సొంతం. పుట్టుక, మరణం తదితర సమయాల్లో తమ సంప్రదాయాలను కచ్చితంగా పాటిస్తారు. పండుగ, ఉత్సవాల సమయంలో తర తరాలుగా వస్తున్న ఆచారాలను కొనసాగిస్తారు. పంటలు వేసేటప్పుడు, కోసేటప్పుడు ప్రత్యేక శైలిలో భూమిపూజలు పిల్లలు, పెద్దలు ఆనందోత్సహాలతో గడుపుతారు. 

నాటికి నేటికి ఆదివాసీల్లో సామాజిక చైతన్యం పెరిగింది. వేషభాషల్లో మార్పులొస్తున్నాయి. ఆధునికం వైపు ఆదివాసీలు అడుగులు వేస్తున్నారు. ఆదివాసీల అభివృద్ధికి ఐటీడీఏలు నెలకొల్పబడ్డాయి. వీటి ద్వారా ఆదివాసీల ప్రగతికి కృషి జరుగుతోంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ గిరిజన ప్రగతికి పెద్దపీట వేస్తున్నారు. భద్రాచలం ఐటీడీఏ నాలుగు జిల్లాల పరిధిలో 32 మండలాల్లో విస్తరించగా ఈ మండలాల్లో కోయజాతి 22.30 లక్షలు, కొండరెడ్లు 1300 మంది ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధిక గిరిజన జనాభా ఉంది. భద్రాచలం ఐటీడీఏ ద్వారా గిరిజన సంక్షేమానికి ప్రత్యేక కృషి జరుగుతోంది. విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాలతో పాటు ఇతరత్రా రంగాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. కేజీ నుంచి పీజీ వరకు గిరిబిడ్డల కోసం విద్యాలయాలు నెలకొల్పబడ్డాయి. మారుమూల అటవీ పల్లెల్లో విద్య సౌకర్యాలు కల్పించడంతో గిరిబిడ్డలు అక్షరం వైపు అడుగులు వేస్తున్నారు. వీరికి ఐటీడీఏ ద్వారా ప్రత్యేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. గిరిబిడ్డలకు విద్యాలయాలు, హాస్టళ్లలో సన్నబియ్యంతో భోజనం, చికెన్‌, మటన్‌, గుడ్లు తదితర వాటితో పౌష్టికాహారం అందిస్తున్నారు. స్కాలర్‌షిప్‌లు మంజూరు చేస్తున్నారు. విదేశాల్లో కూడా చదువుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తోంది. వీరిలో దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికి తీసేందుకు క్రీడల్లోనూ పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందుతోంది. గిరిజనులు వ్యవసాయపరంగా అభివృద్ధి చెందేందుకు సబ్సిడీపై రుణాలు, యంత్రాలను ఐటీడీఏ అందజేస్తోంది. గిరిజన రైతాంగానికి పెద్దఎత్తున పోడు భూములకు పట్టాలిచ్చారు. వైద్య సౌకర్యాలు మెరుగుపరచడంతో గిరిజనుల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. అలాగే ఐటీడీఏ ద్వారా గిరిజన ప్రభుత్వ పాఠశాలల్లో కోయ, బంజారా భాషలను ప్రాథమికస్థాయిలో ప్రవేశపెట్టారు. మాతృభాషలో బోధన జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని భద్రాద్రి కలెక్టర్‌ డా.ఎంవీరెడ్డి, ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్‌ గిరిజనులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను కాపాడుకుంటూ గిరిజనులకోసం పోరాడిన మహనీయులను స్మరించుకుంటూ వేడుకను జరుపుకోవాలని కలెక్టర్‌, పీవోలు సూచించారు. కరోనానేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. 

logo