శనివారం 26 సెప్టెంబర్ 2020
Badradri-kothagudem - Aug 08, 2020 , 02:04:08

దిల్‌దార్ స‌ఫాయివాలా

దిల్‌దార్ స‌ఫాయివాలా

  •  u నిరంతరాయంగా సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికులు
  • u ‘కరోనా’ సమయంలోనూ సడలని ధైర్యం
  • u కార్మికుల సేవలను గుర్తించి అభినందిస్తున్న ప్రజలు

కోడికూత కంటే ముందుగానే లేచి అర్ధరాత్రి దాటేదాక సేవలందిస్తున్నారు సఫాయిలు.. తిన్న కంచం కడగటానికి బద్దకిస్తున్న మనం కాల్వల్లో వేస్తున్న చెత్తా చెదారాన్ని ఎంతో శ్రద్ధగా తీస్తూ వాటిని శుభ్రం చేస్తున్నారు. కరోనా అంటేనే భయపడి కాలు బయటపెట్టడానికి భయపడుతున్న సమయంలో వైరస్‌కు ఎదురొడ్డి కాలనీలను శుభ్రం చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. వీధులన్నింటిలో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావాణం పిచికారీ చేస్తూ నిరంతరం సేవలందిస్తున్నారు. దోమలు, ఈగలు వ్యాప్తి చెందకుండా కాలనీల్లో బ్లీచింగ్‌ చల్లుతూ మన ఆరోగ్య రక్షణకు కృషి చేస్తున్నారు.

-కొత్తగూడెం అర్బన్‌  


పారిశుధ్య కార్మికులు ప్రతిరోజు రోడ్లు ఊడ్చడం, కాలువల్లోని వ్యర్థాలు, చెత్తాచెదారాన్ని తీపి డంపింగ్‌యార్డులకు తీసుకెళ్లడం, వార్డులు, గ్రామాల్లో బ్లీచింగ్‌ చల్లడం వారి నిత్యకృత్యం. కానీ కరోనా వైరస్‌ వ్యాప్తితో వారిపై పనిభారం పెరిగింది. అయినా విధులు నిర్వహించడానికి మాత్రం పారిశుధ్య సిబ్బంది వెనుకాడటం లేదు. ఇలాంటి సమయంలోనే సేవలందించాలనే కృతనిశ్చయంతో వారు కంకణబద్ధులై పనిచేస్తున్నారు.జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలైన కొత్తగూడెంలో 175మంది,  పాల్వంచలో 150మంది, ఇల్లెందులో 94, మణుగూరులో 60మందికి పైగా, గ్రామపంచాయతీల్లో 500మందికి ఒక పారిశుధ్య కార్మికుడు విధులు నిర్వహిస్తున్నాడు.

‘కరోనా’లోనూ సడలని ధైర్యం      

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ భయపడుతూ జాగ్రత్తలు పాటిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం కూడా కొన్ని శాఖల ఉద్యోగులను ఇంటి వద్ద నుంచి విధులు నిర్వహించాలని  సూచించింది. కానీ పారిశుధ్య కార్మికులు మాత్రం   క్షేత్రస్థాయిలో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. వార్డులు, గ్రామాల్లో వైరస్‌ సోకిన వ్యక్తి ఇంటిని, వార్డులో పూర్తిగా సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లుతూ తమ విధులు సక్రమంగా నిర్వహిస్తూ అందరి అభిమానం పొందుతున్నారు.  

కార్మికుల సేవలను గుర్తిస్తున్న ప్రజలు 

పారిశుధ్య కార్మికులపై గతంలో ప్రజల్లో ఉన్న అపోహ ఇప్పుడు తొలగిపోయిందనే చెప్పాలి. కరోనా కాలంలో వారు చేస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించి వారి పట్ల సానుకూల దృక్పథం అలవర్చుకొని సలామ్‌ కొడుతున్నారు. ఈ కష్టకాలంలో కూడా వారు చేస్తున్న సేవలకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు వారి సేవలను గుర్తిస్తూ అభినందిస్తున్నారు. మున్సిపాలిటీలు, మండలాల్లోని ప్రజాప్రతినిధులు వారికి ఆహార పొట్లాలు అందించడం, కొత్తబట్టలు పెట్టడం, పాదాలు కూడా కడిగిన సంఘటనలు ఉన్నాయి.

ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే..


ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ప్రతిరోజు మేము మా పనిని చేస్తున్నాం. 16 ఏళ్లుగా మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాను. గతంలో ఇలాంటి సందర్భాలు ఎదురుకాలేదు. కరోనా నుంచి ప్రజలు అనేక విషయాలను నేర్చుకున్నారు. ఎవరికి వారు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటున్నారు. 

-బాబురావు, పారిశుధ్య కార్మికుడు, పాల్వంచ

మా పట్ల మంచి అభిప్రాయం వచ్చింది 


గతంలో పారిశుధ్య కార్మికుడంటే కొంచెం చిన్నచూపు ఉండేది. కానీ కరోనా కాలంలో మేము చేస్తున్న పనులను అందరూ గుర్తించారు. మా కష్టాన్ని గుర్తించి మాపై గౌరవం చూపుతున్నారు. పారిశుధ్య పనులతో పాటు కరోనా వల్ల ఎక్కడ వ్యాధి సోకిన వ్యక్తి ఉంటే అక్కడికి వెళ్లి పనులు చేస్తున్నాం. 

-రాములు, పారిశుధ్య కార్మికుడు, పాల్వంచlogo