బుధవారం 30 సెప్టెంబర్ 2020
Badradri-kothagudem - Aug 05, 2020 , 23:13:00

పులకించిన దక్షిణ అయోధ్య

పులకించిన దక్షిణ అయోధ్య

అల అయోధ్యాపురి రాముని కోవెలను తన ఎదపై మోసేందుకు సిద్ధమైంది.. రామ మందిర నిర్మాణానికి అంకుర్పారణ చేసింది.. భరత ఖండాన్ని భక్తిపారవశ్యంలో ముంచెత్తింది.. దక్షిణ అయోధ్యాపురి అయిన భద్రగిరిని పులకింపజేసింది.. ఈ అరుదైన  సమయాన శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం ‘రామ నామ స్మరణ’తో మార్మోగింది.. బుధవారం అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు..సంప్రదాయ బద్ధంగా అగ్ని హోమం నిర్వహించారు.. భద్రాద్రి వాసులను ఈ అపురూప ఘట్టం ఆకట్టుకుంది..! -భద్రాచలం

భద్రాచలం: భద్రాచలం శ్రీరాముడి సన్నిధిలో శ్రీరామనామ స్మరణలు మార్మోగాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ సీతారామచంద్రస్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన నేపథ్యంలో అర్చకస్వాములు ఈ పూజలు నిర్వహించారు. తొలుత శ్రీ సీతారామచంద్రస్వామికి గర్భగుడి ముఖ ద్వారం వద్ద నిత్య కల్యాణం నిర్వహించారు. అనంతరం బేడా మండపం వద్దకు చేరుకొని తొలుత విశ్వక్సేన ఆరాధన, పుణ్యహావచనం గావించారు. ఈ సందర్భంగా అగ్ని హోమాన్ని నిర్వహించారు. శ్రీరామయణ హవనం, శ్రీరామతారకోపనిషత్తు జరిపారు. చివరగా స్వామివారికి భక్తిశ్రద్ధలతో సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. దేవస్థానం స్థానాచార్యులు స్థలశాయి, ప్రధాన అర్చుకులు సీతారామానుజాచార్యులు, ముఖ్య అర్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యులు, శ్రీమన్నారాయణాచార్యులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. కాగా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి బుధవారం భూమిపూజ జరిగిన నేపథ్యంలో దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం పట్టణంలో కూడా పండుగ వాతావరణం కన్పించింది. భద్రాచలం పుణ్యక్షేత్ర వాసులు కూడా పులకించిపోయారు. భూమిపూజ, శంకుస్థాపన ఘట్టాలను టీవీల్లో వీక్షించారు. అయోధ్యరాముడు భద్రగిరిలోనూ నడయాడడం, ఈప్రాంతం పునీతం కావడం వంటి విశేషాలను ఇక్కడి ప్రజలు మరోసారి గుర్తుతెచ్చుకున్నారు.  


logo