గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Aug 05, 2020 , 01:37:33

యాజమాన్య పద్ధతులతో అధిక లాభం

యాజమాన్య పద్ధతులతో అధిక లాభం

సారపాక : రైతులు సాగులో భాగంగా వానకాలం పంటలో వరినాట్లు వేసే విధానం, ప్రధాన పొలం తయారీ, మొక్కల సాంద్రత, కలుపు తదితర యాజమాన్య పద్ధతులపై వ్యవసాయశాఖ సారపాక మండల అధికారి పలు సూచనలు చేశారు.

వరినాటే విధానం..

వరిపొలాల్లో నాటడానికి ముందు పశువుల ఎరువు, కంపోస్టు, కోళ్ల ఎరువు వంటి సేంద్రీయ ఎరువులను, రసాయనిక ఎరువులతో కలిసి వాడినట్లయితే భూసారం పెరగడమే కాకుండా సుమారు 20-25శాతం నత్రజని ఆదాచేయవచ్చు. జింకు ధాతులోపం ఉన్న పొలంలో ఆఖరి దమ్ములో ఎకరాకు 20కిలోల జింకు సల్ఫేట్‌ను 200 నుంచి 250 కిలోల పశువుల పేడ లేదా వర్మీకంపోస్టుతో కలిసి 20 నుంచి 30 రోజుల పాటు గోనెసంచిలో ఉంచి మగ్గనిచ్చి ఆ తర్వాత చివరి దుక్కిలో వేయాలి.

ప్రధాన పొలం తయారీ...

 నాట్లు వేయడానికి 15రోజుల ముందు నుంచే పొలాన్ని దమ్ము చేయడం ప్రారంభించి 2-3 దఫాలుగా మురగదమ్ము చేయాలి. 

 పొలమంతా సమానంగా చెక్క లేదా జంబుతో గానీ, ట్రాక్టరుకున్న లెవర్తోగానీ చదును చేయాలి. 

 బాగా మురగడంతో కలుపు తగ్గి పిలకలు తొడిగి మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. 

  4 నుంచి 5 ఆకులున్న నారును నాటుకోవాలి. 

 చౌడున్న పొలాల్లో లేతనారు నాటవద్దు.

మొక్కల సాంద్రత...

 భూసారం, కాలాన్నిబట్టి చదరపు మీటరకు కుదుళ్ల సంఖ్య మారుతుంది. 

  నాటిన తరువాత ప్రతి రెండు మీటర్లకు 20 సెంటీమీటర్లు కాలిబాటలు తీయడం వల్ల పైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతి కొంత అదుపు చేయవచ్చు. 

 దీర్ఘ, మధ్యకాలిక రకాలకు చదరపు మీటరుకు 33 కుదుళ్లు ఉండేటట్లు                  చూసుకోవాలి. 

 బాగా ముదురు నారు ఆలస్యంగా నాటినప్పుడు కుదుళ్ల సంఖ్యను పెంచి, కుదురుకు 6 నుంచి 8 మొక్కల చొప్పున                  నాటువేయాలి. 

 ముదురు నారు నాటినప్పుడు నత్రజని ఎరువును సిఫార్సు కంటే 25శాతం పెంచి మూడు దఫాలుగా కాకుండా రెండు దఫాలుగా అంటే 70శాతం నాటే సమయంలో మిగిలిన 30శాతం అంకురం దశలో వాడాలి.

కలుపు యాజమాన్య పద్ధతులు

 నాటిన 3-5 రోజుల లోపు ఎకరానికి బ్యూటాక్లోర్‌ 1-1.5లీటర్లు లేదా ప్రైటిలాక్లోర్‌ 500-600 మిల్లీలీటర్లు లేదా ఆక్సాడయార్జిల్‌ 35-40 గ్రాములు లేదా బెన్‌ సల్ఫ్యూరాన్‌ మిథైల్‌(0.6)+ప్రైటిలాక్లోర్‌(6.0)4 కిలోల గుళికలు, పైరాజోసల్ఫ్యూరాన్‌ ఈథైల్‌+ప్రైటిలాక్లోర్‌ గుళికలు చల్లాలి.

  8-10 రోజులలోపు పైరాజోలఫ్యూరాన్‌ ఈథైల్‌ 80-100గ్రాములు 20 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవాలి. 

 15-20 రోజులకు ఎకరాకు సైహలోషాప్‌ ఫిబ్యూటైల్‌ 250-300 మిల్లీలీటర్లు లేదా ఫినాక్టిప్రాప్‌పి ఈథైల్‌ 250మిల్లీలీటర్లు లేదా మెట్‌సల్ఫ్యూరాన్‌+మిథైల్‌ క్లోరిమ్యూరాన్‌ ఇథైల్‌ అనే మందును 8గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 

 వెడల్పు కలుపు నివారణకు 25-30 రోజులకు 2,4-డి సోడియం సాల్ట్‌ అనే మందు ఎకరాకు 500-600 గ్రాములు లేదా 2.4-డి, ఇ, ఇ,1.25-1.50 లీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 

 గడ్డి జాతి, వెడల్పాకు కలుపు నివారణకు బిస్‌పైరిబాక్‌ సోడియాన్ని ఎకరాకు 100 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి 15 నుంచి 20 రోజుల మధ్య పిచికారీ చేయాలి.