శనివారం 26 సెప్టెంబర్ 2020
Badradri-kothagudem - Aug 05, 2020 , 01:32:15

నేటి నుంచి వ్యాయామశాలలు ఓపెన్‌

నేటి నుంచి వ్యాయామశాలలు ఓపెన్‌

మయూరిసెంటర్‌/ కొత్తగూడెం అర్బన్‌:  ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి వ్యాయామం తప్పనిసరి. శరీర సౌష్ఠవానికే కాకుండా సంపూర్ణ ఆరోగ్యం కోసం కూడా జిమ్‌కు వెళ్తుంటారు నగర వాసులు, పట్టణ వాసులు. అలాగే మానసిక ప్రశాంతత కోసం, దీర్ఘకాలిక రుగ్మతల నుంచి బయడ పడడం కోసం, నిత్య జీవితంలో ఒత్తిడిని జయించడం కోసం యోగా కూడా చేస్తుంటారు. దీంతో జిమ్‌ సెంటర్లకు, యోగా కేంద్రాలకు జనం తాకిడి పెరిగింది. ఈ సమయంలోనే కరోనా వైరస్‌ వెలుగు చూసింది. దానిని నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకున్న మొట్టమొదటి చర్య.. లాక్‌డౌన్‌. ఇందులో భాగంగా మార్చి 22న జనతా కర్ఫ్యూ, ఆ తరువాత మొదలైన లాక్‌డౌన్‌ నుంచి మొదలుకొని నుంచి విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, జిమ్‌లు కూడా మూతపడ్డాయి. ఇలా జరిగి ఈ నెల 4వ తేదీ నాటికి అంటే సరిగ్గా 136 రోజులు. దీంతో గత నెల 29న కేంద్ర ప్రభుత్వం కొన్ని షరతులతో ప్రైవేట్‌ జిమ్‌లు, యోగా కేంద్రాల పునః ప్రారంభానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో బుధవారం నుంచి అవి తెరుచుకోనున్నాయి. 

ఖమ్మం జిల్లాలో సుమారు 60, కొత్తగూడెం జిల్లాలో సుమారు 30 జిమ్‌ సెంటర్లున్నాయి. భద్రాద్రి జిల్లాలో 20 యోగా కేంద్రాలు కూడా ఉన్నాయి. గత నెల 29న అన్‌లాక్‌ 3.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో కొన్ని పరిమితులు, నిబంధనలు పాటిస్తూ జిమ్‌లు, యోగా కేంద్రాలను తెరుచుకోవాల్సి ఉంటుంది. కరోనా లక్షణాలు లేని వారినే జిమ్‌లలోకి అనుమతించేలా, అక్కడ కూడా ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటించేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. జిమ్‌లో ఎక్కువగా వినియోగించే పరికరాలను నిత్యం శానిటైజ్‌ చేయాలని, జిమ్‌లలో ఆక్సిమీటర్లను అందుబాటులో ఉంచాలని సూచించింది. అలాగే 65 సంవత్సరాలు దాటిన వారు, గర్భిణులు, 10 ఏళ్లలోపు పిల్లలకు అనుమతి లేదు. 

ఇప్పుడు యోగా ఎంతో ఆవశ్యకం

కరోనా పాజిటివ్‌ వచ్చినవారు ఎంతో భయాందోళనకు గురవుతున్నారు. కానీ ఈ సమయంలో మనసును ఆదుపులో ఉంచుకోవాలి. ఒత్తిడికి గురి కావొద్దు. ఇం దుకు యోగా ఎంతో అవసరం. యోగా చేయడం ద్వారా మానసిక ప్రశాంతత ఎక్కువగా లభిస్తుంది. శరీరమంతా తేలికవుతుంది. 

-పోలె మనస్విని, యోగా శిక్షకురాలు, కొత్తగూడెం 

ప్రభుత్వ సూచనలు పాటిస్తాం 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలతో జిమ్‌ కేంద్రాన్ని తెరు స్తాం. కొవిడ్‌ నిబంధనలను పా టిస్తాం. కరోనా వైరస్‌ నియంత్ర ణ కోసం 136 రోజుల పాటు జిమ్‌ కేంద్రాలు మూతపడ్డాయి. కొవిడ్‌ నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకుప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం సరైనదే. సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేస్తుంటాం.    - ఎన్‌. రాము, జిమ్‌ కోచ్‌, ఖమ్మం


logo