మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Badradri-kothagudem - Aug 05, 2020 , 01:25:58

మధుమేహం అవగాహనే అభయం

మధుమేహం అవగాహనే అభయం

ఇప్పుడు ఏ నోట విన్నా కరోనా ముచ్చట్లే.. ఎక్కడ చూసినా వైరస్‌ గురించే చర్చ.. కేసులు పెరుగుతున్నకొద్దీ ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి.. అవగాహన లేమితో దీర్ఘకాలిక వ్యాధి బాధితులు ఆందోళనకు గురవుతున్నారు.. ముఖ్యంగా డయాబెటిస్‌ ఉన్న వారు ఎక్కువగా చింతిస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు.. ‘వైరస్‌' ముప్పు తప్పాలంటే అవగాహన తప్పనిసరి అని సూచిస్తున్నారు..  వ్యాధిపై పూర్తి అవగాహన ఉంటే అపోహలను తిప్పి కొట్టొచ్చు.. వదంతులు మనకు హాని చేయకుండా చూసుకోవచ్చు.. ఈ నేపథ్యంలో ‘డయాబెటిస్‌' బాధితులకు భరోసా కల్పిస్తూ                                             

మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్‌ వెల్లిటస్‌ అని వ్యవహరిస్తారు. మధుమేహం అంటే మనిషి రక్తంలో చక్కెరస్థాయి ఎక్కువగా ఉండడం. అంటే అనియంత్రిత స్థితిలో ఉండడం. ఇది వ్యాధి కాదు.. శరీరంలో ఇన్సులిన్‌ తగ్గడం వల్ల ఏర్పడే అసమానత. సాధారణంగా ఒక లీటరు రక్తంలో గ్లూకోజ్‌ 100 మిల్లీ గ్రాములు ఉండాలి. దానికంటే ఎక్కువగా ఉంటే మధుమేహం ఉన్నట్లు భావించాలి. సాధారణంగా పరిగడపున రక్త, మూత్ర పరీక్షలు చేసి గ్లూకోజ్‌ స్థాయి తెలుసుకుంటారు. మధుమేహంలో ప్రధానంగా టైప్‌-1 మధుమేహం, టైప్‌-2 మధుమేహం, ఔస్టేషనల్‌ మధుమేహం అనే మూడు రకాలుంటాయి.  

ఆహారపు అలవాట్లలో మార్పులు రావాలి

వ్యాధులను అదుపు చేయాలంటే ఆహార అలవాట్లను మార్చుకోవాలి. మంచి కూరగాయలు, ఆకు కూరలను ప్రతి రోజూ డైట్‌లో ఉంచుకోవాలి. అప్పుడే ఎలాంటి వ్యాధులూ దరిచేరవు. మంచి ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో దానికి అనుగుణంగా వ్యాయామం కూడా అంతే ముఖ్యం. ఉదయం, సాయంత్రం రెండు పూటలా గంట సేపు వ్యాయామం చేయాలి. వారానికి ఒకసారి కొవ్వు పదార్థం తక్కువ ఉన్న మాంసాహారాన్ని తక్కువ మోతాదులో తినొచ్చు. -దైవశిరోమని, హోం సైన్స్‌ సైంటిస్టు 

వ్యాధి ఏదైనా నియంత్రణ మార్గమే శ్రేయస్కరమంటున్నారు వైద్యులు. ప్రస్తుత తరుణంలో వయసుతో నిమిత్తం లేకుండా వ్యాధులు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. చిన్న వయస్సుల దగ్గర నుంచి పెద్ద వయస్కుల వరకు బీపీ, షుగర్‌ వస్తున్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు రావడం, ఫాస్ట్‌ ఫుడ్స్‌ తీసుకోవడం వల్ల శరీరానికి సక్రమమైన ఆహారం అందడంలేదు. దీంతో వ్యాధులన్నీ దరిచేరుతున్నాయి. పరిమిత ఆహరం ఎంతో ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నా జనం పెడచెవిన పెడుతున్నారు. దీంతో డయాబెటిస్‌ రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. మంచి ఆహారం, వ్యాయామం లేకపోతే వ్యాధులు తప్పవని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల కరోనా వైరస్‌ వచ్చి ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చేసింది. ఇలాంటి సమయంలోనైనా జాగ్రత్తలు తీసుకుని ఆహార నియమాలను పాటిస్తే ఎలాంటి రోగాలూ దరిచేరవంటున్నారు వైద్యనిపుణులు. ప్రస్తుతం డయాబెటిస్‌ కూడా తీవ్రరూపం దాల్చుతున్న తరుణంలో నియమాలు గురించి తెలుసుకుందాం..

మధుమేహం లక్షణాలు..

 శరీరంలో చక్కెర మోతాదు పెరిగిపోయినప్పుడు కిడ్నీల ద్వారా దానిని బయటకు పంపే ప్రయత్నం చేస్తుంది. దాని వల్ల తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది.  ఎక్కువసార్లు మూత్ర వసిర్జన చేయాల్సి రావడంతో శరీరం ఎండిపోయి చర్మం పొడిబారిపోతుంది. దురదలు వస్తాయి. రక్తంలో చక్కెర నిల్వలు ఎక్కువగా ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. బ్యాక్టీరియా లాంటి సూక్ష్మక్రిములు పెరుగుతాయి. అంటువ్యాధులకు ఆస్కారం ఏర్పడుతుంది. 
తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు..
కాకరకాయలు, నేరేడుపండు, మెంతులు, దంపుడు బియ్యం, ముడి బియ్యం, ఆకుకూరలు, క్యారెట్‌ లాంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల వ్యాధి తీవ్రత తగ్గుతుంది. మామిడి పండు, ద్రాక్ష, సీతాఫలం, సపోటా, అరటిపండు, కిస్‌మిస్‌, ఖర్జూరం, ఆలుగడ్డ, పాలిష్‌ చేసిన బియ్యం తీసుకోకూడదు. 
మధుమేహ నియంత్రణకు సూత్రాలు..
 బరువును అదుపులో ఉంచుకోవాలి. ఊబకాయం ఉన్న మధుమేహ వ్యాధిగ్రస్తులు బరువును ఎప్పటికప్పుడు చూసుకోవాలి. టైప్‌-2 బాధితుల్లో అధిక బరువు ఉండడం అత్యంత ప్రమాదకరం. కఠినమైన ఆహార నియమాలు, క్రమం తప్పని వ్యాయామం, ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి. 
  చురుకైన జీవనశైలి అలవాటు చేసుకోవాలి. బద్ధకంగా ఉంటే అది ఇంకా పెరుగుతుంది. రోజూ అరగంట వ్యాయామం చేస్తే మధుమేహం వల్ల సంభవించే ప్రమాదాలను నియంత్రించుకోవచ్చు. 
  మానసిక ఆందోళన, ఒత్తిడి తగ్గించుకోవాలి. మానసిక ఆందోళన, ఒత్తిడి వల్ల రక్తంలో చక్కెర స్థాయి విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి సమయం దొరికినప్పుడల్లా శ్వాస సంబంధ వ్యాయామం చేయాలి. తద్వారా ఆందోళనను, ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. 
  ఫాస్ట్‌పుడ్‌ నిరోధించాలి. మధుమేహం ఉన్న వాళ్లు ఫాస్ట్‌ఫుడ్‌ తీసుకుంటే వారిలో ఇన్సులిన్‌ ప్రభావం తగ్గిపోతుంది. మధుమేహం నియంత్రించాలన్నా, నివారించాలన్నా తక్కువ పిండి పదార్థాలు గల ఆహారం తీసుకోవాలి. 
  టైప్‌-1 
క్లోమ గ్రంథిలో బీటాకణాలు నశించడం వల్ల ఇన్సులిన్‌ స్రవించకపోవడం వల్ల ఈ రకం మధుమేహం వస్తుంది. సాధారణంగా జన్యు కారణాల వల్ల అంటువ్యాధుల వల్ల టైప్‌ 1 మధుమేహం వస్తుంది. ఆకలి విపరీతంగా వేయడం, ఉన్నట్టుండి బరువు తగ్గిపోవడం, బలహీనత, చిరాకు, వాంతులు, వికారం లాంటి లక్షణాలు ఈ రకం మధుమేహంలో కనిపిస్తాయి. 
 టైప్‌-2 
శరీరం సరైన స్థితిలో ఇన్సులిన్‌ను వినియోగించుకోలేనప్పుడు టైప్‌-2 మధుమేహం వస్తుంది. ఈ రకం మధుమేహం వయసు పైబడటం, ఊబకాయం, శారీరక శ్రమలేని జీవన విధానం మొదలైన వాటి వల్ల వస్తుంది. చూపు తగ్గిపోవడం, కాళ్లు తిమ్మిర్లుగా, మొద్దుబారినట్లుగా అనిపించడం, కాళ్ల మీద గాయం అయినప్పుడు త్వరగా మానకపోవడం, చర్మం మీద దురదలు అనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి. 
 ఔస్టేషనల్‌ మధుమేహం..
హర్మోన్లలో సంభవించే తేడాల వల్ల గర్భధారణ సమయంలో కొంతమందిలో వస్తుంది. ప్రసవానంతరం తగ్గిపోతుంది. అయితే ఇలా గర్భధారణ సమయంలో మధుమేహం వచ్చిన వారిలో సగానికి సగం మందిలో తరువాత వయస్సులో టైప్‌-2 మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు ఆహార, వ్యాయామాల విషయంలో శ్రద్ధ వహించాలి. 


logo