ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - Aug 04, 2020 , 07:55:45

పల్లెల్లో ప్రకృతి వనాలు

పల్లెల్లో ప్రకృతి వనాలు

  • స్థలాలు సేకరిస్తున్న అధికారులు
  • వచ్చే నెల 15 నాటికి పూర్తి

కొత్తగూడెం: పార్క్‌లు అనగానే పట్టణాలు, నగరాలు గుర్తొస్తాయి. ఇక నుంచి పల్లెల్లోనూ పార్క్‌లు (ప్రకృతి వనాలు) అతి త్వరలో ఏర్పాటవనున్నాయి. ఇందుకోసం భద్రాద్రి జిల్లాలోని అన్ని పంచాయతీలకు ప్రభుత్వం స్థలాలను కేటాయిస్తున్నది. ఇప్పటికే కొన్ని పల్లెల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి మండల ప్రత్యేకాధికారులు శ్రీకారం చుట్టారు. దీనిని జిల్లా పంచాయతీ అధికారి పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో ప్రకృతి వనం ఏర్పాటు పనులను ములకలపల్లి మండలం సీతారాంపురం పంచాయతీలో మొక్క నాటడం ద్వారా జిల్లా కోఆపరేటివ్‌ అధికారి మైఖేల్‌ బోస్‌ లాంఛనంగా ప్రారంభించారు.

426 జీపీలకు స్థలాలు కేటాయింపు

జిల్లాలో మొత్తం 481 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 426 పంచాయతీల్లో స్థలాలను కేటాయించారు. వీటిలో మొక్కలు నాటుతున్నారు. ఆగస్టు 15వ తేదీ నాటికి ఈ ప్రకృతి వనాలను పూర్తిచేసేందుకు అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. మరో 55 పంచాయతీల్లో స్థలాల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ పార్కుల్లో వాకింగ్‌ ట్రాక్‌ కూడా ఉంటుంది.

పల్లెల్లో పచ్చందాలు

పల్లె ప్రగతి, హరితహారం ద్వారా ఇప్పటికే పల్లె పల్లెనా పచ్చని మొక్కలు కనిపిస్తున్నాయి. పల్లె ప్రకృతి వనాలు కూడా పూర్తయితే.. పల్లెల్లో పచ్చందం పరుచుకున్నట్లే. ప్రతి పంచాయతీలో 80 శాతం మొక్కలు పెరగాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఈ నెల 15 నాటికి సిద్ధం

ఈ నెల 15వ తేదీ నాటికి పల్లె ప్రకృతి వనాలను సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కలెక్టర్‌ ఎంవీ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందుకు సంబంధించిన స్థలాలను కేటాయించాలని రెవెన్యూ అధికారులు సూచించారు. మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, పంచాయతీ అధికారులు పూర్తి బాధ్యత తీసుకుంటున్నారు.