గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Aug 04, 2020 , 07:55:45

మరో ముందడుగు

 మరో ముందడుగు

  •  శరవేగంగా ‘సీతారామ’ పనులు 
  • అక్టోబర్‌ లోపు మొదటి ప్యాకేజీ పూర్తి
  • పంప్‌, మోటార్ల పనుల్లో నిమగ్నమైన కార్మికులు
  • ఈ నెల 15 నాటికి డ్రై రన్‌

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సీతారామ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్ట్‌ నిర్మిస్తున్నది..   ఈ పనుల్లో మరో ముందడుగు పడింది..  భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం భీమునిగుండం కొత్తూరు వద్ద నిర్మిస్తున్న మొదటి ప్యాకేజీ నిర్మాణాన్ని ఈ అక్టోబర్‌ నాటికి పూర్తి చేయాలన్న సంకల్పంతో అధికారులు పనులు చేపడుతున్నారు. ఈ       పంప్‌ హౌజ్‌లో మొత్తం ఆరు పంప్‌లు, ఆరు మోటార్లు బిగించాల్సి ఉండగా ఇప్పటికే రెండు పంప్‌లు, రెండు మోటార్లు బిగించారు.. తాజాగా మరో రెండు పంప్‌లు, రెండు మోటార్లు ప్యాకేజీ వద్దకు చేరాయి.. ఈ నెల 15 నాటికి డ్రై రన్‌ నిర్వహించేందుకు  అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

-అశ్వాపురం

అశ్వాపురం: భద్రాద్రి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సీతారామ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్ట్‌ పనుల్లో మరో ముందడుగు పడింది. వచ్చే అక్టోబర్‌ నాటికి మొదటి ప్యాకేజీ పూర్తిచేయాలన్న సంకల్పంతో అధికారులు శరవేగంగా పనులు కొనసాగిస్తున్నారు. మొదటి పంప్‌ హౌజ్‌లో మొత్తం ఆరు పంప్‌లు, ఆరు మోటార్లు బిగించాల్సుంది. ఇప్పటికే రెండు పంప్‌లు, రెండు మోటార్లు బిగించారు. తాజాగా మరో రెండు పంప్‌లను ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడ బిగించిన పంప్‌ల సంఖ్య నాలుగుకు చేరింది. అశ్వాపురం మండలం భీమునిగుండం కొత్తూరు (బీజీ కొత్తూరు) వద్ద పంప్‌ హౌజ్‌ నిర్మాణంలో దీనిని పెద్ద ముందడుగుగా అధికారులు చెబుతున్నారు. మిగిలిన రెండు పంప్‌లు, నాలుగు మోర్టార్లు ఏర్పాటు పనులు కూడా దాదాపుగా పూర్తికావచ్చాయి. మొత్తంగా 80 శాతం పనులు పూర్తయ్యాయి. గత నెల 10న సీతారామ ప్రాజెక్ట్‌ పనులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌, నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌ పరిశీలించి, అధికారులతో సమీక్షించారు. అప్పటి నుంచి నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. డిసెంబర్‌ చివరి నాటికి ప్రాజెక్ట్‌ పనులను పూర్తి చేసి రైతులకు కచ్చితంగా నీళ్లందిస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

శరవేగంగా కెనాల్‌ నిర్మాణం

కెనాల్‌ నిర్మాణ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. కుమ్మరిగూడెం నుంచి భీముడిగుండం కొత్తూరు వరకు కెనాల్‌ నిర్మాణ పనులు 90 శాతం పూర్తయ్యాయి. కొత్తగూడెం నుంచి మణుగూరు వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారిపై అశ్వాపురం మండలం గొల్లగూడెం వద్ద నిర్మిస్తున్న వంతెన సిద్ధమైతే.. మొదటి ప్యాకేజీలోని కెనాల్‌ పనులు 100 శాతం పూర్తయినట్లే.

రెండవ ప్యాకేజీలో సైతం కెనాల్‌ పనులు 90 శాతం పూర్తయ్యాయి. 37 స్ట్రక్చర్లకుగాను 14 స్ట్రక్చర్లు పెండింగ్‌లో ఉన్నాయి. నెలలో మొదటి, రెండవ ప్యాకేజీ కెనాల్‌ పనులు 100 శాతం పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. చాలా రోజుల క్రితమే మోటార్లు, పంప్‌లు చైనా నుంచి దిగుమతయ్యాయని, పెండిగ్‌లో ఉన్న పంప్‌లు, మోటార్ల ఏర్పాటు పనులను అక్టోబర్‌ నాటికి పూర్తిచేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పూర్తిగా ఏర్పాటుచేసిన రెండు మోటార్లను మాత్రం ఆగస్టు 15 వరకు డ్రై రన్‌ పూర్తిచేస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పంప్‌ హౌజ్‌లకు చేరుకున్న మోటార్లు, పంపులు


ములకలపల్లి: మండల పరిధి వీకే.రామవరం, కమలాపురం గ్రామాల్లో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు పంపుహౌజ్‌లకు చైనా నుంచి మోటార్లు, పంపులు భారీ కంటైనర్లలో సోమవారం చేరుకున్నాయి. వీకే.రామవరంలో ఆరు మోటార్లు, 5 పంపులు ఇప్పటికే చేరుకున్నాయి. కమలాపురంలో ఏడు మోటార్లు అవసరముండగా మూడు మోటార్లు ఇప్పటికే పంపుహౌజ్‌కు చేరుకోగా, ఇంకా నాలుగు మోటార్లు రావాల్సి ఉంది. ఈ రెండు పంపుహౌజ్‌ల్లో పంపులు, మోటార్ల నిర్మాణం పూర్తయి ఆగస్టు చివరికి డ్రైరన్‌ చేసి, డిసెంబర్‌ చివరి వరకు ట్రయల్న్‌ నిర్వహించనున్నట్లు  సంబంధిత అధికారులు తెలిపారు..