గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Aug 03, 2020 , 03:52:29

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతిరూపం

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతిరూపం

  • నేడు రాఖీ పౌర్ణమి
  • ఇంటింటా సందడి 

కొత్తగూడెం టౌన్‌: అన్నాచెల్లెళ్లు.. అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతిరూపం రాఖీ.. రక్త సంబంధాలకు తీయని వేడుక.. సోదరుడి మణికట్టుపై సోదరి కట్టే రక్షాదారాలు అనురాగాల మొగ్గలు తొడిగి ఆప్యాయత కుసుమాలు వికసించి వాత్సల్య పరిమళాలు వెదజల్లుతాయి. సౌభ్రాతృత్వం, సామరస్యత వెల్లివిరిసేందుకు ఈ పున్నమి వేడుకను వేదికగా చేసుకునే సంప్రదాయం కొనుసాగుతుంది. 

అమ్మలోని మొదటి సగం.. నాన్నలోని చివరి సగం.. కలిపితేనే అన్న.. అమ్మలోని కమ్మదనాన్ని... నాన్నలోని మాధుర్యాన్ని ప్రతి అన్నా తన చెల్లెలికి అందించాలని కోరుకుంటాడు. వేద కాలంలో శ్రావణ పౌర్ణమికి ప్రాధాన్యత ఉండేది. వేదవిద్యను నేర్చుకోవడానికి వచ్చే విద్యార్థులకు ఈ రోజున యజ్ఞోపవితం చేసేవారు. మిగిలిన విద్యలు నేర్చుకునే వారి మణికట్టుకు దారం కట్టేవారు. అన్నాచెల్లెల అనుబంధానికి గతంలో ప్రాముఖ్యం ఉండేది. గ్రామాల్లో ఏరువాక సాగిన తరువాత అన్న తన చెల్లెలి ఇంటికి వెళ్లి తొలుత బావకు, చెల్లికి వ్యవసాయ పనుల్లో సాయంగా ఉండేవాడు. అరక తోలడం నుంచి ఎరువులు వేయడం, కలుపులు తీయించడం అన్నీ దగ్గరుండే చేయించేవాడు. తన పనులు కన్నా తన చెల్లెలి పనులు అత్యంత శ్రద్ధతో చేసేవాడు. అందుకే బామ్మర్ది బావ బ్రతుకు కోరుతాడనే సామెత వచ్చింది. 

వైఖాసన మహర్షి పుట్టిన రోజు నేడు

సకల వైష్ణవ ఆలయాల్లో అర్చనా విధానాన్ని తెలియజెప్పిన వైఖాసన మహర్షి జన్మించింది ఈ రోజునే. వైఖాసన సూత్రమనే ప్రకరణాన్ని రచించిన ఆ మహనీయుడు నేటికీ ఆయన వంశీకులైన వైఖాసనులచే శ్రావణ పూర్ణిమ రోజున ప్రత్యేక పూజలు అందుకుంటారు. సకల విద్యలకు అదిపతులైన హయగ్రీవుడు అవతరించింది శ్రావణపూర్ణిమ రోజునే. పలు దేవాలయాల్లో నేటి నుంచి పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమవుతాయి. 

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతిరూపం 

ప్రతి ఇంట్లో ఈ పండుగను జరుపుకుంటారు. ఎక్కడ ఉన్నా ఈ శ్రావణ పౌర్ణమికి అన్నాతమ్ముళ్లకు రాఖీలు కట్టాలని అక్కా చెల్లెల్లు ఆశపడుతుంటారు. తన సోదరితో రాఖీలు కట్టించుకోవాలని, తనకు అండగా ఉంటానని హామీ ఇవ్వడానికి సోదరులు ఆరాట పడుతుంటారు. సోదరుడి నుదిటిన తిలకం దిద్ది ముంజేతి మణికట్టుపై రక్షాబంధనాలు కట్టి వారిచ్చే కానుకలు స్వీకరిస్తారు. పరస్పరం మిఠాయిలతో నోరు తీపి చేసుకుంటారు.