సోమవారం 30 నవంబర్ 2020
Badradri-kothagudem - Aug 02, 2020 , 01:12:59

పిడుగుపాటుతో మహిళా కూలీ మృతి

పిడుగుపాటుతో మహిళా కూలీ మృతి

  • మరో మహిళ పరిస్థితి విషమం

పినపాక: వరినాటు వేస్తున్న కూలీలపై పిడుగుపడడంతో ఒకరు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన పినపాక మండలం బోటిగూడెం గ్రామంలో శనివారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. బోటిగూడెం గ్రామానికి చెందిన మహిళా కూలీలు గ్రామ సమీపంలోని పొలాల్లో వరి నాట్లు వేసేందుకు వెళ్లారు. మధ్యాహ్నం వరకు నారు పీకారు. భోజనాలకు ఇళ్లకు వెళ్లి తిరిగి నాటు వేసేందుకు పొలాల్లోకి వెళ్లారు. ఈ క్రమంలో కూలీలంతా గట్లపై నడుస్తుండగా అకస్మాత్తుగా వర్షపు జల్లులు మొదలయ్యాయి. ఆ వెంటనే వీరి పక్కనే పిడుగుపడింది. దీంతో కూలీలంతా చెల్లాచెదురుగా పడిపోయారు. వీరిలో అదే గ్రామానికి చెందిన నూప నిర్మల (28) అక్కడికక్కడే మృతిచెందింది. నూప అనూష అనే మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆమెను పినపాక పీహెచ్‌సీకి తరలించారు. 108 అంబులెన్స్‌ ద్వారా కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనలో కొమరం శిరీష అనే మహిళ స్వల్ప అస్వస్థతకు గురైంది. ఆమెకు పినపాక పీహెచ్‌సీలోనే చికిత్స అందిస్తున్నారు. మృతురాలు నిర్మలకు భర్త నరేష్‌తోపాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా మృతురాలి కుటుంబానికి, గాయపడిన అనూష కుటుంబానికి ఎంపీపీ గుమ్మడి గాంధీ, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పగడాల సతీష్‌రెడ్డి, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ కొండేరు రాము, బోటిగూడెం సర్పంచ్‌ సోంబోయిన సుధాకర్‌లు రూ.9 వేల ఆర్థిక సాయం అందించారు. తొలుత ఆయా కుటుంబాలను పరామర్శించారు.