గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Jul 30, 2020 , 01:22:21

జాగ్రత్తలతోనే కరోనాను కట్టడి

జాగ్రత్తలతోనే కరోనాను కట్టడి

కొత్తగూడెం: కరోనా అంటే భయాందోళనలు అవసరం లేదని, మనం తీసుకునే జాగ్రత్తలతోనే కరోనాను కట్టడి చేయవచ్చని కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ నుంచి కరోనా వ్యాధి నియంత్రణ చర్యలపై వైద్యాధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి మాస్కు ధరించడం,  భౌతికదూరం పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, ఆందోళన, భయభ్రాంతులకు గురి కావొద్దన్నారు. సాధారణ ఆరోగ్య అలవాట్లు, తగినంత నిద్ర, ఆహారం తీసుకోవడం, వయోవృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కరోనా వ్యాధి సోకే ప్రమాదం ఉందని, వీళ్లందరినీ ప్రత్యేక శ్రద్ధతో రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా వ్యాధి సోకి మరణాలు సంభవించడం చాలా దురదృష్టకరమని, మరణించిన వ్యక్తుల కుటుంబ సభ్యులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, జిల్లా యంత్రాంగం అండగా నిలుస్తుందని చెప్పారు. హోం క్వారంటైన్‌ ముగిసేంత వరకు ప్రతిరోజు మెడికల్‌, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్‌ సిబ్బంది పర్యవేక్షణ చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. కష్టకాలంలో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. వైద్యశాఖ నిబంధనలను అనుసరించి మరణించిన వ్యక్తుల కుటుంబ సభ్యులకు వ్యాధి లక్షణాలు లేకపోతే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే అవకాశం లేదని, ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. వ్యాధి చికిత్సలు కోసం కొత్తగూడెం, భద్రాచలం ఆస్పత్రుల్లో ఉన్న వెంటిలేటర్లకు అధనంగా మరికొన్ని వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచామన్నారు. రానున్న రోజులు వ్యాధి సంక్రమణకు చాలా కీలకమని, ప్రజలు సంయమనం పాటించి భయబ్రాంతులకు గురికాకుండా పటిష్ట హోం క్వారంటైన్‌ పాటిస్తూ ఇతరులను కలువకుండా బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. వర్షాలతో వాతావరణం చల్లబడటం వల్ల వైరస్‌ వ్యాప్తికి ఎక్కువ అవకాశాలున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.