బుధవారం 02 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Jul 30, 2020 , 01:22:23

రైతుసేవా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

రైతుసేవా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

  • ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య 

తల్లాడ : ఆగ్రోస్‌ రైతుసేవా కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. బుధవారం మండల పరిధిలోని నూతనకల్‌లో ఏర్పాటు చేసిన ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాన్ని డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల వెంకటశేషగిరిరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం రైతుసేవా కేంద్రాల్లో ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు సరఫరా చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుసంక్షేమం కోసం నిత్యం పనిచేస్తున్నారని అన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలతో పాటు, రుణమాఫీని కూడా రైతులకు వర్తింపచేస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని అగ్రభాగాన నిలుపుతున్నారన్నారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల వెంకటశేషగిరిరావు మాట్లాడుతూ రైతును రాజును చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషిచేస్తున్నారన్నారు. ఆగ్రోస్‌ రైతు కేంద్రాల్లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను, పురుగుమందులను ప్రభుత్వమే సరఫరా చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవీందర్‌రెడ్డి, ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, వ్యవసాయాధికారి ఎం.డీ.తాజుద్దీన్‌, నిర్వాహకులు అర్జున్‌రావు, సొసైటీ చైర్మన్లు రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, అయిలూరి ప్రదీప్‌రెడ్డి, తూము వీరభద్రరావు, శీలం కోటారెడ్డి, ఏఈవో నాగుల్‌మీరా, సర్పంచ్‌ తూము శ్రీనివాసరావు, మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ దూపాటి భద్రరాజు, దుగ్గిదేవర వెంకట్‌లాల్‌, వజ్రాల రామిరెడ్డి, నాయుడు శ్రీనివాసరావు, కేతినేని చలపతి, తదితరులు పాల్గొన్నారు. 

రూ. 6లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత

ఖమ్మం రూరల్‌ : రూరల్‌ మండలం పెద్దతండా పరిధిలోని ఆర్టీసీ కాలనీకి చెందిన తులం రవి ప్రైవేట్‌ ఎలక్ట్రిషీయన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గతంలో  విద్యుత్‌ మరమ్మతులు చేస్తున్న సమయంలో రాంగ్‌ ఎల్సీ వల్ల రవి చేతులు కోల్పోయాడు. వైద్యం కోసం దాదాపు రూ.18లక్షల పైగా ఖర్చు అయింది. పరిస్థితిని తన స్నేహితుని ద్వారా తెలుసుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర.. సీఎం కేసీఆర్‌కు రవి పరిస్థితిని వివరించి సీఎం సహాయనిధి ద్వారా బాధితునికి రూ. 6లక్షల చెక్కును మంజూరు చేయించారు. ఆ చెక్కును బుధవారం రవికి ఎమ్యెల్యే సండ్ర వెంకటవీరయ్య అందజేశారు. ఎమ్మెల్యే సండ్ర, సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటానని రవి తెలిపారు. 

పవిత్రోత్సవాలకు అంకురార్పణ

భద్రాచలం : భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో బుధవారం పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేశారు. ముందుగా పవిత్ర గోదావరి నది నుంచి తీర్థ బిందెతో నదీ జలాలను తీసుకొచ్చి అంకురార్పణ నిర్వహించారు. ఈ సమయంలో పవిత్రోత్సవాలు నిర్వహించే ఆచార్య, రుత్వికులకు, వేద పారాయణం చేసే వారికి దేవస్థానం తరపున దీక్షా వస్ర్తాలను అందజేశారు. పవిత్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం అష్టోత్తర శత కలశ అభిషేకం, అగ్ని ప్రతిష్ఠ, పవిత్రాదివాసం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకలు కత్తి శ్రీనివాస్‌, అర్చకులు పాల్గొన్నారు.