ఆదివారం 06 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Jul 29, 2020 , 03:10:31

సాగు వివ‌రాలు ప‌క్కా

సాగు వివ‌రాలు ప‌క్కా

సుజాతనగర్‌: రైతులు సాగు చేస్తున్న పంటల వివరాల సేకరణలో వ్యవసాయ అధికారులు నిమగ్నమయ్యారు. నియంత్రిత సాగు విధానంలో భాగంగా రైతు యూనిట్‌గా పంటల సాగు, విత్తనాల రకాలు, సెల్‌ఫోన్‌ నంబర్‌ తదితర వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ రైతుల వారీగా సాగు విస్తీర్ణం వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసే పనిలో పడ్డారు. ఈనెల 31వరకు అవకాశం ఉండడంతో రైతులు ఏఈవోలకు పంట సాగు వివరాలు అందజేయాలని వ్యవసాయాధికారులు కోరుతున్నారు. 

ఆన్‌లైన్‌లో వివరాల నమోదు

పంటల సాగు, వ్యవసాయ స్థితిగతులపై సర్వే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత సర్వేలతో సంబంధం లేకుండా ఈ వానాకాలంలో రైతుల వారీగా సాగుకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. 

వివరాలు నమోదు చేసుకుంటేనే కొనుగోళ్లు

రైతుల వారీగా సర్వే నెంబర్‌, సాగు విస్తీర్ణం, సాగుచేసిన పంట, విత్తన రకం, ప్రధాన పంట, అంతర్‌పంట, నీటి వసతి, సెల్‌ఫోన్‌ నెంబర్‌, చివరలో రైతు సంతకం తీసుకోనున్నారు. వివరాల లెక్క తేలకపోవడంతో గత సీజన్‌లో ఆన్‌లైన్‌లో పేర్లు లేకున్నా అమ్మకాలకు అవకాశం ఇచ్చారు. తాజాగా ఆన్‌లైన్‌లో పేరు, సాగు చేసిన పంట వివరాలు ఉంటేనే కేంద్రాల్లో మద్ధతు ధరకు విక్రయించుకునే అవకాశం ఉంటుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. 

రైతు ఫోన్‌కు పూర్తి సమాచారం 

రైతుల వారీగా సేకరించిన పంటల సాగు వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తరువాత రైతుల నుంచి సేకరించిన సెల్‌ఫోన్‌కు పూర్తి సమాచారం పంపిస్తారు. రైతు వారీగా ఎన్ని ఎకరాలు ఉంటే వాటిలో ఏయే పంటలు సాగు చేశారనే సమాచారం రైతుల ఫోన్‌కు సమాచారం పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.  ఏఈవోలు రైతుల వారీగా సాగు చేసే పంటల వివరాలు, విత్తన రకాలు, నీటి వసతి, యంత్ర పరికరాలు, పశువులు తదితర వివరాలు నమోదు చేస్తున్నారు.