శనివారం 28 నవంబర్ 2020
Badradri-kothagudem - Jul 29, 2020 , 03:07:16

పట్టణ ప్రగతిపై సమగ్ర వివరాలు అందజేయాలి

పట్టణ ప్రగతిపై సమగ్ర వివరాలు అందజేయాలి

కొత్తగూడెం: పట్టణ ప్రగతిపై సమగ్ర వివరాలు అందజేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్లు, పట్టణ ప్రగతి అధికారులతో కలెక్టర్‌ టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఆగస్టు 1వ తేదీన మంత్రి కేటీఆర్‌తో పట్టణాల అభివృద్ధిపై ఎమ్మెల్యేలు, మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్లు, ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నందున మున్సిపాలీటీల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని చెప్పారు. పట్టణాల అభివృద్ధిపై రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి నిర్వహించనున్న సమీక్షా సమావేశాన్ని ఒక అవకాశంగా తీసుకొని రానున్న రోజుల్లో మున్సిపాలిటీల్లో చేపట్టాల్సిన అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు తయారు చేయాలన్నారు. కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపల్‌ చైర్మన్లు కాపు సీతాలక్ష్మీ, డి.వెంకటేశ్వర్లు, పట్టణ ప్రగతి ప్రత్యేక అధికారులు కృపాకర్‌రావు, వేణుగోపాల్‌, వెంకటేశ్వర్‌రెడ్డి, రాములు, మున్సిపల్‌ కమీసనర్లు సంపత్‌కుమార్‌, శ్రీకాంత్‌, వెంకటస్వామి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మొక్కలు నాటని అధికారుల జాబితా సిద్ధం చేయాలి 

హరితహారంలో మొక్కలు నాటని శాఖాధికారుల జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి డీఆర్‌డీవో మధుసూదన్‌రాజుకు సూచించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో మొక్కలు నాటడంలో జాప్యం చేసిన అధికారుల నుంచి వివరణ తీసుకుంటామని, దీంతో పాటు ఆయా శాఖల ప్రధాన అధికారులకు లేఖలు రాయనున్నట్లు తెలిపారు. జియో ట్యాగింగ్‌లో చాలా తక్కువ లక్ష్యం సాధించిన అధికారులందరిపై ప్రభుత్వానికి నివేదికలు పంపడానికి నివేదికలు సిద్ధ్దం చేయాలని తెలిపారు.