సోమవారం 30 నవంబర్ 2020
Badradri-kothagudem - Jul 28, 2020 , 02:03:09

రాతి చెరువుపై ఆక్రమణలు తొలగించాలి

రాతి చెరువుపై ఆక్రమణలు తొలగించాలి

  •  n నిర్మాణాలపై సమగ్ర నివేదిక అందించాలి
  •  n పాల్వంచ నడిబొడ్డునే ఇలా ఐతే ఎలా?
  •  n భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి
  •  n హోటల్‌ యజమానికి రూ.25 వేల ఫైన్‌
  •  n కొవిడ్‌ నిబంధనలు పాటించనందుకు శిక్ష

పాల్వంచ: పాల్వంచ పట్టణం నడిబొడ్డున గల రాతిచెరువు ఆక్రమణలపై సమగ్ర నివేదికను అందజేయాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ ఎంవీ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాతి చెరువును సోమవారం సాయంత్రం ఆయన సందర్శించారు. చెరువు పరిరక్షణకు సరిహద్దులు ఏర్పాటు చేయాలని, అలాగే చెరువు ముందు భాగంలో ఉన్న భూమి హద్దులను కూడా నిర్ధారించాలని తహసీల్దార్‌ భగవాన్‌రెడ్డిని ఆదేశించారు. చెరువు చుట్టూ పెన్సింగ్‌ వేయాలని సూచించారు. చెరువును ఆక్రమించి నిర్మించిన ఇళ్ల వివరాల నివేదికను కూడా తయారు చేయాలని ఆదేశించారు. చెరువు అలుగు పారే కాలువ కూడా ఆక్రమణకు గరికావడం వల్ల నీరు సాఫీగా వెళ్లే అవకాశం లేకపోయిందన్నారు. ఆ నీరంతా సమీపంలోని ఇళ్లల్లోకి చెరుతున్నదని అన్నారు. చెరువు కట్ట మీద ఆహ్లదకర వాతావరణం ఉన్నందున ఇక్కడ పూల మొక్కలను, నీడను ఇచ్చే మొక్కలను నాటి సంరక్షించాలని మున్సిపాలిటీ కమిషనర్‌ చింతా శ్రీకాంత్‌ను ఆదేశించారు.

అనంతరం ఆయన బొల్లోరిగూడెంలో గల చిల్డ్రన్స్‌ పార్కును సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఓపెన్‌ జిమ్‌ను పరిశీలించి హరితహారం కింద మొక్కలు నాటారు. పార్కులో గతంలో నాటిన మొక్కలకు ట్రీగార్డులను ఏర్పాటు చేయాలని కమిషనర్‌కు సూచించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి వైద్యాధికారులతో సమీక్షించారు. పాల్వంచలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ పరీక్షా కేంద్రాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని, పలు జాగ్రత్తలు తీసుకోవాలని, పరీక్షల కోసం వచ్చే వారికి వైద్యం అందించే వారు కచ్చితంగా పీపీఈ కిట్లు ధరించాలని సూచించారు. ఆర్డీవో స్వర్ణలత, డీఎంహెచ్‌వో భాస్కర్‌నాయక్‌, మున్సిపల్‌ ప్రత్యేక అధికారి వేణుగోపాల్‌, డీఆర్డీఏ పీడీ మధుసూదన్‌రాజు, డీసీహెచ్‌ఎస్‌ ముక్కంటేశ్వరరావు, ఏడీఎంహెచ్‌వో వినోద్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ చింతా శ్రీకాంత్‌, వైద్యాధికారులు, ప్రోగ్రాం ఆఫీసర్లు, తహసీల్దార్‌ భగవాన్‌రెడ్డి, ఎంపీడీఓ అల్బర్ట్‌ పాల్గొన్నారు.

హోటల్‌ యజమానికి జరిమానా

పట్టణంలోని కిన్నెరసాని రోడ్డులో ఉన్న గుడ్‌మార్నింగ్‌ హోటల్‌ను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా, మాస్కులు ధరించకుండా అమ్మకాలు జరపడాన్ని ఆయన గమనించారు. వంటలు తయారు చేసే విధానాన్ని, అక్కడ ఉన్న అపరిశుభ్రతను పరిశీలించి అసహనం వ్యక్తం చేశారు. హోటల్‌ యజమానికి రూ.25 వేలు జరిమానా విధించారు. మార్పు రానట్లయితే హోటల్స్‌ను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు.