సోమవారం 23 నవంబర్ 2020
Badradri-kothagudem - Jul 28, 2020 , 01:16:31

ప్రభుత్వాసుపత్రిలో ఎస్పీ సతీమణి ప్రసవం

ప్రభుత్వాసుపత్రిలో ఎస్పీ సతీమణి ప్రసవం

కొత్తగూడెం క్రైం: ఆయనొక ఐపీఎస్‌ అధికారి. జిల్లా పోలీస్‌ బాస్‌ కూడా. ఆయన తలుచుకుంటే సకల సౌకర్యాలూ నడిచి వస్తాయి. ఆయన శాసిస్తే జరిగనిదంటూ ఏదీ ఉండదు. కానీ ఇవన్నీ పక్కనపెట్టి ఒక సామాన్యుడిలా వ్యవహరించారాయన. తన సతీమణికి పురిటి నొప్పులు వస్తే సర్కారు దవాఖానలో చేర్పించారు. ఆయనే భద్రాద్రి ఎస్పీ సునీల్‌దత్‌. ఎస్పీ సునీల్‌దత్‌ సతీమణి నిశితశర్మ. ఆమెకు సోమవారం పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో మరో ఆలోచన లేకుండా సామాన్యుడిలా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలకు ఆమెను తీసుకెళ్లారాయన. వెంటనే చేర్చుకున్న వైద్యులు పరీక్షలన్నీ చేశారు. పూర్తి ఆరోగ్యంగా సాయంత్రం సమయంలో నిశిత శర్మ ఓ పండంటి మగ శిశువుకి జన్మనిచ్చింది. ఈ విషయం ఆసుపత్రి వర్గాల ద్వారా బయటికి తెలియడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. జిల్లా ఎస్పీ హోదాలో ఉన్న ఐపీఎస్‌ అధికారి సామాన్యుడిలా తన సహధర్మచారిణికి ప్రభుత్వ వైద్యశాలలో డెలివరీ చేయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. హాట్సాఫ్‌ చెప్పి సెల్యూట్‌ చేశారు. ప్రభుత్వ వైద్యశాలల్లో నాణ్యమైన వైద్యం అందుతుందనే విషయాన్ని ఆయన చాటిచెప్పారు. కాగా ఎస్పీ దంపతులకు మొదట పాప ఉంది. ఆయన సతీమణికి ఇంది రెండో కాన్పు.