బుధవారం 02 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Jul 26, 2020 , 07:45:37

ప్రతి ఇల్లు ఒక ఇన్నోవేషన్‌ కావాలి

ప్రతి ఇల్లు ఒక ఇన్నోవేషన్‌ కావాలి

  • వినూత్న ఆవిష్కరణల దిశగా ఆలోచించాలి
  • నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలి
  • టెలీకాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ ఎంవీ రెడ్డి

కొత్తగూడెం: ప్రతి ఇల్లు ఒక ఇన్నోవేషన్‌ కావాలని, ఇంటింటా ఇన్నోవేటర్‌ తయారు చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటా ఇన్నోవేషన్‌ కార్యక్రమాలను చేపట్టి ఔత్సాహికుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  వయోబేధం లేకుండా ప్రతి ఒక్కరూ వారి వినూత్న ఆలోచనలు ఆవిష్కరించి మన జిల్లాకు, రాష్ర్టానికి ఉపయోగపడే నవీన ఆవిష్కరణలు ఆవిష్కరించేందుకు ఛాలెంజ్‌గా తీసుకోవాలన్నారు. పామాయిల్‌ గెలల నుంచి కాయలు తీసిన తరువాత వచ్చిన పిప్పిని యువరైతు పొలాల్లో పరచారని, దాని వల్ల కలుపు నివారణతో పాటు పంటలకు నీరు సమృద్ధిగా అందిందన్నారు. అధిక దిగుబడులు సాధించేందుకు ఉపయోగపడిందని, ఇదొక చక్కని ఇన్నోవేటర్‌ అని ఆయన వివరించారు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసేందుకు ఈ నెలాఖరు వరకు మాత్రమే సమయం ఉందని, క్షేత్రస్థాయి సిబ్బందిని సమన్వయం చేస్తూ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. 

మల్లన్నవాగుపై డైవర్షన్‌ రోడ్డును వెంటనే ఏర్పాటు చేయాలి 

మల్లన్నవాగుపై వరద ఉధృతి తగ్గిన వెంటనే పెద్ద పైపులు వేయించి డైవర్షన్‌ రోడ్డు పనులు చేపట్టాలని   కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి రోడ్లు భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లో వంతెన నిర్మాణ పనులు పూర్తి చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించనున్నట్లు తెలిపారు.  శుక్రవారం నిండు గర్బిణీ పురిటి నొప్పులతో వాగుదాటిన సంఘటన పునరావృతం కాకుండా  ఉండాలంటే వంతెన పనులు యుద్ధ ప్రాతిపదికన జరిగేలా నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. ఆ ప్రాంత ప్రజలకు వైద్య సేవల్లో ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.