బుధవారం 25 నవంబర్ 2020
Badradri-kothagudem - Jul 26, 2020 , 07:30:53

శ్రీరస్తు శుభమస్తు

శ్రీరస్తు శుభమస్తు

  • రోజురోజుకూ మారుతున్న వివాహ వేడుకల స్వరూపం  
  • నేటికీ ఆహ్వాన పత్రికల్లో అక్షరాలకు తగ్గని ఆదరణ
  • రాశి, తిథి, వారం, నక్షత్ర నామాలతో ముద్రణ
  • కృతయుగం నుంచి కొనసాగుతున్న సంప్రదాయం

కాలం మారింది. దానికి కరోనా తోడైంది. వేడుకల స్వరూపమూ మారింది. కానీ స్వభావం మాత్రం చెక్కుచెదర లేదు. ‘వాట్సాప్‌లో వెడ్డింగ్‌ కార్డు పంపాను. ముహూర్తం సమయానికి ఆన్‌లైన్‌లో అక్షింతలు వేయండి’ అనే పిలుపులు ప్రస్తుత తరుణంలో వినిపిస్తున్నాయి. అయినా ఆహ్వాన పత్రికల్లో మాత్రం సంప్రదాయ అక్షరాలకు ఆదరణ తగ్గలేదు. ప్రతి పెండ్లి పత్రికా తెలుగు సంవత్సరం, మాసం, వారం, తిథి, నక్షత్రం, యోగ నామాలతోనే అచ్చు అవుతున్నది. అసలు ఇవి లేకుండా ఆహ్వానపత్రికే ఉండడం లేదు. ఆధునిక కాలంలో ఇన్విటేషన్‌, వెడ్డింగ్‌ కార్డుల రూపం మారినా హిందూ ధర్మశాస్త్రం ప్రకారం వాటిలో అక్షరాల ఆచారం మాత్రం మారలేదు. అంతటి ఆదరణ కలిగిన ఆహ్వాన పత్రికలపై ‘నమస్తే’ ప్రత్యేక కథనం. 

 -కొత్తగూడెం

లగ్నపత్రికల్లో తిథి, వారం, నక్షత, యోగ, కరణ నామాలకు నేటికీ ఆదరణ తగ్గలేదు. వేడుక ఏదైనా, పిలుపు ఏమైనా పత్రికలతోనే ఆహ్వానం పలకడం అనాదిగా వస్తున్న ఆచారమే. వివాహ ఆహ్వాన పత్రికలు ఆధునికంగా ఉన్నా ‘చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి’ అంటూ వధువును, ‘చిరంజీవి’ అంటూ వరుడిని సూచించే సంప్రదాయం నేటికీ మనుగడలోనే ఉంది. వివాహాలు ఆన్‌లైన్‌లో జరిగినా, హంగు ఆర్భాటాలతో జరిగినా తిథి, నక్షత్రాలతో కూడిన ముహుర్తాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. కృతయుతంలో మొదలైన ఆహ్వానపత్రికలు త్రేతాయుగం, ద్వాపరయుగం దాటి నేటి కలియుగంలోనూ ఆదరణను చూరగొంటూనే ఉన్నాయి. - కొత్తగూడెం 

నాడు బహిరంగ ప్రకటనలు..  నేడు ఆహ్వాన పత్రికలు.. 

పురాణాల ప్రకారం వివాహాలు, వేడుకల ఆహ్వానాలను 1440ల్లో బహిరంగ ప్రకటనలు, చాటింపుల ద్వారా తెలిపేవారు. అప్పుడు నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండడంతో ఈ పద్ధతి అమలులో ఉండేంది. ఈ ఆహ్వాన ప్రకటన విన్న ఎవరైనా ఆ వేడుకకు హాజరయ్యే వారు. తరువాత కాలంలో రాత పూర్వక ఆహ్వానాలు అందుబాటులోకి వచ్చాయి. 1600ల్లో సంపన్నులు తమ వివాహ ఆహ్వానాలను దినపత్రికల ద్వారా ప్రకటించడం ప్రారంభించారు. ఇక ఆహ్వాన ప్రతిక పైభాగాన ఉన్న కవరుకు కూడా చరిత్రే ఉంది. నాడు ఆహ్వాన పత్రికలు వేర్వేరు ప్రాంతాలకు రవాణా కావాలి కాబట్టి ఆ సమయంలో లోపలి కార్డుకు రక్షణగా పైన ఎన్వలాప్‌ కవరును ఉంచేవారు. అది కూడా ఆధునిక డిజైన్లతో నేటికీ కొనసాగుతోంది. 1900ల్లో పత్రికల ముద్రణలో పూర్తి మార్పులు చోటుచేసుకున్నాయి. 20 శతాబ్దంలో ఏకంగా ఆహ్వాన పత్రికలు వాట్సాప్‌లకెక్కాయి.  

సాంకేతికత పెరిగినా తగ్గని ఆదరణ

కంప్యూటర్‌ పరిజ్ఞానం పెరిగినా హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి పత్రికలకు ఆదరణ తగ్గలేదు. తెలుగు సంవత్సరాల నుంచి మొదలుకొని మాసం, వారం, తిథి, నక్షత్రాల వరకూ అన్ని పేర్లూ సంప్రదాయం ప్రకారమే ఆహ్వాన పత్రికల్లో ముద్రితమవుతున్నాయి. హిందూ ధర్మశాస్త్రంలో పెళ్లికి ముందు వరపూజను నిర్వహించాలి. తరువాత నిశ్చితార్థ కార్యక్రమాన్ని తప్పనిసరిగా చేయాలి. నిశ్చితార్థంలో అర్చకులు ‘ఓం..’ తో ప్రారంభించి లగ్నపత్రికను రాస్తారు. ఆ పత్రికనే అచ్చువేసి పెళ్లి పత్రికలా పంపిణీ చేస్తారు. సాంకేతికత పెరగడంతో వెడ్డింగ్‌ కార్డుల్లో డిజైన్లు మారాయి కానీ పత్రికల్లో ఉపయోగించే పదాలు మాత్రం పదిలంగానే ఉన్నాయి. ప్రస్తుతం కరోనా కారణంగా వివాహాలు ఆన్‌లైన్‌లలో జరుగుతున్నాయి. వెడ్డింగ్‌ కార్డులు వాట్సాప్‌లలో వస్తున్నాయి. కానీ వాటిలోని వివరాలు మాత్రం సంప్రదాయ పద్ధతిలోనే ఉంటున్నాయి. 

 గుర్తుండి పోయేది పెళ్లి పత్రిక

పెళ్లి రోజులు ఎన్ని చేసుకున్నా లగ్నపత్రిక మాత్రం ఎప్పుడూ గుర్తుండి పోతుంది. జీవితంలో మరిచిపోలేని అనుభూతులు పెళ్లి రోజులే. అందుకే పెళ్లి పత్రికకు మంచి ఆదరణ ఉంది. ప్రతి ఒక్కరూ పెళ్లి కార్డును భద్రంగా దాచుకుంటున్నారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగాక ఫేస్‌బుక్‌లో పెడుతున్నారు. అప్పుడు ఆల్బమ్‌లో తొలి పేజీలో పెళ్లి కార్డు పెట్టేవారు. ఎన్ని తరాలు మారినా, పెళ్లి కార్డుల స్వరూపం మారినా, దాని సంప్రదాయం మాత్రం పదిలంగానే ఉంది. 

-బచ్చ లక్ష్మీపద్మావతి. పాల్వంచ

 సంప్రదాయం ప్రకారమే శుభలేఖలు

హిందూ ధర్మశాస్త్రం ప్రకారం పంచాంగంలో ఉన్న తిథి, వారం నక్షత్రం ప్రకారమే లగ్నపత్రికలు రాస్తాం. సంప్రదాయంగా వస్తున్న ఈ పత్రికలకు నేటికీ ఆదరణ తగ్గలేదు. ఇకముందు తగ్గదు కూడా. కృతయుగం నుంచే పత్రికలు పంచుకునే ఆనవాయితీ ఉంది. ఏ శుభకార్యానికి పిలవాలన్నా ఆహ్వాన పత్రిక తప్పనిసరిగా ఉండాల్సిందే. బొట్టుపెట్టి పత్రిక ఇచ్చి ఆహ్వానించడమే పిలుపులో ముఖ్య ఉద్దేశం.  

-కొడమంచిలి రాధాకృష్ణ శర్మ, గణేశ్‌ టెంపుల్‌ ప్రధాన అర్చకులు 

        ఒక్కో యుగంలో ఒక్కో దేవుడు.. 

కృత యుగం నుంచి ఆనవాయితీగా వస్తున్న ఆహ్వాన పత్రికలపై ఒక్కో యుగంలో ఒక్కో దేవుడి బొమ్మను అచ్చు వేస్తున్నారు. కృతయుగతంలో శివపార్వతులు, త్రేతాయుగంలో సీతారాములు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, కలియుగంలో వేంకటేశ్వరస్వామి ఫొటోలను ఆహ్వాన పత్రికల్లో అచ్చు వేస్తున్నారు. మొదట మాత్రం వినాయకుడి బొమ్మ తప్పకుండా ఉంటుంది.  

-కొండపాక సత్యనారాయణాచార్యులు, కొత్తగూడెం