గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Jul 25, 2020 , 01:14:19

9వ యూనిట్‌లో ఓవరాల్‌ పనులు పూర్తి

9వ యూనిట్‌లో ఓవరాల్‌ పనులు పూర్తి

పాల్వంచ : కేటీపీఎస్‌ 5వ దశలోని 9వ యూనిట్‌లో ఓవరాల్‌ పనులు దాదాపు పూర్తికావొచ్చాయి. యూనిట్‌కు సంబంధించిన మాక్‌ టెస్టింగ్‌ పనులు విజయవంతమయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. కేటీపీఎస్‌ 9వ దశలోని 250 మెగావాట్ల విద్యుత్‌ సామర్థ్యం కలిగిన యూనిట్‌ను జూలై 4వ తేదీన మొత్తం ఓవరాల్‌ పనుల కోసం ఉత్పత్తిని నిలిపివేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి యూనిట్‌లో మరమ్మతు పనులు ముమ్మరంగా కొనసాగించారు. దాదాపు రూ.50 కోట్ల వ్యయంతో పాడైపోయిన పరికరాలన్నింటినీ తీసివేసి, కొత్త పరికరాలను అమర్చే కార్యక్రమం పూర్తి చేశారు. 45 రోజుల వ్యవధిలో యూనిట్లో తిరిగి ఉత్పత్తి చేపట్టాలనే ఉద్దేశంతో పనులు కొనసాగాయి. కొవిడ్‌-19 పరిస్థితుల్లో కూడా వాటన్నింటినీ అధిగమించి జెన్కో సీఎండీ ఆదేశాల మేరకు మరమ్మతు పనులను పూర్తి చేశారు. బీహెచ్‌ఈఎల్‌ ఇంజనీర్ల సహకారంతో జెన్కో ఇంజనీర్లు రేయింబవళ్లు కష్టపడి యూనిట్‌లోని అన్ని విభాగాల్లో ఓవరాల్‌ పనులన్నింటినీ పూర్తి చేశారు. ప్రధానంగా బాయిలర్‌లోని హెయిర్‌ హీటర్స్‌ను తీసివేసి కొత్తవాటిని అమర్చగా వీటి వల్లనే ప్రధాన సమస్యలు తలెత్తాయి. దానిని దృష్టిలో పెట్టుకొని వాటన్నింటినీ తొలగించారు. అలాగే టర్బైన్‌లోని మూడు విభాగాల్లో కూడా బేరింగ్‌లు, తదితర సామగ్రిని మార్చేశారు. ఈఎస్‌టీ, ఐఎంసీ తదితర విభాగాల్లో కూడా దాదాపు పనులు పూర్తి చేసి శుక్రవారం యూనిట్‌ను మాక్‌ టెస్టింగ్‌ కోసం బాయిలర్‌ లైటప్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయా విభాగాల అనుసంధాన ప్రక్రియ విజయవంతమైంది. దీంతో ఇంజనీర్లు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కూలింగ్‌ టవర్‌ ప్రక్రియ కూడా విజయవంతమైంది. సీఈ రవీంద్రకుమార్‌ ఆధ్వర్యంలో ఈపనులు పూర్తయ్యాయి. ఈ నెల 31వ తేదీ నాటికి 250 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని చేపట్టి గ్రిడ్‌కు అనుసంధానం చేస్తామని సీఈ తెలిపారు.